యాత్ర 2 ఉంటుంది.. జగన్‌ అన్న పాదయాత్ర నుంచి మొదలై... | Director, producer Mahi V Raghav talks about Yatra 2 Movie Sequel | Sakshi
Sakshi News home page

యాత్ర 2 ఉంటుంది.. జగన్‌ అన్న పాదయాత్ర నుంచి మొదలై...

May 8 2023 1:13 AM | Updated on May 8 2023 7:32 AM

Director, producer Mahi V Raghav talks about Yatra 2 Movie Sequel - Sakshi

‘‘యాత్ర’ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ప్రస్తుతం ‘యాత్ర 2’ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అయితే ఆ చిత్రంలోని పాత్రలకు తగ్గ నటీనటులు కుదరడం లేదు. పూర్తి కథ, నటీనటులు ఫైనల్‌ అయ్యాక ‘యాత్ర 2’ ని సెట్స్‌పైకి తీసుకెళతాం’’ అని డైరెక్టర్‌ మహీ వి.రాఘవ్‌ అన్నారు.

ప్రియదర్శి, అభినవ్‌ గోమటం, చైతన్య కృష్ణ, ‘జోర్దార్‌’ సుజాత, దేవయాని, పావని గంగిరెడ్డి, హర్షవర్ధన్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘సేవ్‌ ది టైగర్స్‌’. మహీ వి.రాఘవ్, ప్రదీప్‌ అద్వైతం షో రన్నర్స్‌గా తేజ కాకుమాను దర్శకత్వం వహించారు. మహీ వి.రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌ ఏప్రిల్‌ 27నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా మహీ వి.రాఘవ్‌ పంచుకున్న విశేషాలు...

► మంచి కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ‘సేవ్‌ ది టైగర్స్‌’ నిరూపించింది. కుటుంబం అంతా కలిసి మా వెబ్‌ సిరీస్‌ చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు.. దీంతో ఒక మంచి సిరీస్‌ తీశామనే తృప్తి ఉంది. ఇలాంటి చక్కని సిరీస్‌ని నిర్మించే అవకాశం మాకు కల్పించిన డిస్నీ హాట్‌స్టార్‌కి థ్యాంక్స్‌. త్వరలో ‘సేవ్‌ ది టైగర్స్‌’ రెండో సిరీస్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం.
► ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల సమయంలో ‘యాత్ర 2’ ని విడుదల చేయనున్నారని, ఆ సినిమా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నకి సపోర్ట్‌గా ఉంటుందని వినిపిస్తున్న మాటల్లో వాస్తవం లేదు. ఎందుకంటే సినిమా వల్ల ఓట్లు వస్తాయనుకోవడం అపోహ మాత్రమే. అలా అనుకుంటే ఇతర పార్టీల వారు కూడా నాలుగైదు సినిమాలు తీసుకోవచ్చు కదా? ఓటర్లందరూ నా ‘యాత్ర’ సినిమాని చూసుంటే ‘బాహుబలి’లా పెద్ద సినిమా అయ్యేది. ఓటర్లందరూ సినిమాలు చూస్తారని అనుకోవడం లేదు.


జగన్‌ అన్న పాదయాత్రతో...
‘యాత్ర 2’ సినిమా జగన్‌ అన్న పాదయాత్ర నుంచి మొదలై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఉంటుంది. కథ మొత్తం పూర్తయ్యాక ఆ వివరాలు చెబుతాను. ప్రస్తుతం నేను దర్శకత్వం వహించిన ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా?’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ‘సైతాన్‌’ అనే కొత్త వెబ్‌ సిరీస్‌తో జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను.

Advertisement
 
Advertisement
Advertisement