అవార్డు అందుకుంటున్న కాజల్ రమ్నిక్ భాయ్
వజ్రాలు స్త్రీల ఆభరణాల్లో ఉంటాయి. కాని వజ్రాల మీద పెత్తనం మగాళ్లదే. స్త్రీలకు దారి ఇవ్వరు. ఇక శారీరక వైకల్యం ఉన్న స్త్రీ అక్కడ మెరవగలదా? కాని కాజల్ రమ్నిక్ భాయ్ మెరిసింది. సాధారణ గరుకు వజ్రాన్ని కోట్లాది రూపాయల డైమండ్గా మార్చే ఏకైక మహిళా ‘డైమండ్ ప్లానర్’గా నిలిచింది. అందుకే ఇటీవల ‘విమెన్ ఆర్టిజన్ ఎక్సలెన్స్’ అవార్డును అందుకుంది. వజ్రాన్ని సానపట్టే ఈ వజ్రం పరిచయం.
‘సవాళ్లు జీవితాన్ని శాసించలేవు, అవి మనలోని అసలైన శక్తిని బయటకు తీస్తాయి’ అంటుంది కాజల్ రమ్నిక్ భాయ్
వజ్రానికీ ఆమె జీవితానికీ పోలిక ఉంది. బొగ్గు గనుల ఒత్తిడిలోనే వజ్రం పుడుతుంది. కాజల్ కూడా జీవితం తెచ్చిన ఒత్తిడిని తట్టుకుని అపురూపమైన వజ్రంలా మెరిసింది. ‘మనం బలహీనులం కాదు. మనకు కావలసింది సరైన మార్గం మాత్రమే. నేను ముందుకు నడవగలిగినప్పుడు ఎవరైనా నడవగలరు’ అని వారం క్రితం ‘జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్’ వారి ‘ఉన్నతి’ పురస్కారాల్లో భాగంగా ‘విమెన్ ఆర్టిజన్ ఎక్సలెన్స్’ అవార్డును అందుకుంటూ ఆమె అన్న మాటలు వజ్రపు తునకలు.
పోలియో బారిన పడి
కాజల్‌ది సూరత్. రెండేళ్ల వయసులోనే పోలియో వచ్చింది. కాళ్లు దెబ్బతిన్నాయి. నడవాలంటే కాలిపర్ల సహాయం కావాలి. కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఇంటీరియర్ డిజైన్ వైపు ఆసక్తి కలిగింది. అప్పుడే ఒక సంస్థలో ‘డైమండ్ ప్లానర్’ అవకాశం వచ్చింది. కాజల్‌కు వజ్రాల గురించి ఏమీ తెలియదు. అదీగాక అది పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే రంగం. తీవ్రమైన ఒత్తిడి కూడా ఉంటుంది. వజ్రాల నాణ్యత కోసం ప్లానింగ్ డెస్క్ దగ్గర గంటల తరబడి కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని, మైక్రోస్కోపిక్ లెవెల్లో వజ్రాల లోపాలను వెతకాలి. ‘ఇవన్నీ నువ్వు చేయగలవా’ అని అందరూ అన్నారు. ‘అందరూ నా పోలియో చూసి నా మీద జాలి చూపించారు. కానీ నా సంస్థ నన్ను నిరూపించుకోవడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. నేనెందుకు ఈ పని నేర్చుకోకూడదు అని పంతం పట్టాను’ అని తెలిపింది కాజల్.
తర్ఫీదు సామాన్యం కాదు
ఇంత ఒత్తిడి ఉన్న పనిలో ధైర్యంగా దిగిన కాజల్ డైమండ్ ప్లానర్‌గా నైపుణ్యం సంపాదించేందుకు రెండేళ్లు కటింగ్, పాలిషింగ్, ప్లానింగ్‌లో శిక్షణ తీసుకుంది. అంచెలంచెలుగా ఎదిగి 14 ఏళ్ల సర్వీసుతో ఈ రంగంలో ఏకైక మహిళా ప్లానర్‌గా నిలిచింది. ఇప్పుడు కాజల్ 10 క్యారెట్ల వరకు రాళ్లను ప్లాన్ చేసే స్థాయికి ఎదిగింది. ఏ వజ్రం ఎలా ఆకారం పొందాలి, దాని క్లారిటీ, దిగుబడి ఎంత ఉంటుంది అనేది ప్రోడక్షన్ మొదలయ్యే ముందే ఆమె నిర్ణయిస్తుంది.
తండ్రి మరణించిన తర్వాత ఇద్దరు తమ్ముళ్లూ, తల్లి బాధ్యతలు తీసుకున్న కాజల్ పెళ్లి చేసుకోకూడదని స్వయంగా నిర్ణయించుకుని కుటుంబ బాధ్యతల్లోనూ వజ్రంలా నిలిచింది. వజ్రాలు అలంకారమే. కానీ శరీరం ఇచ్చిన పరిమితిని, మనసు బలంతో సానపట్టి మెరిపించిన నిజమైన వజ్రం కాజల్.
డైమండ్ ప్లానర్ అంటే?
భూమి లోంచి తీసిన గరుకు వజ్రం (రఫ్ డైమండ్) చూడటానికి మామూలు రాయిలా ఉంటుంది. దాని లోపల చిన్న నల్లటి మచ్చలు లేదా పగుళ్లు ఉంటాయి. డైమండ్ ప్లానర్ ఆ రాయిని హైటెక్ 3డి స్కాన్ మెషీన్లలో పెట్టి క్షుణ్ణంగా పరిశీలించి కనిపెట్టాలి. రఫ్ డైమండ్‌ని ఎలా కట్ చేస్తే ఎక్కువ బరువున్న, అత్యంత మెరిసే వజ్రం వస్తుందో ప్లాన్ చేయాలి. రఫ్ డైమండ్‌ను ఒకే పెద్ద వజ్రంగా చెక్కాలా లేదా రెండు మూడు చిన్న వజ్రాలుగా కట్ చేయాలా అని కంప్యూటర్ సాఫ్ట్వేర్ సాయంతో డిజైన్స్ ప్లాన్స్ చేయాలి. చిన్న పొరపాటు జరిగినా కోట్లాది రూపాయల విలువైన వజ్రం ముక్కలైపోతుంది లేదా దాని విలువ పడిపోతుంది. అందుకే ఒత్తిడి ఎక్కువ.


