400కు పైగా సినిమాలు.. ఎన్నో సూపర్‌హిట్‌ పాటలు.. దేవా సంగీత ప్రస్థానం | Veteran Music Director Deva Filmography, Personal Life Details | Sakshi
Sakshi News home page

400కు పైగా సినిమాలు.. ఎన్నో సూపర్‌హిట్‌ పాటలు.. దేవా సంగీత ప్రస్థానం

Oct 17 2026 12:39 PM | Updated on Oct 17 2026 12:41 PM

Veteran Music Director Deva Filmography, Personal Life Details

దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో మరో విషాదం చోటుచేసుకుంది. మూడున్నర దశాబ్దాలపాటు తన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు దేవా (75) కన్నుమూశారు. అభిమానులు ‘తేనిసై తెన్రల్‌’గా ఆప్యాయంగా పిలుచుకునే ఆయన శనివారం (అక్టోబర్‌ 17) చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

మూడు దశాబ్దాలకు పైగా సాగిన తన సంగీత ప్రయాణంలో వందలాది చిత్రాలకు స్వరాలు అందించి, దక్షిణాది సినిమా సంగీతంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.  దేవా అసలు పేరు దేవనేసన్‌ చొక్కలింగం. 1950 నవంబర్‌ 20న జన్మించారు. చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. సినీ రంగంలోకి అడుగుపెట్టి తనదైన బాణీలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తమిళ చిత్రసీమలో అగ్ర సంగీత దర్శకుల్లో ఒకరిగా ఎదిగారు. తన కెరీర్‌లో 400కు పైగా సినిమాలకు సంగీతం అందించారు. రజినీకాంత్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన ‘అన్నామలై, ఆ తర్వాత బాషా, అరుణాచలం లాంటి చిత్రాలకు ఆయన అందించిన మ్యూజిక్‌ ఎంతో ప్రత్యేకం. మ్యూజిక్‌తో దేవా ఇచ్చిన ఎలివేషన్లు.. ఒకరకంగా రజినీ స్టార్‌డమ్‌కి ఎంతో సహకరించాయి.

ఎన్నో హిట్‌ ఆల్బమ్స్‌
తమిళంలో దేవా సంగీతం అందించిన చిత్రాల్లో రజనీకాంత్‌ నటించిన ‘అన్నామలై’, ‘బాషా’, ‘అరుణాచలం’ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటితో పాటు ‘ఆసై’, ‘కాదల్‌ కోట్టై’, ‘నేరుక్కు నేర్‌’, ‘నినైత్తేన్‌ వందాయ్‌’, ‘ప్రియముడన్‌’, ‘వాలి’, ‘ఖుషి’ వంటి చిత్రాల పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కథలోని భావోద్వేగాలకు అనుగుణంగా స్వరాలు అందించడంతో పాటు, మాస్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించే పాటలను రూపొందించడంలోనూ ఆయన ప్రత్యేకత చూపించారు.

(చదవండి: తనూశ్రీ ఆరోపణలు.. స్పందించిన నానా పటేకర్‌ కుమారుడు)

తమిళంలో ఘన విజయం సాధించిన బాణీలతో పాటు, తెలుగు సినిమాల్లోనూ తన సంగీత ప్రతిభను చాటుకున్నారు.  తెలుగు ప్రేక్షకులకూ దేవా సంగీతం సుపరిచితమే. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘తొలిప్రేమ’తో పాటు చిరంజీవి ‘మాస్టర్‌’, నాగార్జున ‘ఆటో డ్రైవర్‌’, దాసరి అరుణ్‌ ‘గ్రీకు వీరుడు’ ఉన్నాయి. కన్నడలో అమృతవర్షిణి, రాజా, కోటిగొబ్బ వంటి చిత్రాలకు పనిచేశారు. మలయాళంలో ‘ది ప్రిన్స్‌’, ‘ఫాంటమ్‌’ వంటి చిత్రాలకు సంగీతం అందించారు.

గానా సంగీతానికి ప్రత్యేక గుర్తింపు
దేవా పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఆయన ప్రత్యేకమైన సంగీత శైలి. జానపద బాణీలు, వేగవంతమైన బీట్స్‌, సులభంగా గుర్తుండిపోయే ట్యూన్లతో ఆయన పాటలు సామాన్య ప్రేక్షకులకు చేరువయ్యాయి. ముఖ్యంగా చెన్నై ప్రాంతానికి చెందిన ‘గానా’ సంగీతాన్ని మెయిన్‌స్ట్రీమ్‌ సినిమాల్లోకి తీసుకురావడంలో దేవా కీలక పాత్ర పోషించారు. స్థానిక సంగీత శైలికి సినిమా పాటల రూపంలో విస్తృత ఆదరణ తీసుకొచ్చారు. అందుకే అభిమానులు ఆయనను ‘తేనిసై తెన్రల్‌’గా పిలిచేవారు. ఆయన పాటలు థియేటర్లలోనే కాకుండా పండుగలు, వేడుకలు, ప్రజా కార్యక్రమాల్లోనూ మారుమోగేవి. మెలోడీ పాటల నుంచి మాస్‌ నంబర్ల వరకు విభిన్నమైన బాణీలను అందిస్తూ తనదైన ముద్ర వేశారు.

అవార్డులు.. కొనసాగుతున్న సంగీత వారసత్వం
సినీ సంగీత రంగంలో చేసిన సేవలకు దేవాకు పలు గుర్తింపులు లభించాయి. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారంతో పాటు 1992లో ‘కలైమామణి’ గౌరవం కూడా అందుకున్నారు. ఆయన సంగీత ప్రయాణం కుటుంబంలోనూ కొనసాగింది. దేవా కుమారుడు శ్రీకాంత్‌ దేవా కూడా సంగీత దర్శకుడిగా సినీ రంగంలో గుర్తింపు పొందారు.

దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన దేవా ఇక లేరన్న వార్త సంగీత ప్రియులను కలచివేస్తోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ తన బాణీలతో అభిమానులను సంపాదించుకున్న ఆయన.. దక్షిణాది సినీ సంగీత చరిత్రలో ఓ చెరిగిపోని ముద్ర వేసి వెళ్లిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement