అమెరికా రెట్టింపు సుంకాలతో భారత్‌పై తీవ్ర ప్రభావం: జీటీఆర్‌ఐ | Trump Doubled Tariffs On Steel And Aluminium Imports Will Impact Indian Exporters, More Details Inside | Sakshi
Sakshi News home page

అమెరికా రెట్టింపు సుంకాలతో భారత్‌పై తీవ్ర ప్రభావం: జీటీఆర్‌ఐ

Jun 9 2025 6:09 AM | Updated on Jun 9 2025 9:17 AM

Trump doubled tariffs on steel and aluminium imports will impact Indian exporters

న్యూఢిల్లీ: స్టీల్, అల్యూమినియంపై అమెరికా సుంకాలను రెట్టింపు చేయడంతో భారతీయ ఎగుమతులు ప్రభావితం అవుతాయని ఆర్థిక మేధోసంస్థ గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌(జీటీఆర్‌ఐ) తెలిపింది. ముఖ్యంగా వాల్యూ యాడెడ్, ఫినిష్డ్‌ స్టీల్‌ ఉత్పత్తులు, ఆటో విడిభాగాల రంగాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. యూఎస్‌ స్టీల్‌ పరిశ్రమ మనుగడ దృష్ట్యా తమ దేశంలోకి దిగుమతి అవుతున్న స్టీల్, అల్యూమినియంపై ప్రస్తుతం ఉన్న 25% టారిఫ్‌ను 50 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ మే 30న ప్రకటించారు. 

సుంకాల పెంపు జూన్‌ 4 నుంచి అమల్లోకి వస్తాయన్నారు ‘‘భారత్‌పై సుంకాల పెంపు పరిణామం ప్రత్యక్షంగా ఉంటుంది. ట్రంప్‌ నిర్ణయంపై భారత ప్రభుత్వం అమెరికా అధికారులతో ద్వైపాక్షిక చర్చలు జరపాలి. ఈ సుంకాలకు ప్రతిస్పందనగా అమెరికా ఎగుమతులపై భారత్‌ ప్రతీకార సుంకాలను విధిస్తుందో లేదో చూడాలి’’ అని జీఆర్‌టీఐ వ్యవస్థాపకులు అజయ్‌ శ్రీవాస్తవ తెలిపారు. 

గతంలో విధించిన ఉక్కు సుంకాలకు ప్రతిస్పందనగా అమెరికా ఎగుమతులపై ప్రతీకార సుంకాలను విధించే ఉద్దేశాన్ని సూచిస్తూ భారత్‌ ఇప్పటికే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్యూటీఓ)లో అధికారిక నోటీసు జారీ చేసింది. భారత్‌ 2024–25లో 4.56 బిలియన్‌ డాలర్ల విలువైన ఇనుము, ఉక్కు మరియు అల్యూమినియం ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. వీటిలో 587.5 మిలియన్‌ డాలర్ల ఇనుము, ఉక్కు, 3.1 బిలియన్‌ డాలర్లు ఇనుము లేదా ఉక్కు ఉత్పత్తులు, 860 మిలియన్‌ డాలర్లు అల్యూమినియం సంబంధిత ఉత్పత్తులున్నాయి.  

ధరల పోటీతత్వం తగ్గుతుంది: ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్‌ ఎస్‌సీ రల్హాన్‌  
భారతీయ స్టీల్‌ ఎగుమతులైన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పైపులు, స్ట్రక్చరల్‌ స్టీల్‌ విడిభాగాలు, ఆటోమోటివ్‌ స్టీల్‌ భాగాలైన సెమీ ఫినిష్డ్, ఫినిష్ట్‌ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుందని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) అధ్యక్షుడు ఎస్‌సీ రాల్హన్‌ తెలిపారు. అధిక పన్నులు అమెరికా మార్కెట్లో ధరల పోటీతత్వాన్ని తగ్గించడంతో పాటు ప్రపంచ వాణిజ్యం, తయారీ సప్లై చైన్‌ను నిరాశపరుస్తాయన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement