
టీడీపీ నేత దేవినేని ఉమా, జనసేన నేత కరాటం
జనసేన ముఖ్య నేత కరాటంతో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరా
ఇద్దరి ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్
దేశ చరిత్రలోనే గొప్ప సంగతి యూట్యూబ్‌లో కనిపించింది..
ఏడాదిలోనే ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎలా?
పవన్ కళ్యాణ్ పట్టించుకోరా? అని అడిగిన ఉమా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పోలవరం ఎమ్మెల్యే ఏడాది కాలంలోనే రూ.100 కోట్లు సంపాదించాడంట.. ఆయన గొప్పతనం యూట్యూబ్‌లో ఇప్పుడే కనిపించింది.. ఏడాదిలో ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎట్లా.. పవన్ కళ్యాణ్ ఏమీ పట్టించుకోరా..’ అంటూ మాజీ మంత్రి, టీడీపీ ముఖ్య నేత దేవినేని ఉమ.. జనసేన కీలక నేత కరాటం రాంబాబుతో వ్యాఖ్యానించారు.
ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏడాదిలో రూ.100 కోట్లు సంపాదించాడనే విషయంతోపాటు, తరచూ వివాదాస్పద నేతగా మీడియాలో హాట్ టాపిక్‌గా ఉండటం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు.. అందుకు సంబంధించిన ఓ వీడియో చూసి, మరో టీడీపీ నేత ఫోన్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్, జనసేన నేత కరాటం రాంబాబుకు ఫోన్ చేశారు.
వారిద్దరి మధ్య సాగిన సంభాషణ శుక్రవారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదేమి దోపిడీ అన్నట్టు టీడీపీ నేత ఉమా జనసేన నేతను ప్రశ్నించడం.. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎప్పుడూ అడగలేదా అని ఆరా తీయడం.. తమకూ చాలా ఇబ్బందిగా ఉందని జనసేన నేత చెప్పడం.. ఏడాదిగా ఏ ఒక్కరూ తనతో మాట్లాడలేదని బదులివ్వడం.. కూటమి పారీ్టల్లో హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రధానాంశాలు..
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు: రాంబాబు గారూ.. బాగున్నారా.. ఎక్కడ ఉన్నారు.. ఏదో యూట్యూబ్‌లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకు వచ్చారు. సంవత్సరంలోనే వంద కోట్లంటే దేశ చరిత్రలోనే గొప్ప విషయం.
జనసేన కీలక నేత కరాటం రాంబాబు:
ఇప్పుడు వ్యవస్థ అంతా పాడైపోయింది.
ఉమా: సంవత్సరంలోనే ఎందుకు ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు.. ఇంకా నాలుగేళ్లు ఉందిగా?
కరాటం: నాలుగేళ్లు ఉండటమేమిటండీ.. చెడ్డ పేరు తెచ్చుకోవడమేమిటండీ. పార్టీకి ఇంత డ్యామేజీ. ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చినప్పుడు కేకలు వేస్తూనే ఉంటాను. అల్లరి ఎక్కువగా జరుగుతోంది.. ఉమా గారు.. మీరు ఎక్కడ ఉన్నారండీ..
ఉమా: నా మీద 82 కేసులున్నాయి కదా.. కోర్టు పని మీద రాజమండ్రికి వచ్చాను. ఇదంతా యూట్యూబ్‌లో చూసి ఎలా ఉన్నారు.. ఏమిటని అడుగుదామని ఫోన్ చేశాను. చాలా కష్టపడి మీరు తీసుకువచ్చి పెట్టారు. అందరిని కలుపుకుని మీరు కూడా అంతా తగ్గి ఒప్పించారు.
కరాటం: ఇబ్బందిగానే ఉందండి. మాకున్నదే దానం చేశాం.. ఎప్పడూ చెయ్యి చాచడం అంటే తెలియదండీ.. కంట్రోల్ చేస్తున్నానండి. మళ్లీ మాములు స్థితికి తీసుకురావాలి. కూటమి అంతా దెబ్బ తినేస్తుంది.
ఉమా: ఇదంతా పవన్ కళ్యాణ్‌కు తెలుస్తుంది కదా..
కరాటం: ఏమోనండి.. మరీ ఏం జరుగుతుందో..
ఉమా: మిమ్మల్ని కూడా అడగటం లేదా?
కరాటం: ఇప్పటి వరకు నాకు ఎవరూ ఫోన్ చేయలేదు.
ఉమా: అసలు రాంబాబు గారు ఎలా ఉన్నారని గానీ, ఏమిటని గానీ..
కరాటం: ఇప్పటి వరకు అసలు ఏ ఫోన్ రాలేదు. వాళ్లు ఫోన్ చేయనప్పుడు నేను కూడా
సైలెంట్‌గానే ఉన్నానండి. మీరు ఫోన్ చేసి చెప్పినప్పుడు పని చేసిపెట్టాను. ఆ సోంబాబు ఏం చేశాడు కోటి రూపాయలు తీసుకున్నానని పెట్టాడు.
ఉమా: ఆ.. అదంతా పట్టించుకోకండి..
కరాటం: జైలులోకి వెళ్లిపోతాడంటే కాపాడింది నేనండి..
ఉమా: అవునండీ.. నాకు తెలుసండీ.. కలుద్దాం.. అటు వైపు వచ్చినప్పుడు కలుద్దామండీ..
కరాటం: అలాగేనండీ..