హెచ్‌ఆర్సీ నియామకాల్లో ఇంత హడావుడి ఎందుకు? | Legislative Council Opposition Leader Botsa letter to Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

హెచ్‌ఆర్సీ నియామకాల్లో ఇంత హడావుడి ఎందుకు?

Oct 12 2026 5:28 AM | Updated on Oct 12 2026 5:28 AM

Legislative Council Opposition Leader Botsa letter to Chandrababu Naidu

సోమవారం ఉదయం రావాలని ఆదివారం సాయంత్రం సమాచారమా?

ఇంత తక్కువ సమయంలో విజయనగరం నుంచి రాలేను

సీఎం చంద్రబాబుకు శాసనమండలి విపక్ష నేత బొత్స లేఖ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మానవ హక్కుల కమిషన్‌ (ఏపీ హెచ్‌ఆర్సీ) చైర్‌పర్సన్, సభ్యుల ఎంపిక ప్రక్రియను హడావుడిగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపిక ప్రక్రియను సోమవారం చేపట్టాలని భావించినప్పుడు, తనకు ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తగినంత సమయం ఇవ్వకుండా చివరి నిమిషంలో ఆహ్వానం పంపడం వల్ల తాను ఈ సమావేశానికి రాలేకపోతున్నట్లు సీఎం చంద్రబాబుకు బొత్స లేఖ రాశారు. 

సీఎం  చంద్రబాబుకు రాసిన లేఖ ప్రతిని ప్రిన్సిపల్‌ సెక్రటరీ (పొలిటికల్‌), సాధారణ పరిపాలన శాఖకు కూడా బొత్స పంపారు. ‘అక్టోబర్‌ 12న ఉదయం 11.30 గంటలకు ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్, మొదటి అంతస్తులో జరగనున్న ఎంపిక కమిటీ సమావేశానికి హాజరు కావాలని నాకు అక్టోబర్‌ 11న సాయంత్రం 4.59 గంటలకు ఇమెయిల్‌ ద్వారా సమాచారం అందింది. సమావేశానికి హాజరు కావడానికి 24 గంటల కంటే తక్కువ సమయం మాత్రమే ఇచ్చారు.  ప్రస్తుతం నేను విజయనగరంలో ఉన్నాను. ఇంత తక్కువ సమయంలో విజయనగరం నుంచి రాలేను’ అని బొత్స లేఖలో పేర్కొన్నారు. 

కీలక నియామకంపై ఇంత నిర్లక్ష్యమా?
‘మానవ హక్కుల కమిషన్‌ నియామకం వంటి కీలక అంశంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది. ఇది ఏ మాత్రం సమంజసం కాదు. రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ ఎంపిక కమిటీ సభ్యులకు అభ్యర్థుల అర్హతలు, నేపథ్యాన్ని పరిశీలించడానికి చాలా తక్కువ సమయం ఇవ్వడం సరికాదు. అర్హులైన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉన్నందున, వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవడానికి సమయం అవసరం. 

మానవ హక్కుల పరిరక్షణ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించే కమిషన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియలో కచ్చితత్వం, జాగ్రత్త, పూర్తి స్థాయి పరిశీలన అవసరం. తగిన చర్చ, లోతైన పరిశీలన లేకుండా హడావుడిగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడం సహేతుకంగా లేదు.  ఈ కారణాలతో అక్టోబర్‌ 12న జరగనున్న ఎంపిక కమిటీ సమావేశానికి హాజరు కాలేను. సమావేశానికి హాజరు కావడం నాకు ఇష్టం లేదు’ అని కూడా లేఖలో బొత్స స్పష్టంచేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement