Sakshi News home page

భార్యను చంపిన భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష

Published Sat, Nov 25 2023 1:30 AM

- - Sakshi

వరంగల్‌ లీగల్‌: అదనపు కట్నం తీసుకువాలని భార్యను వేధించి చివరకు ఆమెను హత్య చేసిన కేసులో నల్లబెల్లి మండలం ధర్మారావుపల్లెకు చెందిన అందెస్వామికి యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ శుక్రవారం వరంగల్‌ జిల్లా ప్రిన్సిపల్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి కె.రాధాదేవి తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం ములుగు వెంకటాపురం గ్రామానికి చెందిన పిట్టల లతను నల్లబెల్లి మండలం ధర్మారావుపల్లెకు చెందిన అందెస్వామికి ఇచ్చి 2010, జూన్‌2న వివాహం చేశారు. వివాహ సందర్భంగా రూ.5 లక్షల నగదు ఇతర సామగ్రి కట్న కానుకలుగా ఇచ్చారు. వివాహనంతరం స్వామి డ్రైవింగ్‌ చేస్తూ బొల్లికుంట సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చిన సందర్భంలో తరుచూ భార్యను కొట్టి అత్తవారింటి నుంచి డబ్బులు తీసుకురమ్మనే వాడు. ఈ క్రమంలో పలుమార్లు లత తల్లిదండ్రులు, అన్నదమ్ములు స్వామికి వేలాది రూపాయలు ఇచ్చారు. అనేకమార్లు పంచాయతీలు జరగగా మరోసారి తన భార్యను కొట్టనని పెద్దల సమక్షంలో ఒప్పుకొని, తిరిగి అదే మార్గంలో ఉండేవాడు. ఈ క్రమంలో అత్తవారింటి వద్ద పంచాయతీ జరిగిన తర్వాత భార్యను తీసుకెళ్తానని చెప్పిన స్వామి.. లాయర్‌ ద్వారా భార్యకు నోటీసు పంపించాడు. దీంతో లత వరంగల్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించగా స్వామి తన భార్య లతను స్వగ్రామం తీసుకెళ్లాడు. రెండు రోజుల తర్వాత 2015, సెప్టెంబర్‌ 9న తన చీరలు ఎందుకు కాల్చావని అడగగా కోపోద్రిక్తుడైన స్వామి.. లతపై కిరోసిన్‌ పోసి నిప్పటించాడు. మంటలు ఎగిసిపడడంతో కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి లతను 108లో ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతూ 2015, సెప్టెంబర్‌ 14న లత మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నల్లబెల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో నేరస్తుడు అందెస్వామికి యావజ్జీవ కారాగార శిక్ష రూ.22 వేల జరిమానా విధిస్తూ జడ్జి రాధాదేవి తీర్పు ఇచ్చారు. కేసును అప్పటి పోలీస్‌ అధికారి మురళీధర్‌ పరిశోధించగా, సాక్షులను కాని సేబుల్‌ మహేష్‌, హోంగార్డు రమేష్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్‌ పక్షాన పీపీ సత్యనారాయణగౌడ్‌, భద్రాద్రి వాదించారు.

మరో ఘటనలో ఆటో డ్రైవర్‌కు 8 ఏళ్ల జైలు..

వరంగల్‌ లీగల్‌: భార్యను హత్య చేసిన కాజీపేట రైల్వేక్వార్టర్స్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ మేకల శ్రీనివాస్‌కు ఎనిమిది సంవత్సరాల కఠిన జైలుశిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.కృష్ణమూర్తి శుక్రవారం తీర్పు వెల్లడించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సత్యనారాయణగౌడ్‌ కథనం ప్రకారం కాజీపేటకు చెందిన ఆటో డ్రైవర్‌ మేకల శ్రీనివాస్‌కు ధర్మసాగర్‌ మండలం మల్లక్‌పేటకు చెందిన నారబోయిన రమను ఇచ్చి 2010 మార్చిలో వివాహం చేశారు. శ్రీనివాస్‌ తండ్రి మృతి చెందడంతో తల్లి రైల్వేలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. శ్రీనివాస్‌ మద్యానికి బానిపై తరుచూ తన భార్య రమను చితకబాదేవాడు. ఈ క్రమంలో 2021, మార్చి 24న మద్యం మానేయాలని రమ.. భర్తను కోరింది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాస్‌ కత్తితో రమను పొడిచాడు. అప్పుడే ట్యూషన్‌ నుంచి వచ్చిన వారి చిన్న కుమారుడు రక్తం చూసి భయంతో కేకలు వేయగా స్థానికులు వచ్చారు. దీంతో వారిని చూసి శ్రీనివాస్‌ పరారయ్యాడు. అప్పటికే రమ మృతి చెందింది. శ్రీనివాస్‌ రైలులో పారిపోవడానికి యత్నించగా పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువుకావడంతో శ్రీనివాస్‌కు 8 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. పోలీస్‌ అధికారులు నరేందర్‌, రాజు కేసు పరిశోధించగా, సాక్షులను సుధాకర్‌, ఇమాన్‌ కోర్టులో ప్రవేశపెట్టారు.

Advertisement
Advertisement