శ్రీవిష్ణు, హరీష్, జానకిరామ్, వెంకటకృష్ణ, భాస్కరభట్ల, నారాయణ మూర్తి
‘‘కోన వెంకట్గారు నిర్మాత కాకుంటే ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా సెన్సాన్ ఇబ్బందుల్లో పడి ఉండేది, రిలీజ్ అయ్యుండేది కాదు. చాలా దుర్మార్గం ఇది. ‘బస్తర్’, ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాలను ఎందుకు సెన్సార్ చేశారు? ఎందుకు రిలీజ్ చేశారు? ‘కామ్రేడ్ కళ్యాణ్’ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసిన మూవీ కాదు. పోలీసులకూ వ్యతిరేకం కాదు. కేవలం బ్యాక్డ్రాప్ మాత్రమే నక్సల్ బరీ మూమెంట్. నక్సలైట్లు ఏం పాపం చేశారు? వాళ్లు కూడా ఈ మట్టిలో పుట్టిన బిడ్డలే.
వారు కూడా భారతీయ పౌరులే. ఈ సినిమా తీసిన దర్శక–నిర్మాతలు కానీ, మేము కానీ నక్సలైట్లు కాదు.. మేము సినిమా తల్లి బిడ్డలం’’ అని ప్రముఖ నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి తెలిపారు. శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలయింది.
శుక్రవారం నిర్వహించిన ‘దసరా ఫన్ డగ బ్లాక్ బస్టర్ మీట్’ కి ఆర్. నారాయణ మూర్తి, డైరెక్టర్స్ హరీష్ శంకర్, వీఎన్ ఆదిత్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ–‘‘సెన్సార్ ఇబ్బందులు పెడితే సాధారణ నిర్మాత ఏం అయి పోవాలి? కోట్లతో పని. భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కల్పించొద్దు’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాను శ్రీవిష్ణు బాగా ప్రమోట్ చేశారు’’ అన్నారు కోన వెంకట్. ‘‘మా సినిమాకి ప్రేక్షకులు రూ. 30 కోట్ల రివార్డు ఇచ్చారు’’ అన్నారు వెంకట కృష్ణ కర్నాటి. ‘‘కామ్రేడ్ కళ్యాణ్’ నాకు గుర్తుండి పోతుంది’’ అని జానకిరామ్ మారెళ్ల తెలిపారు. రైటర్స్ బీవీఎస్ రవి, నందు, భాను, పాటల రచయిత భాస్కరభట్ల మాట్లాడారు.


