పులివెందులలో ఖాకీ కుట్ర! | Police conspiracy in Pulivendula: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పులివెందులలో ఖాకీ కుట్ర!

Oct 20 2026 6:06 AM | Updated on Oct 20 2026 6:06 AM

Police conspiracy in Pulivendula: Andhra Pradesh

చిత్తూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త సయ్యద్‌ను కింద పడేసి కాళ్లతో తన్నుతున్న టీడీపీ గూండాలు

క్రియాశీలక వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యాలు!

క్రైమ్‌ నంబర్లు 180, 181తో రెండు కేసులు 

900 మంది నేతలను చేర్చేందుకు సన్నాహాలు 

మూడు పోలీసు బృందాలతో అరెస్టుల వేట!

నాన్‌ బెయిలబుల్‌ కేసులతో ఎన్నికలకు పూర్తిగా దూరం చేసే వ్యూహం  

సాక్షి ప్రతినిధి, కడప: పులివెందులలో పోలీసుల కేసులే ఆయుధాలుగా మారాయి. వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పులి­వెందులలో చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు అడ్డంకులు.. ఆ తర్వాత ఘర్షణ.. వెంటనే రెండు క్రిమినల్‌ కేసుల నమోదు.. ఇప్పుడు వందలాది మంది నాయ­కులను అరెస్టు చేసేందుకు పోలీసుల సన్నాహాలు.. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు స్థానిక ఎన్నికల బరిలో వైఎస్సార్‌సీపీ నాయకులు లేకుండా చేయాలన్న కుట్రలో భాగమన్న ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.

 ప్రజా మద్దతుతో రాజ­కీయంగా ఎదుర్కోవాల్సిన ప్రత్యర్థులను కేసుల ద్వారా కట్టడి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. పులివెందులలో పోలీసు యంత్రాంగం తీరు, నమోదు చేసిన కేసుల స్వరూపం, అరెస్టుల సన్నాహాలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. 

నామినేషన్ల వేళ అడ్డంకులు.. ఘర్షణకు బీజం! 
శనివారం మధ్యాహ్నం 1.30 సమయానికి వైఎస్సార్‌­సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు పోలీసులు గడువు ఇచ్చారు. ఆ సమయానికి అభ్య­ర్థులు నామినేషన్‌ కేంద్రాలకు వెళ్లగా, ఇప్పుడు కాదు.. మరుసటి రోజు రావాలంటూ అడ్డుకున్నా­రని వైఎస్సార్‌సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. గడువు ఇచ్చిన తర్వాత అదే సమయానికి వచ్చిన అభ్యర్థులను అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. నామినేషన్ల ప్రక్రియను సజా­వుగా నిర్వహించాల్సిన అధికారులే అడ్డంకులు సృష్టిస్తే అభ్యర్థులకు న్యాయం ఎక్కడ దక్కుతుంది?  

ఏకే–47తో కాల్పులు.. ముగ్గురికి గాయాలు! 
పోలీసుల ఏకపక్ష చర్యలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొంటున్నారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నేతృత్వంలో శాంతియుతం­గా నిరసన చేపట్టగా పోలీసుల నుంచి రాళ్ల దాడి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగం, ఏకే–47తో కా­ల్పులు జరిగాయని పేర్కొంటున్నారు. ఈ ఘటన­లో ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. చట్టాన్ని అ­మ­లు చేయాల్సిన పోలీసులే బలప్రయోగానికి దిగారు.  

పోలీసుల ఫిర్యాదులతో రెండు కేసులు 
అనంతరం పోలీసుల ఫిర్యాదుల ఆధారంగా రెండు కేసులు నమోదయ్యాయి. సీఐ నాగార్జున ఫిర్యాదుతో నమోదు చేసిన కేసులో బండి రాఘవరెడ్డితో పాటు సుమారు 60 మంది పేర్లను నిందితులుగా చే­ర్చినట్లు సమాచారం. మరోవైపు సీఐ పురుషోత్తంరాజు ఫిర్యా­దుతో మరో కేసు నమోదైంది. రెండు కేసుల్లోనూ కొందరు వ్యక్తులు ఉమ్మడిగా ఉండగా, మరికొందరిని అదనంగా చేర్చినట్లు తెలుస్తోంది. ఒకే ఘటనపై రెండు కేసులు నమోదు కావడం, వాటిలో నిందితుల జాబితాలు విస్తరించడం ఇప్పుడు కీలకంగా మారింది. ప్రతి కేసులోని ఆరోపణలు, వ్యక్తుల పాత్ర, అందు­బాటులో ఉన్న ఆధారాలు పారదర్శకంగా పరిశీ­లిం­చాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కేసులనే ఆధారంగా చేసుకుని పెద్దఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకులను అరెస్టు చేసే చర్యలు మొదలైతే, అవి ఎన్నికలపై చూపే ప్రభావం తీవ్రంగా ఉంటుంది. 

900 మంది నేతలే లక్ష్యంగా అరెస్టుల వేట! 
రెండు కేసుల పరిధిని విస్తరించి సుమారు 900 మంది వైఎస్సార్‌సీపీ క్రియాశీలక నాయకులను నిందితులుగా చేర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నియోజకవర్గవ్యాప్తంగా మూడు పోలీసు బృందాలతో నాయకులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయ­త్నాలు ముమ్మరమయ్యాయి. నాన్‌ బెయిలబుల్‌ కేసుల్లో అరెస్టు చేస్తే నాయకులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశాన్ని కోల్పోతారన్నదే ఈ చర్యల వెనుక ఉద్దేశమని వైఎస్సార్‌సీపీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో అభ్యర్థులు, పార్టీ నాయకులు అందుబాటులో లేకుండా పోతే ప్రచారం, నామినేషన్లు, స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభావం పడుతుంది.  

వైఎస్‌ కుటుంబానికి పులివెందుల అండ 
పులివెందుల పేరు చెప్పగానే వైఎస్‌ కుటుంబమే గుర్తొస్తుంది. 1978 నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతంలో వైఎస్‌ కుటుంబం ప్రజా మద్దతుతో రాజకీయంగా ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల్లో ఆధిపత్యం సాధించేందుకు టీడీపీ నేతలు అడ్డదారులు ఎంచుకున్నారని వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.  

స్పాన్సర్డ్‌ హింసకు పోలీసులే అండగా?
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే రాజకీయ అధికారానికి అనుకూలంగా వ్యవహరిస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధమైన పోటీకి ముప్పు ఏర్పడుతుంది. నామినేషన్ల ప్రక్రియలో అడ్డంకులు, ఘర్షణ అనంతరం కేసులు, పెద్దఎత్తున అరెస్టుల సన్నాహాలుౄఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే పులివెందులలో ఎన్నికల ప్రక్రియపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల చర్యలు స్వతంత్రంగా సాగడం లేదు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement