పరువు విలువ  ఎంత?  | Tamil Movie Enna Vilai Streaming Now on Netflix | Sakshi
Sakshi News home page

పరువు విలువ  ఎంత? 

Oct 25 2026 6:17 AM | Updated on Oct 25 2026 6:17 AM

Tamil Movie Enna Vilai Streaming Now on Netflix

ఓటీటీ

ఇది చూడొచ్చు

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘ఎన్న విలై’ ఒకటి. నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న  ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. 

ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి దానికి ఓ విలువ ఉంటుంది. అలాగే కొన్ని కనిపించని వాటికి కూడా విలువ అపారం. వాటిలో ప్రధానమైనది వ్యక్తి పరువు. మరీ ముఖ్యంగా ఈ పరువు వ్యక్తిగత భావావేశాలతో ముడిపడి ఉంటుంది. అది ఎంతలా అంటే పరువు కోసం ప్రాణాలు తీయడమో, తీసుకోవడమో అన్నంతగా అన్నమాట. అందుకనే కదా తరచూ మనం పరువు హత్యలు, ఆత్మహత్యలు తదితర దారుణాలు వింటూ ఉంటాం. 

ఆ పరువుకి సంబంధించిన విలువ తెలియజేయడానికి అల్లుకున్న కథే ‘ఎన్న విలై’. తమిళనాడులో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇటీవలే నెట్‌ ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమ్‌ అవుతోంది. సజీవ్‌ పళూర్‌ తాను రాసుకున్న కథను తానే తెర కెక్కించారు. తమిళ నటుడు కరుణాస్, మలయాళ నటి నిమిషా సజయాన్‌ ప్రధాన పాత్రల్లో తమ సహజ నటనతో మెప్పించారు. నిజానికిది ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రం. 

ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికీ సంబంధమున్న కథాంశమిది. అంతలా ఏముందీ కథలో ఓసారి తెలుసుకుందాం. రామేశ్వరం సముద్ర తీరంలో నీటి అడుగున పాత నాణాలను ఏరుకుని వాటి సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్న తవసి ముత్తు కథ ఇది. అలా ఓసారి నాణాలకోసం చూస్తుండగా తవసి ముత్తుకు అనుకోకుండా వజ్రాలతో కూడిన విలువైన బంగారు కడియం ఒకటి దొరుకుతుంది. 

దాని విలువ తెలియక తవసి ముత్తు అక్కడ ఉన్న ఓ పోలీసు అధికారికి ఈ విషయం చెబుతాడు. ఆ పోలిస్‌ అధికారి దానిని చూసి అత్యాశతో తవసి ముత్తుకి తెలియకుండా అందులోని ఓ వజ్రాన్ని కాజేసి ఈ కడియం నకిలీదని తిరిగి తవసి ముత్తుకే ఇచ్చేస్తాడు. ఆ తరువాత వజ్రం అసలు విలువ తెలుసుకున్న పోలీస్‌ మొత్తంగా ఆ కడియాన్ని కాజేయాలన్న కుట్రతో తవసి ముత్తుపై లేని దొంగతనం కేసును బనాయించి అరెస్ట్‌ చేసి, చిత్రహింసలు పెడతాడు.

 ఆ పై ఈ కేసు కోర్టు విచారణకు వెళుతుంది. కడు బీదరికంలో ఉన్న తవసి ముత్తు కుటుంబం మొత్తాన్ని ఈ విషయంలో సమాజం దోషిగా చూస్తుంది. అప్పుడే కాంచన అనే లాయర్‌ తవసి ముత్తు కేసును వాదించడానికి ముందుకు వస్తుంది. తవసి ముత్తుకు సముద్రంలో దొరికిన ఆ కడియం తన కుటుంబాన్ని చివరికి ఏం చేస్తుందన్న విషయం ‘ఎన్న విలై’ సినిమాలోనే చూడాలి. పరువు కోసం పాకులాడాలి... తప్పులేదు. కానీ స్వార్థంతో ఇతరుల పరువును బజారుపాలు చేయడం ఎంతవరకు సబబు అన్నది ఎంతో హృద్యంగా ఈ చిత్రంలో చూపించారు దర్శకుడు. మస్ట్‌ వాచ్‌ ఫర్‌ ది వీకెండ్‌. 
– హరికృష్ణ ఇంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement