రాయితీ దూరం.. విద్యార్థులకు భారం | Sakshi
Sakshi News home page

రాయితీ దూరం.. విద్యార్థులకు భారం

Published Thu, Nov 9 2023 12:18 AM

పదో తరగతి విద్యార్థులు
 - Sakshi

గొల్లపల్లి: పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ కల్పిస్తున్న ఫీజు రాయితీ ఉపయోగ పడటం లేదు. వార్షిక పరీక్షల కోసం చెల్లించాల్సిన ఫీజుకోసం ప్రభుత్వం రాయితీ పథకం అమలు చేస్తుంది. అయితే ఇందులో ఉన్న నిబంధనల కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా ఈ పథకాన్ని అందుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 2023–24 విద్యాసంవత్సరానికి పదో తరగతి విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్‌ విడదలైంది. అపరాధ రుసం లేకుండా ఈనెల 17 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. అపరాధ రుసుంతో డిసెంబర్‌ 20వరకూ అవకాశం కల్పించారు.

ఇచ్చేది తక్కువ.. ఖర్చు ఎక్కువ

వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు ఒక్కో విద్యార్థి రూ.125 ఫీజు చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇందులో 100 శాతం రాయితీ పొందే అవకాశం ఉంది. అయితే ఆయా వర్గాల విద్యార్థులు ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం చాలా ఏళ్లుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నా.. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణప్రాంతాల వారికి రూ.20 వేలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.25 వేలు మాత్రమే ఉండాలన్న నిబంధన ఉంది. అంతమొత్తంతో విద్యార్థులకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు రెవెన్యూ అధికారులు ఆసక్తి చూపడం లేదు. రూ.125 ఫీజు రాయితీ కోసం ఆదాయ సర్టిఫికెట్‌ తీసుకునేందుకు ముందుగా మీసేవలో దరఖాస్తు ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్‌ కోసం రెండుసార్లు మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగడానికి రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. ఫలితంగా వేలాది మంది ఈ రా యితీని వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.

ఏటా 10వేల మందికి పైగా విద్యార్థులు

జిల్లాలో పదో తరగతి విద్యార్థులు ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు 416 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ఏటా సుమారు 10వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరంతా మార్చిలో వార్షిక పరీక్షలు రాయాల్సి ఉంటుంది. మొత్తం విద్యార్థుల్లో 70 శాతం మేర బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులే ఉంటా రు. వీరంతా ఫీజు రాయితీ పొందే అవకాశం ఉ న్నా.. ఆదాయ సర్టిఫికెట్‌ జారీలో నిబంధనలు సవరించకపోవడంతో ప్రభుత్వం కల్పించిన రాయితీని అందుకోలేకపోతున్నారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు ఆదాయ సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఈ నెల 17 వరకు పదో తరగతి పరీక్ష ఫీజు గడువు

ఆదాయ సర్టిఫికెట్‌ సమర్పిస్తేనే రాయితీకి అవకాశం

నిబంధనల ప్రకారం ఇవ్వలేకపోతున్న అధికారులు

Advertisement
Advertisement