జిమ్స్, వర్కవుట్స్‌ లేకుండానే ఆరోగ్యం  | Non-exercise activity thermogenesis (NEAT) | Sakshi
Sakshi News home page

జిమ్స్, వర్కవుట్స్‌ లేకుండానే ఆరోగ్యం 

Jun 8 2025 11:01 AM | Updated on Jun 8 2025 11:01 AM

Non-exercise activity thermogenesis (NEAT)

ఇటీవలే తరలివచ్చిన మరో విదేశీ సూత్ర  

జిమ్స్, వర్కవుట్స్‌ లేకుండానే ఆరోగ్యం 

సొంత పనులు చక్కబెట్టుకుంటూనే వ్యాయామం 

NEAT.. పేరిట అందుబాటులోకి వచ్చిన వైనం

ప్రస్తుతం ఆరోగ్యం/ఫిట్‌నెస్‌ సాధన అంటే తప్పకుండా జిమ్‌కి వెళ్లాలి, చెమటలు కక్కేలా కసరత్తులు చేయాలి అనుకుంటున్నారు చాలామంది. అయితే ఎలాంటి ప్రత్యేకమైన వ్యాయామం లేకుండానే రోజువారీ పనుల ద్వారానే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునే విధానం ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది. దానికి దోహదం చేస్తోంది నీట్‌..    

నాన్‌ ఎక్సర్‌సైజ్‌ యాక్టివిటీ థెర్మోజెనిసిస్‌
(ఎన్‌ఇఎటి)అంటే మన శరీరం నిద్రపోవడం, తినడం లేదా ప్లాన్‌ చేసిన వ్యాయామం కాకుండా చేసే ప్రతి చిన్న చలనం ద్వారా ఖర్చయ్యే ఎనర్జీ.. దీనినే నీట్‌గా పేర్కొంటున్నారు. ఉదాహరణకు నడక, నిలబడటం, ఇల్లు శుభ్రపరచడం, 
పిల్లలతో ఆడుకోవడం వంటివాటి వల్ల వచ్చే శక్తి నీట్‌. 

సంక్షిప్తంగా చెప్పాలంటే..: జీవనశైలిలో చిన్న చిన్న మార్పులతో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడమే నీట్‌ పెరుగుదలకు ఆరోగ్య జీవనానికి దోహదం చేస్తుంది. శరీరం నుంచి ఎక్కువ కేలరీస్‌ ఖర్చయ్యేలా రోజువారీ పనులను 
నిర్వహించుకుంటూ నీట్‌ను సొంతం చేసుకునే వ్యక్తులకు మెరుగైన బాడీ కంపోజిషన్, ఇన్సులిన్‌ సెన్సిటివిటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  

నీట్‌ టూ ఫిట్‌.. ఇలా.. 
రోజులో ఖర్చు చేసే మొత్తం కేలరీల సంఖ్య బాగా పెరిగి, బరువు నియంత్రణకు నీట్‌ దోహదం చేస్తుంది. ఇది సంతులితమైన ఎనర్జీ బ్యాలెన్స్‌కి దారితీస్తుంది. ముఖ్యంగా డెస్క్‌ జాబ్స్‌ చేస్తున్నవారికి ఇది ఒక ఆచరణీయ మార్గం. కొన్ని అధ్యయనాల ప్రకారం నీట్‌ ద్వారా టైప్‌ 2 డయాబెటిస్‌ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. వ్యాయామం ఒక జీవనశైలిగా మారుతుంది. జిమ్‌కి వెళ్లకపోయినా ఈ తరహా జీవనశైలి వల్ల చురుకుదనం, ఆరోగ్యం సొంతం అవుతాయి.  
నీట్‌ను వెలుగులోకి తెచ్చినది ఈయనే.. 

ఈ కాన్సెప్ట్‌ను అమెరికాకు చెందిన ప్రముఖ ఓబెసిటీ రీసెర్చర్‌ డా.జేమ్స్‌ లెవిన్‌ పరిచయం చేశారు. ఆయన తన మయో క్లినిక్‌లో పరిశోధనలు చేస్తూ ఈ పద్ధతి ద్వారా సాధ్యమయ్యే ఆరోగ్యలాభాలను వివరించారు. ఆయన పరిశోధనల ప్రకారం రోజూ చేసే చిన్న చిన్న కదలికలే (అంటే నడక, మెట్లు ఎక్కడం, కదులుతూ మాట్లాడటం వంటివి) చాలా ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తాయి. 

ఇవే మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రధాన మార్గాలుగా మారుతున్నాయి. ఈ కాన్సెప్ట్‌ ప్రస్తుతం అమెరికా, యూరప్, జపాన్‌ వంటి దేశాల్లో ప్రముఖంగా వినియోగంలో ఉంది. మన దేశంలోనూ బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌ వంటి నగరాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా తమ రోజువారీ జీవనశైలి మార్చుకుంటూ నీట్‌ను, ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకుంటున్నారు.

ఒక్క రోజులో 8 వేల నుంచి 10 వేల అడుగులు నడవడం కోసం.. వాటర్‌ బాటిల్‌ తీసుకోవాలన్నా, ఫోన్‌ మాట్లాడాలన్నా దానిలో నడకను భాగం చేయడం. మీటింగ్స్‌ని వాక్‌ – టాక్‌గా మార్చడం 

జిమ్‌లో, డ్యాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో స్టెప్‌ ఎరోబిక్స్‌ చేయనక్కర్లేదు. సింపుల్‌గా లిఫ్ట్‌కు గుడ్‌బై చెప్పి ఎలివేటర్‌ బదులుగా మెట్లు ఎక్కడం అన్ని ఫ్లోర్స్‌ కాకపోయినా రోజూ కనీసం 3 అంతస్తుల వరకూ మెట్లపై వెళ్లగలిగితే.. ఇది గుండె 
ఆరోగ్యానికి చాలా మంచిది. 

ఇంట్లో వార్తల కోసమో మరేదైనా కార్యక్రమం కోసమో టీవీ చూసేందుకు కుర్చీ, సోఫాలు కాకుండా సైక్లింగ్‌ చేస్తూనో, బాల్‌పై కూర్చునో చూడటం.. 

 భోజనం తర్వాత కనీసం 10–15 నిమిషాలు నడవడం ఒకవేళ వెంటనే కూర్చుని పనిచేయాల్సి వస్తే దానికి బదులుగా 
నుంచోవడం..

పని సమయంలో ప్రతి 30 నిమిషాలకు ఒక్కసారి లేచి కనీసం 2–3 నిమిషాలు నడక.. సినిమా చూస్తున్నా, మధ్యలో లేచి 
నుంచోవడం, లేదా అటూ ఇటూ నడవడం.

ఇంటి ఫ్లోర్‌ను తుడవడం, గిన్నెలు కడగడం, తోట, వంట పనులు చేయడం.. 

ఇంట్లో పిల్లలు ఉంటే వారితో ఆడుకోవడానికి కొంత సమయం కేటాయించడం..

వర్కవుట్‌ చేసినా ‘నీట్‌’గానే ఉండాలి 
మనం ఇంటి పనులను మనమే చేసుకుంటూ, మన వ్యక్తిగత కార్యకలాపాల్లోనూ కదలికల్ని భాగం చేస్తే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అది జిమ్‌కు ప్రత్యామ్నాయం కాకపోవచ్చు కానీ.. ఖచి్చతంగా మన ఆరోగ్యానికి ప్రయోజనకరమే. నేనైతే ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు తగ్గకుండా జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తాను. అంతేగాకుండా చురుగ్గా ఉండడానికి నీట్‌ మీద ఆధారపడతాను. ఆస్పత్రిలో నేను ఎప్పుడూ లిఫ్ట్‌కి బదులుగా మెట్లనే వినియోగిస్తాను. విభిన్న విభాగాల మధ్య తిరగడంతో పాటు వీలున్నంతగా నడుస్తూనే ఉంటాను. రోజుకు కనీసం 3వేల నుంచి 10వేల అడుగుల వరకూ నడిచేలా చూస్తాను.  
– డా.ఎ.ప్రణతిరెడ్డి, క్లినికల్‌ డైరెక్టర్, బర్త్‌ రైట్‌ బై రెయిన్‌ బో హాస్పిటల్‌  

ఆఫీసుల్లో ఉన్నప్పుడు టీ తేవడానికి లేదా ప్రింట్‌ అవుట్స్‌ తీసుకోవడానికి ఫ్యూన్స్‌తో కాకుండా çస్వయంగా నడిచి వెళ్లి తెచ్చుకోవడం.

ఎక్కువ సేపు నిలబడాల్సి వచ్చినప్పుడు సులభమైన స్ట్రెచింగ్స్‌ చేస్తూ ఉండటం.. ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా కాలూ చేయీ కదుపుతూ ఉండటం.  

వాటర్‌ బాటిల్‌ తెచ్చి పక్కన పెట్టుకోకపోవడం వల్ల దాని కోసం తరచూ కాస్తంత దూరం నడవడం..

ఈ చిన్న చిన్న మార్పు చేర్పులతో నీట్‌ పెంపు అనేది ఆరోగ్యానికి దోహదపడే ఒక సహజమైన, సులభమైన మార్గం. ఇది ప్రత్యేకంగా వ్యాయామానికి సమయం కేటాయించాల్సిన అవసరం లేకుండా, ఇలా నీట్‌ను పెంచుకుంటే అది మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడుతుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement