సాక్షి, కృష్ణా జిల్లా: దీపావళి టపాసుల మోత ఓ చిన్నారి ప్రాణం తీసింది. సరదాగా కాల్చిన టపాసుల కారణంగా కెమికల్ డ్రమ్ పేలడంతో పదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. టపాసులు కాల్చే క్రమంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
స్థానికంగా అందిన సమాచారం ప్రకారం.. ఓ బాలుడు చెక్కకు పాలిష్ వేసేందుకు ఉపయోగించే డ్రమ్పై టపాసులు పెట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టపాసులు పేలడంతో డ్రమ్లోని రసాయనాలు స్పందించి భారీ శబ్దంతో అది పేలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కురుమిల్లి త్రిలోక్ అనే పదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు. టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోతే ఎంతటి ప్రమాదం ఎదురవుతుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. డ్రమ్లు, రసాయన పదార్థాలు, మండే వస్తువులకు సమీపంలో బాణసంచా కాల్చకూడదని నిపుణులు సూచిస్తున్నారు.


