సాగునీటి కష్టాలకు చెక్‌ పెట్టేలా చర్యలు | Sakshi
Sakshi News home page

సాగునీటి కష్టాలకు చెక్‌ పెట్టేలా చర్యలు

Published Tue, Nov 21 2023 2:52 AM

- - Sakshi

జిల్లాలో వైఎస్సార్‌ జలకళ’ సాకారం

సాగునీటి కష్టాలకు చెక్‌ పెట్టేలా చర్యలు

ఉచితంగా బోర్ల తవ్వకం,

మోటార్ల అందజేత

చిన్న, సన్నకారు, పెద్ద రైతులకు

ప్రయోజనం

సత్ఫలితాలిస్తుండటంతో కర్షకుల్లో

ఆనందం

సాక్షి, రాజమహేంద్రవరం: వ్యవసాయం పండగ కావాలంటే పొలాలకు సాగునీటి లభ్యతే కీలకం. అంతటి ప్రాధాన్యం సంతరించుకున్న నీటి కష్టాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ఖరీఫ్‌, రబీలో గోదావరి జలాలు అందిస్తూ కర్షకులకు అండగా నిలుస్తోంది. అంతటితో ఆగకుండా ‘వైఎస్సార్‌ జలకళ’లో భాగంగా భూగర్భ జలాలు అందుబాటులో ఉన్న రైతుల పొలాల్లో ఉచితంగా బోరు వేసి భరోసా ఇస్తోంది. ఉచితంగా మోటార్లు సైతం అందజేస్తోంది. రైతులకు అండగా నిలవాలన్న తలంపుతో ప్రారంభించిన పథకం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అమలవుతోంది. జిల్లా వ్యాప్తంగా పథకం సత్ఫలితాలనిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అర్హుల గుర్తింపు నుంచి బోర్ల డ్రిల్లింగ్‌ వరకు ప్రక్రియ వేగవంతంగా సాగుతుండటంతో పంటసాగుకు నీటి బెంగ దూరమవుతోంది.

జిల్లాలో ఇలా..

జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల పరిధిలో బోర్లు అవసరమైన రైతుల నుంచి డ్వామా అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. దీనికి విశేష స్పందన లభించింది. వాటిని డ్వామా (జిల్లా నీటి యాజమాన్య సంస్థ) ఏపీడీ లాగిన్‌కు పంపారు. ఏపీడీ జియాలజిస్టుల సర్వే కోసం పంపారు. దరఖాస్తులను వడపోసిన అధికారులు 1979 దరఖాస్తులు అర్హతగా గుర్తించి అంచనాలు రూపొందించారు. వాటిలో 1944కు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1135 బోర్లు డ్రిల్లింగ్‌ చేశారు. ఇంకా 809 బోర్లు తవ్వాల్సి (వేయాల్సి) ఉంది. 432 బోర్లకు విద్యుత్‌ కనెక్షన్‌ సైతం సమకూర్చారు. 412 మోటార్లకు అంచనాలు రూపొందించారు. 315 మెటార్లకు పరిపాలనా అనుమతులు ఇవ్వగా.. 69 మోటార్లను ఉచితంగా రైతులకు అందజేశారు.

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

● బోరు అవసరమైన రైతులు ముందుగా సచివాలయంలో వలంటీర్‌ ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలి. వీఆర్వో దరఖాస్తును పరిశీలించి, డ్వామా అధికారులకు పంపుతారు.

● ఆ దరఖాస్తు మేరకు హైడ్రో జియోలాజికల్‌ జియో ఫిజికల్‌ సర్వే ద్వారా రైతు భూమిలో ఎక్కడ బోరు వేసేది శాస్త్రియంగా నిర్ణయిస్తారు.

● తర్వాత బోరు వేస్తారు. ఒక వేళ బోరు వేసిన చోట నీరు పడక ఫెయిలైతే మరో చోట గుర్తించి బోరు వేస్తారు.

● జియోలాజికల్‌ సర్వేకు కూడా ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. బోరు ఉన్న భూమిలో మాత్రం బోరు వేయరు.

● రైతు భూమిలో బోరు ఉండి మరమ్మతులకు గురైతే అక్కడ మరో బోరు వేసేందుకు వీలుంటుంది. ఎంత మేర బోరు తవ్వకాలు చేస్తే ఆ మేరకు కేసింగ్‌ పైపు కూడా ఉచితంగానే ఇస్తారు.

గతంలో అధ్వానం

గతంలో చిన్న, సన్నకారు రైతులు బోర్లు వేసుకునేందుకు ఏటా రూ.లక్షల్లో వ్యయం చేసేవారు. బోరు తవ్వించాలంటే రెవెన్యూ, భూగర్భ జలశాఖ అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. ఆ ప్రయత్నాల్లో రైతులు ఆపసోపాలు పడేవారు. రూ.వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టినా నీళ్లు పడతాయో లేదో అనే భయంతో వెనకడుగు వేసేవారు. కొన్ని చోట్లు సాగునీటికి బోర్లు వేసుకుని అప్పులపాలు అయ్యేవారు. బోర్లు వేసుకోవాలనే ఆలోచన ఉన్నా.. నీళ్లు పడుతాయో లేదో? అన్న ఆందోళన నెలకొనేది. పైగా జియాలిజిస్టులకు డబ్బులు కట్టాలన్న భయంలో మిన్నకుండిపోయేవారు. ప్రస్తుతం ప్రభుత్వ చర్యలతో అలాంటి అవస్థలకు అడ్డుకట్ట పడింది. వెరసి చిన్న, సన్నకారు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రైతులకు ఎంతో ప్రయోజనం

రైతుల సాగునీటి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తోంది. ఇది నిరంతర ప్రక్రియ. అర్హులైన రైతులకు ఇప్పటికే బోర్లు వేసే ప్రక్రియ ప్రారంభించాం. 80 శాతం లక్ష్యాలను సైతం అధిగమించాం. మిగిలినవి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అర్హులైన రైతులు గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. అందిన దరఖాస్తులను వెంటనే జియాలజిస్టులకు పంపి నిర్ధారించుకుంటున్నాం. బోర్ల డ్రిల్లింగ్‌, మోటార్ల పంపిణీ ప్రక్రియ వేగవంతంగా చేపడుతున్నాం. పి.జగదాంబ, డ్వామా పీడీ

20ఆర్‌జేసీ904: పి.జగదాంబ, పీడీ డ్వామా

జిల్లాలో జలకళ కింద బోర్ల పురోగతి ఇలా..

నియోజకవర్గం అనుమతి డ్రిల్లింగ్‌ అనుమతి చేయాల్సినవి

పొందినవి చేసినవి రావాల్సినవి

గోపాలపురం 268 158 110 20

కొవ్వూరు 87 83 4 58

నిడదవోలు 287 267 20 24

అనపర్తి 525 291 234 168

గోకవరం 401 153 248 17

రాజమండ్రి రూరల్‌ 9 9 0 1

రాజానగరం 367 174 193 27

మార్గదర్శకాలు ఇలా..

తొలుత రెండెకరాల లోపు మెట్ట, రెండున్నర ఎకరాల లోపు మాగాణి ఉన్న చిన్న, సన్నకారు రైతులకే బోర్లు వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా భూగర్భ జలాలు అందుబాటులో ఉన్న ప్రతి రైతు పొలంలో ఉచితంగా బోరు వేసి సాగునీటికి భరోసా కల్పించాలని పథకంలో మార్పులు చేశారు.

చిన్న, సన్నకారు రైతులకు మాత్రం బోరుతో పాటు ఉచితంగా మోటారు కూడా అందజేయనున్నారు. 5 ఎకరాలు పైన ఉన్న రైతులకు కేవం బోర్లు మాత్రమే వేస్తారు.

ప్రక్రియ వేగవంతం

డ్వామా ఏపీడీ నుంచి అందిన దరఖాస్తులకు సంబంధించిన సర్వే త్వరితగతిన పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంలో కాంట్రాక్టర్లు జియాలజిస్టులతో సర్వే ప్రక్రియ వేగవంతం చేశారు. బోరుకు రూ.70 నుంచి రూ.లక్ష వరకు ఖర్చు కానుంది.

మరింత మంది రైతులకు మేలు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం జలకళ పథకంలో నిబంధనలను సరళీకృతం చేసంది. విస్తీర్ణంతో సంబంధం లేకుండా వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతు అర్హుడేనని తేల్చిచెప్పింది. సన్న, చిన్నకారు రైతులతో పాటు మధ్యతరగతి, పెద్ద రైతులకు సైతం లబ్ది చేకూర్చనుంది.

1/1

Advertisement
Advertisement