కోవర్ట్‌.. బీఅలర్ట్‌ | Sakshi
Sakshi News home page

కోవర్ట్‌.. బీఅలర్ట్‌

Published Thu, Nov 16 2023 1:24 AM

- - Sakshi

వరంగల్‌: వరంగల్‌ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులకు కోవర్టుల బెడద పొంచి ఉంది. పార్టీలో రాష్ట్ర స్థాయి పదవుల్లో కొనసాగుతూ.. సమన్వయకర్తలుగా ఉన్న సెకండ్‌ కేడర్‌ నేతలే ఈచర్యలకు పూనుకుంటున్నారు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. నమ్మకంగా ఉంటూ.. సలహాలు, సూచనలిస్తూ.. ఆరోజంతా జరిగిన పూర్తి సమాచారం, రహస్య అంశాలు అన్నీ ప్రత్యర్థులకు అందజేస్తున్నట్లు సమాచారం. కొంత మంది నాయకులు సొంత పార్టీలోనే ఉంటూ.. తమ అనుయాయులను ఇతర పార్టీల్లోకి పంపిస్తున్నారనే ఆరోపణలూ వస్తున్నాయి. ఇందుకోసం పెద్ద మొత్తంలో సదరు నేతల నుంచి ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నట్లు తెలిసింది.

బెడిసికొట్టిన భేటీ

తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిని మార్చాలని.. లేకపోతే పార్టీ కోసం పని చేయం అని అల్టిమేటం ఇచ్చిన అసంతృప్తి నేతలకు పోటీలో ఉన్న నేత నిర్వహించిన భేటీ బెడిసి కొట్టినట్లు తెలిసింది. ఇందులో అసంతృప్తి నేతలు సుమారు రూ.5కోట్లు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. అసంతృప్తి బృందానికి నేతృత్వం వహిస్తున్న ఓ మైనార్టీ నేతకు రూ.కోటి. మరో బీసీ నేతకు రూ.కోటి పోగా.. మిగిలిన వారందరికీ రూ.3కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ఈప్రతిపాదనకు పోటీలో ఉన్న నేత మొగ్గు చూపకపోవడంతో నేతృత్వం వహించిన నాయకులు కింది స్థాయి నాయకులను, కార్యకర్తలను వేరే పార్టీల్లోకి పంపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న చిన్న కేసులున్న వారిపై పోలీస్‌ పవర్‌ను ఉపయోగించడంతో వారు తప్పనిసరి పరిస్థితుల్లో అధికార పార్టీలో చేరక తప్పలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒంటెద్దు పోకడతోనే వలసలు

అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ఒంటెద్దు పోకడలతో విసుగెత్తిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు బీఆర్‌ఎస్‌ నుంచి ఇతర పార్టీల్లోకి వలస పోతున్నట్లు అదే పార్టీలకు చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు. కొంత మంది అదే పార్టీలో ఉంటూ.. పోలింగ్‌కు ముందు జంప్‌ చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్తున్న సమాచారం తెలియడంతోనే అధికార పార్టీ నేతకు చెందిన అంతరంగికులు రంగంలోకి దిగి ఎక్కడి వారిని అక్కడే కట్టడి చేస్తున్నట్లు తెలిసింది. గిర్మాజీపేటకు చెందిన ఒక యువ బీఆర్‌ఎస్‌ నాయకుడు తన బృందంతో పెద్ద ఎత్తున మరో పార్టీలోకి వెళ్తున్నట్లు సమాచారం లీకయ్యింది. దీంతో వెంటనే పెద్ద మొత్తంలో ఆఫర్‌ ఇచ్చి అడ్డుకట్ట వేయడంతో చేరికలు నిలిచిపోయినట్లు తెలిసింది. కార్పొరేషన్‌లో ముఖ్య పదవిలో ఉన్న వారితో పాటు ముఖ్య నాయకులు పార్టీ మారుతున్నట్లు వైరల్‌ కావడంతో పెద్ద మొత్తంలో సమర్పించడంతో వలస నిలిచిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ అధిక సంఖ్యలో పార్టీలు మారడం తూర్పులో చర్చనీయాంశంగా మారింది.

సమన్వయ లోపం..

ఒక జాతీయ పార్టీకి చెందిన ఆరుగురు నేతలు తూర్పు ఎమ్మెల్యే టికెట్‌ కోసం పోటీ పడ్డారు. అన్ని వర్గాలకు అనుకూలంగా ఉన్న నేత ఒకరు టికెట్‌ దక్కించుకున్నారు. కాగా.. కొంత మంది నాయకులు రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు ప్రచారానికి వచ్చిన సమయంలోనే వస్తూ.. మిగిలిన సమయంలో అంటీముట్టనట్లుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పోటీలో ఉన్న నేత పార్టీ శ్రేణులందరినీ ఏకం చేసేందుకు తలమునకలవుతున్నారు. పోటీలో ఉన్న నేతకు క్లీన్‌ చీట్‌ ఉండడం, గతంలో కొద్ది పాటి తేడాతో ఓటమి చెందినప్పటికీ నగరంలోని అన్ని వర్గాలకు చెందిన వాసులతో పూర్తి స్థాయిలో పరిచయాలు ఉండడం కలిసి వస్తున్న అంశం. వ్యాపార వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అధికార పార్టీ నుంచి రావడం, గతంలో ఉన్న పరిచయాలతో పాటు పార్టీ ముఖ్య నాయకులు పూర్తి స్థాయిలో సహకరిస్తే గెలిచే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రధాన పార్టీలకు కోవర్టుల బెడద

పార్టీలో ఉంటూ ఇన్ఫర్మేషన్‌ లీక్‌

తలలు పట్టుకుంటున్న

ఎమ్మెల్యే అభ్యర్థులు

Advertisement
Advertisement