పసిడి కోసమై.. గనిలో చిక్కిన ‘ఘనులు’ | The story of two young men came for gold | Sakshi
Sakshi News home page

పసిడి కోసమై.. గనిలో చిక్కిన ‘ఘనులు’

Oct 14 2026 5:07 AM | Updated on Oct 14 2026 5:07 AM

The story of two young men came for gold

రామగిరి బంగారు గనుల సొరంగంలో ఇరుక్కు పోయిన వ్యక్తి

రామగిరి గనిలో బంగారం బిస్కెట్లు ఉంటాయని భ్రమపడిన యువకులు

నెల్లూరు జిల్లా నుంచి సత్యసాయి జిల్లా రామగిరికి పయనం

గనిలోకి దిగుతుండగా తెగిన తాడు

స్థానికుల సాయంతో బయటపడిన వైనం

రామగిరి: సోషల్‌ మీడియాలో ఒకటి పదిసార్లు వీడియోలు చూశారు...అబ్బ ‘బంగారం’లాంటి అవకాశమనుకుని ఇద్దరూ కలిసి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి శ్రీసత్యసాయి జిల్లా రామగిరికి వచ్చారు. గనిలో దిగితే చాలు తమ జీవితం ‘బంగారం’ అవుతుందని భ్రమపడ్డారు. ఒకరు పైన తాడుపట్టుకుని ఉండగా.. మరొకరు ఆ తాడు సాయంతో గనిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. చివరకు తాడు తెగిపోవడంతో బంగారం కోసం వచ్చిన ఇద్దరు యువకుల కథ బయటకు వచ్చింది.

బంగారు బిస్కెట్లు ఉంటాయని..
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ప్రభాకర్‌రెడ్డి, అదే జిల్లా పల్లెపాలెంకు చెందిన క్రిష్ణయ్య స్నేహితులు. వీరిద్దరూ సోషల్‌ మీడియాలో రామగిరిలోని భారత్‌ గోల్డ్‌మైన్స్‌ (బీజీఎంఎల్‌) బంగారు గనుల చరిత్ర గురించి తెలుసుకున్నారు. ఆ గనులను మూసివేశారని, తాము గనిలోకి వెళితే బంగారం బిస్కెట్లు దొరుకుతా­యనుకున్నారు. వెంటనే బయలుదేరి సోమవారం రామగిరి వచ్చారు. పగలైతే జనం చూస్తారని, రాత్రివరకూ వేచి ఉన్నారు. చీకటి పడగానే ఓ తాడు సాయంతో ప్రభాకర్‌రెడ్డి గనిలోకి దిగగా.. క్రిష్టయ్య బయట ఆ తాడును పట్టుకుని కాపలా కాస్తున్నాడు. 

కొద్దిసేపటికి తాడు తెగిపోవడంతో లోపలికి పడిపోయిన ప్రభాకర్‌రెడ్డి హాహాకారాలు చేశాడు. దీంతో గనిపైన ఉన్న క్రిష్ణయ్య కూడా గట్టిగా కేకలు వేశాడు. దీంతో స్థానికులు అక్కడికి చేరుకుని వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు మరోతాడు సాయంతో గని లోపల ఉన్న ప్రభాకర్‌రెడ్డిని బయటకు తీశారు. అనంతరం ఇద్దరు యువకుల నుంచి వివరాలు తెలుసుకుని నవ్వుకున్నారు. ‘పిచ్చోళ్లారా.. గనిలో బంగారం ఉంటే మేమే తవ్వుకుంటాం కదా. మీ వరకు రానిస్తామా. దీనికోసం అంతదూరం వచ్చారా’ అని మందలించి పంపారు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. బంగారం కోసం గనిలోకి దిగిన ‘ఘనుల’ వీడియో చూసి జనం నవ్వుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement