కీలక ప్రదేశాల్లో కేంద్ర బలగాల పహారా | Sakshi
Sakshi News home page

కీలక ప్రదేశాల్లో కేంద్ర బలగాల పహారా

Published Sat, May 4 2024 12:45 AM

కీలక ప్రదేశాల్లో కేంద్ర బలగాల పహారా

మహబూబ్‌నగర్‌ క్రైం: ఈ నెల 13న జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో పోలీస్‌ సిబ్బంది విధుల పర్యవేక్షణ పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, ఈసీఐ నిబంధనలు తప్పక అమలు చేయాలని ఎస్పీ హర్షవర్ధన్‌ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం అన్ని రకాల పోలీస్‌ బృందాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలింగ్‌ రోజు అన్ని విధుల్లో కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించాల్సి ఉంటుందని, ఈ నెల 12, 13న ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండాలని సూచించారు. ఎన్నికల తర్వాత స్ట్రాంగ్‌ రూంల దగ్గర, కౌటింగ్‌ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. పోలింగ్‌ బూత్‌ వారీగా చిన్నపాటి సమస్య రాకుండా నియత్రించాలని, ఓటర్లను భయాందోళనకు గురిచేసే అవకాశం లేకుండా చేయాలన్నారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా పోలింగ్‌ రోజు ఎల్‌డబ్ల్యూఈ, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో స్టాటిక్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే రూట్‌ బందోబస్తు, అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక బలగాలు విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఎస్‌ఎస్‌టీ బృందాల విధులు ప్రధానంగా ఉండాలని, అతి కీలకమైన పాయింట్స్‌ దగ్గర సెంట్రల్‌ ఫోర్స్‌ విధుల్లో ఉంచడం జరుగుతుందన్నారు. జిల్లాలోని చెక్‌ పోస్టుల దగ్గర విధులు నిర్వహించే సిబ్బంది జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం ఎస్పీ ఎస్‌ఎస్‌టీ టీం డ్యూటీలు, ఎల్‌డబ్ల్యూఈ విధులు ఎలా నిర్వహించాలో క్లుప్తంగా వివరించడంతోపాటు ఏరియా డామినేషన్‌, కార్డెన్‌ సెర్చ్‌ ఆపరేషన్స్‌, ఇతర ఎన్నికల విధులపై సిబ్బందికి ప్రత్యేకంగా వివరించారు. సమావేశంలో ఏఎస్పీ రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement