నేడు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోనున్న సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

నేడు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోనున్న సీఎం జగన్‌

Published Thu, Apr 1 2021 4:00 AM

CM Jagan to take covid vaccine in guntur today - Sakshi

సాక్షి,అమరావతి/అమరావతిబ్యూరో: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో గురువారం ఉదయం కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోనున్నారు. భారత్‌పేటలోని 6వ లైన్‌ వార్డు సచివాలయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేరుకుంటారు. అక్కడి కమ్యూనిటీ హాల్‌లో ఆయన స్వయంగా వ్యాక్సిన్‌ వేయించుకుని 45 ఏళ్లు దాటిన పౌరులందరికీ వార్డు/గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

ఈ సందర్భంగా ఆయన సాధారణ పౌరుడి మాదిరిగానే రిజిస్ట్రేషన్‌ చేయించుకుని వ్యాక్సిన్‌ పొందుతారు. అనంతరం వైద్య సిబ్బంది అబ్జర్వేషన్‌లో ఉండి ఆ తరువాత సచివాలయం, వైద్య సిబ్బందితో సీఎం సమావేశం అవుతారు. అనంతరం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ ఏ కన్వెన్షన్‌కు ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడ నగరపాలక సంస్థల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, పురపాలక చైర్మన్‌లు, వైస్‌ చైర్మన్లకు నిర్వహించే అవగాహన కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. 

ఏర్పాట్లను పరిశీలించిన హోం మంత్రి
ముఖ్యమంత్రికి వ్యాక్సిన్‌ వేసేందుకు గుంటూరులోని సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ కేంద్రం, రిజిస్ట్రేషన్, వ్యాక్సిన్‌ రూమ్, అబ్జర్వేషన్‌ రూమ్‌ను హోం మంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ బుధవారం పరిశీలించారు. అనంతరం సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు సూచనలు చేశారు. 

Advertisement
Advertisement