రెండో రోజు ఏడు నామినేషన్లు | Sakshi
Sakshi News home page

రెండో రోజు ఏడు నామినేషన్లు

Published Sat, Apr 20 2024 1:55 AM

- - Sakshi

సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌): నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి రెండోరోజు శుక్రవారం ఆరుగురు అభ్యర్థులు మొత్తం ఏడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ రెండు సెట్ల నామినేషన్లు వేశారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాతో కలిసి ఒక సెట్‌ నామినేషన్‌ వేశారు. మరో సెట్‌ బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో పాటు జగిత్యాల్‌ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, బోధన్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి అయేషా ఫాతిమాతో కలిసి దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌, బహుజన్‌ ముక్తి పార్టీ అభ్యర్థి దేవతి శ్రీనివాస్‌, స్వతంత్ర అభ్యర్థిగా రాపెల్లి శ్రీనివాస్‌, ధర్మ సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా కండెల సుమన్‌, స్వతంత్ర అభ్యర్థిగా రాగి అనిల్‌ నామినేషన్‌ పత్రాలు సమర్పించారని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు వివరించారు. కాగా రెండు రోజుల్లో మొత్తం మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

పసుపు రైతులతో కలిసి అర్వింద్‌..

బీజేపీ అభ్యర్థి సిట్టింగ్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పసుపు రైతులతో కలిసి మొదటి సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. మెడలో పసుపు కొమ్ముల దండ, స్వయంగా కారు నడుపుతూ నామినేషన్‌ కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు. పసుపు రైతుల సమక్షంలో, వారి ఆశీర్వాదంతో మొదటి సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశానని తెలిపారు. పసుపు రైతులు సమకూర్చి ఇచ్చిన డబ్బుతో నామినేషన్‌ డిపాజిట్‌ చెల్లించానని పేర్కొన్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో రైతులు పండించే పసుపు, వరి, మామిడి, మొక్కజొన్న, చెరుకు, ఇతరత్రా పంటలకు విత్తనాల నుంచి మార్కెటింగ్‌ సౌకర్యం వరకూ అన్ని చర్యలకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయా పంటల ప్రాసెసింగ్‌, ప్యాకేజీ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపడతామని, స్వయం ఉపాధి మహిళలకు వాల్యూయాడెడ్‌ సర్వీస్‌లో భాగస్వామ్యం కల్పిస్తామన్నారు. దేశాన్ని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌గా మారుస్తామని, తద్వారా యువతకు ఉపాధి పెరుగుతుందని వివరించారు. గల్ఫ్‌ వలసలు ఆపుతామని, అక్కడ ఉన్న వారందరికీ ఉపాధి కల్పించి వాపస్‌ వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో పసుపు రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.

రెండు సెట్లు దాఖలు చేసిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌

పసుపు రైతులతో కలిసి సిట్టింగ్‌ ఎంపీ, బీజేపీ అభ్యర్థి అర్వింద్‌..

1/2

2/2

Advertisement
Advertisement