్చవిజయనగరం మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి కోలగట్ల శ్రావణి
విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధే తన అజెండా అని, నగర ప్రజలంతా తమ బిడ్డగా ఆశీర్వదించి త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మేయర్ అభ్యర్థిగా గెలిపించాలని మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అభ్యర్థించారు. ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరుకు రెండు ఓట్లు ఉంటాయని, ఒక ఓటు మేయర్ అభ్యర్థిగా తనకు, మరో ఓటు స్థానిక కార్పొరేటర్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున ఆమె శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.
అంతకుముందు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల నివాసంలో వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం తల్లిదండ్రులు కోలగట్ల వీరభద్రస్వామి, వెంకటరమణి, భర్త జి.ఈశ్వర్‌కౌశిక్, వందలాదిమంది పార్టీ శ్రేణులతో కలిసి మేళతాళాలతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని అక్కడి అధికారులకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం స్థానిక విలేకరుతో ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆశీస్సులతో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. తన 10 ఏళ్ల రాజకీయ జీవితం మొత్తం విజయనగరం ప్రజలతో మమేకమై గడిపానన్నారు. తాను పుట్టినప్పటి నుంచి విజయనగరమే తన ప్రపంచమని చెప్పారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌కు మొట్టమొదటి సారిగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి డిప్యూటీ మేయర్‌గా సేవలందించానని గుర్తు చేశారు.
తనకు విజయనగరం కార్పొరేషన్‌పై పూర్తి స్థాయిలో అవగాహన ఉందని, ప్రతి రోజు వందలాది మందితో మమేకమై వారి కష్టసుఖాల తెలుసుకుంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్టు తెలిపారు. గడిచిన వైఎస్సార్సీపీ పాలకవర్గంలో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. పార్కులు, వాటర్ ట్యాంక్‌లు, పాఠశాలల ఆధునీకరణ, రోడ్ల విస్తరణ, ప్రధాన కూడళ్ల అభివృద్ధి, తదితర కార్యక్రమాలు చేపట్టి విజయనగరం ప్రజలు తలెత్తుకునేలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. యువత రాజకీయాల్లో రావాలన్నదే తమ అభిమతమని, యువ నాయకత్వం తలచుకుంటే ఏం సాధిస్తారో చేసి చూపిస్తానని తెలిపారు.
మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను గెలిపిద్దాం
మున్సిపల్ ఎన్నికల్లో విజయనగరం మేయర్ పీఠంతో పాటు మిగిలిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను వైఎస్సార్సీపీ దక్కించుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇస్తామని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మొదటి అభ్యర్థినిగా వైఎస్సార్సీపీ తరఫున కోలగట్ల శ్రావణి పేరును జగన్మోహన్రెడ్డి ప్రకటించారన్నారు. అభివృద్ధి ప్రస్థానంలో పూర్తి స్థాయి అవగాహన కలిగి, రాజకీయాల్లో చురుకుగా ఉండే కోలగట్ల శ్రావణిని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, మాజీ ఫ్లోర్ లీడర్ శెట్టివీరవెంకట రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవికి టీడీపీ షాక్!


