బొమ్మ కాదు అమ్మే! | Deepika Pal Inspiring Journey Making Durga Idols in Guwahati | Sakshi
Sakshi News home page

బొమ్మ కాదు అమ్మే!

Oct 17 2026 1:16 AM | Updated on Oct 17 2026 1:16 AM

Deepika Pal Inspiring Journey Making Durga Idols in Guwahati

కళ కనుల పండుగే

ఆమె చేతి స్పర్శతో మట్టి, ఫైబర్‌ గ్లాస్, సిమెంట్‌... మొదలైన నిర్జీవ పదార్థాలు ప్రాణం పోసుకుంటాయి. దుర్గాదేవితోపాటు దేవీదేవతల రూపాలై పూజలు అందుకుంటాయి. ఆమె పేరు దీపికా పాల్‌. గౌహతి నివాసి. గత పన్నెండు సంవత్సరాలుగా దుర్గామాత విగ్రహాలను తయారు చేస్తోంది. దేవతల విగ్రహాలలో దీపిక కళాప్రతిభ మాత్రమే కనిపించదు. ఆమె కఠోర శ్రమ, జీవితంలో చేసిన సుదీర్ఘ పోరాటం ప్రతిఫలిస్తాయి...

దేవతల విగ్రహాల తయారీ అనేది దీపికాపాల్‌కు జీవనోపాధి మార్గం కంటే ఎక్కువ. అది తనకు కుటుంబ వారసత్వం. తండ్రి జ్ఞాపకాల ఆత్మీయ పలకరింపు. తన కష్టానికి దొరికిన విలువైన ప్రతిఫలం. తండ్రితోపాటు కుటుంబ సభ్యులు దుర్గామాత విగ్రహాలను తయారు చేస్తుంటే దగ్గరగా నిల్చొని ఆసక్తిగా చూసేది దీపిక. ఈ కళ భవిష్యత్‌లో తన వృత్తి అవుతుందని ఆ చిన్నారి ఎప్పుడూ ఊహించలేదు.

కష్టం కాదు అదృష్టం
దీపికకు ఇద్దరు చెల్లెళ్లు. తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలను భుజాలకెత్తుకుంది. కష్టకాలంలో తండ్రి వృత్తిని చేపట్టింది. ‘దుర్గాదేవి విగ్రహాలను తయారు చేయడం నా అదృష్టంగా భావిస్తాను. సాధారణంగా విగ్రహాల తయారీ పని మగవాళ్లు చేస్తుంటారు. వాళ్లు చేయగలిగినప్పుడు ఆడవాళ్లు మాత్రం ఎందుకు చేయకూడదు అని నేను ఆలోచించాను. ఆ ఆలోచనే నన్ను దేవతల విగ్రహాల తయారీ పని మొదలు పెట్టేలా చేసింది. నేను మా కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగించకపోతే ఈ కళ మా తండ్రితోనే అంతరించిపోయేది. ఈ పని ద్వారా నా తండ్రి పేరును నిలబెట్టినందుకు గర్వంగా ఉంది’ అంటుంది దీపిక.

ఎంతో డిమాండ్‌!
పురుషాధిక్యత ఎక్కువగా ఉండే విగ్రహాల తయారీ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దీపిక నిరంతరం కష్టపడాల్సి వచ్చింది. తన తండ్రికి గతంలో కస్టమర్‌లుగా ఉన్నవారిని కలుసుకొని మాట్లాడి వారి నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవాల్సి వచ్చింది.

‘పురుషులు మాత్రమే విగ్రహాలను తయారు చేయగలరు’ అనే అపోహను తన అద్భుత కళానైపుణ్యంతో తిప్పికొట్టింది దీపిక.

ఆమె తయారుచేసే విగ్రహాలకు డిమాండ్‌ పెరుగుతోంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నివాసంలో జరిగిన ‘బసంతి పూజ’ కోసం దీపిక ఒక విగ్రహాన్ని తయారుచేసింది.

‘దేవత విగ్రహాలను తయారుచేయడం నాకు వృత్తి మాత్రమే కాదు. నా కలలను సాకారం చేసుకోవడం. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా నేను తయారుచేసే విగ్రహాల కోసం రావడం సంతోషంగా ఉంది’ అంటుంది దీపిక.

పర్యావరణ స్పృహ
దీపికలో పర్యావరణ స్పృహ ఉంది. విగ్రహాల తయారీలో పర్యావరణహితమైన రంగులు, వస్తువులను మాత్రమే వాడుతుంది. దేవత విగ్రహాల నిమజ్జన ప్రక్రియ దీపికను భావోద్వేగానికి గురయ్యేలా చేస్తుంది.

‘నిమజ్జన సమయం నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. నా తల్లి నన్ను వదలి వెళ్లిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఒక తల్లి తన బిడ్డను చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమతో, జాగ్రత్తగా పెంచినట్లే, నేను కూడా ప్రతి విగ్రహాన్ని ఎంతో ప్రేమతో, శ్రద్ధతో తయారుచేస్తాను’ అంటుంది దీపిక.

దీపిక పడిన కష్టానికి దొరికిన అత్యున్నత బహుమతి... ఆమె చిన్న కుమార్తె నోటి నుంచి వచ్చిన మాట. ‘అమ్మా... నేను కూడా నీలాగే విగ్రహాలు తయారుచేస్తాను’.
           
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement