నందికొండ వాసుల నీటిగోస | Sakshi
Sakshi News home page

నందికొండ వాసుల నీటిగోస

Published Mon, Apr 15 2024 1:50 AM

ట్యాంకర్‌ వద్ద నుంచి నీటిని తీసుకెళ్తున్న ప్రజలు - Sakshi

రూ.20 కోట్లతో పంప్‌హౌస్‌ నిర్మాణం

సాగర్‌ వాసులు నీటి అవసరాలు తీర్చేందుకు ప్రాజెక్టు ఆధునికీకరణ సమయంలో మంజూరయిన నిధుల్లో కాలనీలకు నీటిని పంప్‌ చేసేందుకు ప్రాజెక్టు దిగువన సుమారు రూ.20 కోట్లతో పంప్‌ హౌస్‌ నిర్మించారు. హిల్‌కాలనీకి మూడు మోటర్లు, పైలాన్‌కాలనీకి రెండు మోటర్లు ఏర్పాటు చేశారు. హిల్‌కాలనీ నుంచి పైలాన్‌ కాలనీకి పైపులైన్‌ వేశారు. హిల్‌కాలనీలో రెండు, పైలాన్‌కాలనీలో ఒక ఓవర్‌హెడ్‌ ట్యాంకు నిర్మించారు. కొన్నిచోట్ల పాత ట్యాంకుల ద్వారా నీటిని అందించేలా ఏర్పాట్లు చేశారు. రెండు మోటార్లు 24గంటలు నడిస్తేనే హిల్‌ కాలనీలోని రెండు ఓవర్‌హెడ్‌ ట్యాంకులకు నీళ్లు ఎక్కుతాయి. ఒక్క మోటార్‌ మరమ్మతు గురైనా నీళ్లు ఎక్కవు. అదనపు(స్టాండింగ్‌)మోటారు లేకపోవడంతో అవే మోటర్లు నడిపిస్తుంటారు. ఒక వేళ్ల అవి మరమ్మతు గురైతే వాటిని బాగు చేసే వరకు నీటి సరఫరా ఉండదు. హిల్‌కాలనీకి నీటిని పంప్‌ చేసే మోటార్‌ గత వారం మరమ్మతులకు గురికావడంతో బాగు చేసేంతవరకు నీటి సరఫరాను నిలిపివేశారు.

నాగార్జునసాగర్‌ : లక్షలాది ఎకరాలకు సాగునీరు, ఎన్నో పట్టణాలు, గ్రామాలు, తండాల ప్రజలకు తాగునీరు అందిస్తున్న నాగార్జునసాగర్‌ (నందికొండ) వాసులు నీటి కోసం గోసపడుతున్నారు. నందికొండ కాలనీల్లో రోజువిడిచి రోజు నీటిని సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం మోటార్లు మరమ్మతుకు గురి కావడంతో మూడు రోజులుగా నీరు లేక ప్రజలు తల్లడిల్లుతున్నారు. మోటర్లు, పంపులు స్టాండింగ్‌(అదనంగా)లో ఉండేందుకు ఆప్షన్‌ ఉన్నప్పటికీ నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు అధికారులు పట్టించుకోకపోవడంతో మొటార్లు, పంపులు మరమ్మతుకు గురైనప్పుడల్లా ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా 30 ఏళ్లుగా నందికొండ వాసులకు కష్టాలు తప్పడం లేదు. మున్సిపాలిటీగా ఏర్పటయ్యాక కూడా పరిస్థితి మారలేదు.

పైలాన్‌ కాలనీలో నీటి సరఫరా బంద్‌

పైలాన్‌కాలనీకి నీటిని సరఫరా చేసేందుకు నీటి శుద్ధి కేంద్రంలో రెండు పంపులు ఏర్పాటు చేశారు. మరో చోటనుంచి ఒక మోటార్‌ ద్వారా నీరు సరఫరా అవుతుంది. నీటి శుద్ధి కంఽద్రంలో అదనపు మోటరు లేదు. ఒక్క మోటార్‌ నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. మరోచోట ఉన్న మోటరు మరమ్మతుకు గురికావడంతో.. పైలాన్‌ కాలనీకి కూడా మూడు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది.

ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

పైలాన్‌కాలనీలోని వీధులకు మున్సిపాలిటీ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అత్యధిక జనాభా ఉండే పైలాన్‌కాలనీలో ట్యాంకర్ల ద్వారా నీటి పూర్తిస్తాయిలో అందకపోవడంతో కొందరు ఆటోల్లో డ్రమ్మలు పెట్టుకుని అవసరాల కోసం నీటిని తెచ్చుకుంటున్నారు. ఇక పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులకు నీళ్లు లేకపోవడంతో ప్రాజెక్టు దిగువన ఉన్న వాటర్‌ ప్లాంట్‌ వద్దకే వచ్చి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. అధికారులు స్థానికంగా ఉండకపోవడం, నీటి సరఫరాపై ఉన్నతాధికారులకు అవగాహన లేకపోవడంతో నీటి సరఫరాలో నిరంతరం అంతరాయం కలుగుతోందని స్థానికులు అంటున్నారు. అధికారులు స్టాండింగ్‌ మోటార్లను పెట్టుకుని వేసవిలో నిత్యం నీరందించేందుకు కృషి చేయాలని కోరుతున్నారు.

ఫ మూడు రోజులుగా నీళ్లు రాక

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ఫ తాగునీటికీ తప్పని తిప్పలు

ఫ పట్టింపులేని ప్రాజెక్టు అధికారులు

పంపు మరమ్మతు చేస్తున్న సిబ్బంది
1/1

పంపు మరమ్మతు చేస్తున్న సిబ్బంది

Advertisement
Advertisement