ఓటుకువేళాయె! | Sakshi
Sakshi News home page

ఓటుకువేళాయె!

Published Tue, May 14 2024 8:15 AM

ఓటుకు

జిల్లా సమాచారం

మొత్తం ఓటర్లు 15,63,911

మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 1,771

పోలింగ్‌ లొకేషన్లు 1,267

చిత్తూరు పార్లమెంట్‌కు

పోటీ చేస్తున్న అభ్యర్థులు 19

అసెంబ్లీ నియోజకవర్గాల

బరిలో ఉన్న అభ్యర్థులు 78

ఎన్నికల సిబ్బంది 12,310

బ్యాలెట్‌ యూనిట్లు 2,290

కంట్రోల్‌ యూనిట్లు 2,200

వీవీప్యాట్లు 2,471

వెబ్‌కాస్టింగ్‌ కేంద్రాలు 1,309

చిత్తూరు నియోజకవర్గంలో ఎన్నికల విధులకు హాజరైన అధికారులు, సిబ్బంది

సార్వత్రిక ఎన్నికల సమరంలో ఓటరు తీర్పు వెలువరించే రోజు వచ్చేసింది. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరముంది. చైతన్యవంతమైన పౌరులుగా సమాజంలో సగర్వంగా నిలబడేందుకు ముందడుగు వేయాల్సి ఉంది. పాలకులను నిర్దేశించే బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ మేరకు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ప్రజలు ఓటేసేందుకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీ బందోబస్తు కల్పించింది. ఓట్ల పండుగలో అందరినీ భాగస్వామ్యం చేసేందుకు సన్నద్ధమైంది.

సాక్షి చిత్తూరు /చిత్తూరు కలెక్టరేట్‌ : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్‌ రోజు రానే వచ్చింది. జిల్లాలో సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలో ఆదివారం నియోజకవర్గాల వారీగా ఆయా డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ సామగ్రిని తీసుకుని ఆయా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఇప్పటికే జిల్లాలోని మొత్తం 1,771 పోలింగ్‌ కేంద్రాల్లోనూ పక్కాగా మౌలిక వసతులు కల్పించారు. ఓటర్లు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు చేపట్టారు.

ఓటింగ్‌ శాతం పెరిగేలా..

ఈ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. 2019లో జిల్లావ్యాప్తంగా 85.02 శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రస్తుత ఎన్నికల్లో మరింతగా పోలింగ్‌ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలోని 15,63,911 మంది ఓటర్లలో సాధ్యమైనంత మంది పోలింగ్‌ కేంద్రాలకు వచ్చేలా క్షేత్రస్థాయిలో ఇప్పటికే అవగాహన కల్పించారు.

ముందుగా మాక్‌ పోలింగ్‌

సార్వత్రిక ఎన్నికలకు దాదాపు ఐదు నెలలుగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేపట్టారు. అందులో భాగంగా ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ, ఈవీఎంలను సిద్ధం చేయడం, ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణ, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, ఓటర్లకు సదుపాయాల కల్పన, భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. మొత్తం ఈ ఎన్నికల్లో 12,310 మంది అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. వీరంతా ఆదివారం రాత్రి పోలింగ్‌ కేంద్రాలలోనే బస చేస్తారు. ప్రిసైడింగ్‌ అధికారులు సోమవారం ఉదయం 5.30 గంటలకు ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలతో మాక్‌పోలింగ్‌ నిర్వహిస్తారు. తర్వాత కంట్రోల్‌ యూనిట్‌లోని మెమరీని డిలీట్‌ చేసి, వీవీప్యాట్‌ కంటెయినర్‌ బాక్స్‌ నుంచి మాక్‌ ఓటింగ్‌ స్లిప్పులను తొలగిస్తారు.

నేడే సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌

సర్వం సిద్ధం చేసిన అధికారులు

పోలింగ్‌ కేంద్రాలకు చేరిన ఎన్నికల సామగ్రి

సాయుధ బలగాలతో పటిష్ట బందోబస్తు

సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా

పక్కాగా పర్యవేక్షణ

పోలింగ్‌ నిర్వహణ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్‌ ఆధ్వర్యంలో పక్కాగా పర్యవేక్షించారు. బందోబస్తుకు సంబంధించి ఎస్పీ మణికంఠ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. కలెక్టరేట్‌లోని మానిటరింగ్‌ సెల్‌లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ ప్రక్రియ ద్వారా జిల్లావ్యాప్తంగా పోలింగ్‌ కసరత్తును సమీక్షిస్తున్నారు. మొత్తం 425 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై డేగకన్ను పెట్టారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్‌, సీసీ కెమెరాలను, వీడియోగ్రఫీకి చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఒడిశా, మధ్యప్రదేశ్‌ చెందిన పోలీసులు, కేంద్ర బలగాలతో కట్టుదిట్టంగా భద్రత కల్పించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు మైక్రో అబ్జర్వర్లను నియమించారు.

ఓటు మన బాధ్యత

ఓటు హక్కు ప్రజలందరి బాధ్యత. ఈ విషయాన్ని గుర్తించి అందరూ ఓటు వేసేందుకు ముందుకురావాలి. స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశాం. పోలింగ్‌ సరళిని కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పర్యవేక్షిస్తాం. 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున గుంపులుగా తిరగొద్దు.

– షణ్మోహన్‌, జిల్లా ఎన్నికల అధికారి

ఓటుకువేళాయె!
1/3

ఓటుకువేళాయె!

ఓటుకువేళాయె!
2/3

ఓటుకువేళాయె!

ఓటుకువేళాయె!
3/3

ఓటుకువేళాయె!

Advertisement
 
Advertisement
 
Advertisement