పిల్లలపై అమితమైన ప్రేమా? రాబర్ట్ కియోసాకి హెచ్చరిక! | 5-Cs Trap rich dad poor dad Robert Kiyosaki Warns Parents About Mistake | Sakshi
Sakshi News home page

పిల్లలపై అమితమైన ప్రేమా? రాబర్ట్ కియోసాకి హెచ్చరిక!

Oct 21 2026 9:29 PM | Updated on Oct 21 2026 9:33 PM

5-Cs Trap rich dad poor dad Robert Kiyosaki Warns Parents About Mistake

‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక పుస్తకాల ద్వారా ప్రజల్లో ఆర్థిక ఆలోచనా విధానాన్ని మార్చిన ప్రముఖ రచయిత రాబర్ట్‌ టి కియోసాకి తాజాగా ఫేస్‌బుక్‌లో పంచుకున్న ఒక పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులను పునరాలోచనలో పడేస్తోంది. అందులో పిల్లలపై ప్రేమను చూపడం వేరు, వారికి ఆర్థిక విద్యను అందించడం వేరు అన్నారు. చాలామంది తల్లిదండ్రులు కేవలం మొదటిదే చేస్తున్నారని ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రేమ పేరుతో పిల్లలకు మనం ఇచ్చే అదనపు సౌకర్యాలు రేపు పిల్లల భవిష్యత్తును బలహీనపరుస్తున్నాయని కియోసాకి తనదైన శైలిలో స్పష్టం చేశారు.

సంపన్నులైన ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాన్ని సులువు చేయడం కోసం సర్వస్వం త్యాగం చేస్తుంటారు. ఆ ప్రేమలో నిజాయితీ ఉన్నప్పటికీ.. అదే ప్రేమ పిల్లలను స్వీయశక్తి  కలిగినవారిగా మార్చే గుణపాఠాలకు దూరం చేస్తోంది. తన ‘రిచ్ డాడ్’ నేర్పిన పాఠాల ఆధారంగా ఆర్థిక విద్య లేని ధనం భారంగా మారుతుందని కియోసాకి వివరించారు. దీనినే ‘5-సీస్ ట్రాప్’ (5-Cs Trap)గా అభివర్ణించారు.

కష్టపడకుండా ఇచ్చే నగదు: సంపాదన మార్గాలు నేర్పకుండా కేవలం డబ్బు చేతిలో పెడితే అది పిల్లల్లో సౌకర్యవంతమైన అలవాట్లను పెంచుతుంది తప్ప, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వదు. సౌకర్యం ఎప్పుడూ ఎవరి భవిష్యత్తునూ నిర్మించలేదని గుర్తించాలి.

ఆర్థిక అవగాహన లేని కాలేజీ విద్య: ఎలాంటి ఆర్థిక స్పృహ లేకుండా కేవలం డిగ్రీ చదివిపిస్తే చేతిలో ఖరీదైన పత్రం ఉంటుందే తప్ప అసెట్లు, అప్పులు, క్యాష్ ఫ్లో (ద్రవ్య ప్రవాహం)పై కనీస అవగాహన ఉండదు.

బాధ్యతను పూర్తిగా తొలగించే కారు: పెట్రోల్, ఇన్సూరెన్స్, రిపేర్లు అన్నీ తల్లిదండ్రులే భరిస్తే బాధ్యత అనే పదానికి పిల్లల జీవితంలో అర్థమే లేకుండా పోతుంది.

కష్టం లేకుండా సమకూర్చే ఇల్లు: ఎలాంటి శ్రమ, త్యాగం లేకుండా కొనిచ్చిన ఆస్తి విలువ పిల్లలకు తెలియదు. తాము స్వయంగా కష్టపడి నిర్మించుకున్న దానినే మనుషులు నిజంగా ప్రేమిస్తారు, కాపాడుకుంటారు.

సంపదను రక్షించలేని ట్రస్ట్ ఫండ్లు: ట్రస్ట్ ఫండ్లు సంపదను రక్షించగలవేమో కానీ తర్వాతి తరానికి పెట్టుబడులు, బడ్జెట్ నిర్వహణ, క్రమశిక్షణ తెలియకపోతే ఆ సంపద ఆవిరైపోతుంది. చరిత్ర కూడా ఇదే చెబుతోంది.. మొదటి తరం సంపదను సృష్టిస్తే, రెండో తరం దాన్ని కాపాడుతుంది, మూడో తరం సాధారణంగా దాన్ని కోల్పోతుంది. దానికి కారణం వారు చెడ్డవారు కావడం కాదు, ఎవరూ వారికి ఈ ఆర్థిక పొదుపు నేర్పకపోవడమే.

‘పిల్లలకు మీరు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి డబ్బు కాదు, ఆర్థిక మేధస్సు’ అని తన రిచ్ డాడ్ చెప్పిన మాటలను కియోసాకి ఈ సందర్భంగా గుర్తుచేశారు. శిక్షణ లేని చేతుల్లో ఒక శక్తివంతమైన ఆయుధం ఎలా విధ్వంసం సృష్టిస్తుందో, ఆర్థిక విద్య లేని ధనం కూడా అలాగే తయారవుతుంది. పిల్లలకు సంపాదన ఎలాగో నేర్పండి, పెట్టుబడులు పెట్టడం నేర్పండి, అవసరమైతే ఓటమిని చవిచూసి మళ్లీ ఎదగడం నేర్పించండి. నిజమైన సంపద అంటే మనం చేతిలో పెట్టింది కాదు, వారు స్వయంగా సృష్టించుకోగలిగిందే. కాబట్టి ప్రేమతో పాటు ఆర్థిక విద్యను కూడా అందించే తల్లిదండ్రులే భవిష్యత్తులో సంపదను నిలబెట్టే తరాన్ని తయారు చేయగలరని కియోసాకి తేల్చిచెప్పారు.

ఇదీ చదవండి: కోమాలో ఉంటే బ్యాంకు డబ్బు తీయలేరా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement