పవన్‌ది రాజకీయంలోనూ నటనే | Sakshi
Sakshi News home page

పవన్‌ది రాజకీయంలోనూ నటనే

Published Sat, Apr 20 2024 3:20 AM

-

ఏపీ అగ్రి మిషన్‌ సభ్యుడు బాబి

అమలాపురం టౌన్‌: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ఇంతకాలం సినిమాల్లో మాత్రమే నటిస్తారనుకున్నాం. ఆయన రాజకీయాల్లోనూ నటిస్తారని ఆయన స్థిరత్వంలేని మాటలే తేటతెల్లం చేస్తున్నాయని ఏపీ అగ్రిమిషన్‌ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబి) అన్నారు. అమలాపురంలో బాబి స్థానిక మీడియాతో శుక్రవారం మాట్లాడారు. గతంలో టీడీపీ, బీజేపీని, ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబు, లోకేష్‌లపై ఎన్నో ఆరోపణలు చేసిన పవన్‌ కళ్యాణ్‌ ఆ నోటితోనే నేడు ఇంద్రుడు, చంద్రుడు అంటూ వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్న తీరు సినిమాల్లోని ఆయన నటనను ప్రజలకు గుర్తుకు చేస్తోందని బాబి అన్నారు. వైఎస్సార్‌ సీపీ ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్‌, ఎంపీ పి.మిధున్‌రెడ్డిని గోదావరి జిల్లాలో ఆయన పెత్తనం ఏమిటి? అని ప్రశ్నిస్తున్న పవన్‌కళ్యాణ్‌ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చదువుకున్నానని చెప్పే ఆయనకు పిఠాపురంతో పనేంటని బాబి ఎదురు ప్రశ్న వేశారు. గోదావరి జిల్లాల పార్టీ కో ఆర్డినేటర్‌గా వైఎస్సార్‌ సీపీని పర్యవేక్షిస్తున్న మిధున్‌రెడ్డిని పవన్‌ కళ్యాణ్‌కి విమర్శించే అర్హత లేదని చెప్పారు. పావలా పవన్‌ అంటూ తిట్టిన టీడీపీతోనే అంటకాగుతున్న నీ రాజకీయ పరిణితిపై ప్రజలు చర్చించుకుంటున్నారని బాబి పేర్కొన్నారు.

పోక్సో కేసులో జీవిత ఖైదు

గోపాలపురం: పోక్సో కేసులో ఒక వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు తీర్పు చెప్పినట్లు గోపాలపురం ఎస్పై కర్రి సతీష్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. తూర్పుగోదగోపాలపురం పెద్దగూడెం కాలనీకి చెందిన ముప్పడి సంపత్‌రావు(75)పై 2017లో పోక్సో కేసు నమోదు చేశారు. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడన్న నేరం రుజువు కావడంతో ఏలూరు పోక్సో కోర్టు జడ్జి ఎస్‌.ఉమాసునంద తీర్పు చెప్పినట్లు తెలిపారు. ముద్దాయి సంపత్‌రావుకు జీవిత కాల శిక్షతో పాటు రూ.వేయి నగదు, బాధితురాలికి రూ.2లక్షల 50వేలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ పోక్సో కోర్డు న్యాయమూర్తి ఉమా సునంద సంచలన తీర్పు చెప్పినట్లు ఎస్సై పేర్కొన్నారు.

24తో ముగియనున్న ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు, రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌లకు ఫీజు చెల్లించేందుకు గడువు తేదీ ఈ నెల 24తో ముగుస్తుందని ఇంటర్‌బోర్డు ఆర్‌ఐవో ఎన్‌ఎస్‌వీఎల్‌ నర్సింహం శుక్రవారం తెలిపారు. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు అదే కళాశాలలో పరీక్ష ఫీజు చెల్లించాలని, ఫలితాలపై సందేహం ఉన్న విద్యార్థులు రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కమ్‌ ఫొటో కాఫీ పొందేందుకు తగిన రుసుం చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే మొదటి సంవత్సరం పాసైన అభ్యర్థులు వారి సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను ఇంప్రూమ్‌మెంట్‌ చేసుకునే అవకాశం ఉందన్నారు. వారు ఈ నెల 24 లోగా ఫీజు చెల్లించాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తామన్నారు.

Advertisement
Advertisement