సాక్షి, విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి నాయకులను ఎన్నుకోవాలని విశాఖ ప్రజలను పర్యావరణ వేత్త బొలిశెట్టి సత్యనారాయణ కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డేటా సెంటర్ పేరుతో వైజాగ్లో విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ''స్థానిక ఎన్నికలు చాలా కీలకం. జీవీఎంసీ ఎన్నికల్లో డేటా సెంటర్కు మద్దతు ఇచ్చే పార్టీకి ఓటు వెయ్యద్దు. పవన్ కళ్యాణ్ చెప్పినా చెడ్డ వారికి ఓటు వెయ్యద్దు. మంచి నాయకులను ప్రజలు ఎన్నుకోవాల''ని ఆయన పిలుపునిచ్చారు.
డేటా సెంటర్తో పెను ప్రమాదాలు: రాజేంద్ర సింగ్
విశాఖలో సింహాచలం దేవస్థానం కొండలు నాశనం అవుతున్నాయని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు గాంచిన జల్ బిరాద్రి స్థాపకులు డాక్టర్ రాజేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. సింహాచలం దేవస్థానం ఆస్తులను కాపాడాలని కోరుతూ విశాఖ కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారికి ఆయన వినతి పత్రాలు సమర్పించారు. సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిని డేటా సెంటర్ నిర్మాణానికి చట్టవిరుద్ధంగా కేటాయించారని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఈ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ.. డేటా సెంటర్ ప్రాజెక్ట్ వల్ల అటవీ ప్రాంతం ధ్వంసం అవ్వడంతోపాటు సహజ వర్షపు నీటి ప్రవాహాలు (గెడ్డలు) నిరోధించబడి, భూగర్భ జలాలు తగ్గిపోయి పెను ప్రమాదాలు ముంచుకొచ్చే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. దేవస్థాన ఆస్తులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైనందున, ప్రజలు, నీరు, అడవి, భూమి, జంతువుల (జన్, జల్, జంగిల్, జమీన్, జాన్వర్) సంరక్షణ కోసం దేవుడే స్వయంగా ఈ ఆస్తులను కాపాడాలని లేఖ ద్వారా విన్నవించుకున్నట్టు వెల్లడించారు.
ఇదీ చదవండి: వైఎస్ జగన్కు అభిజిత్ దీప్కే ధన్యవాదాలు
''కొండలను రక్షించేలా ఆ నరసింహ స్వామి ఈ పాలకులకు బుద్ది ప్రసాదించాలి. సింహాచలం కొండల్లో తవ్వకాలు ఆపాలని కలెక్టర్, ఫారెస్ట్ అధికారులకు అర్జీ పెట్టాం. సింహాచలం కొండలను తవ్వితే పై నుంచి నీరు వచ్చే అవకాశం లేదు. ఇతర దేశాల్లో డేటా సెంటర్స్ వద్దని తరిమేస్తున్నారు. విశాఖలో 9 గిగా వాట్సా డేటా సెంటర్ పెడతాం అంటున్నారు. వినాశనం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలి. కోర్టు ఆదేశాలను కూడా అధికారులు లెక్క చెయ్యడం లేదు. డేటా సెంటర్ వలన జరిగే నష్టాల గురించి ప్రజలంతా తెలుసుకోవాలి. విశాఖలో ఉన్న కొండలు, నీటి ప్రవాహలను కాపాడాలని పోరాటం చేయబోతున్నామ''ని చెప్పారు.


