రైతుల సమస్యలపై సమరభేరి
- ప్రభుత్వ బాధ్యతా రాహిత్యంపై వైఎస్సార్ కాంగ్రెస్ నిరసనలు
- పలు మండలాల్లో తహశీల్దార్లకు వినతిపత్రాలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. రైతు, వ్యవసాయ సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రెండో రోజు కూడా జిల్లావ్యాప్తంగా నిరసనలు జరిగాయి. గిద్దలూరు నియోజకవర్గంలో గిద్దలూరు, కొమరోలు, కంభం, బేస్తవారిపేట, రాచర్ల మండలాల్లో తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు జరిగాయి.
అనంతరం తహశీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 56 మండలాలకు గాను 54 మండలాల్లో కరువు ఉందని అన్నారు. జిల్లాలో సాధారణ వర్షపాతం 817.3 మి.మీ నమోదు కావాల్సి ఉండగా కేవలం 457.9 నమోదైంది. మొత్తం మీద 44 శాతం వర్షపాతం తక్కువగా ఉన్న సమయంలో అకాల వర్షాల కారణంగా బత్తాయి, నిమ్మ, పంటలు దెబ్బతిని రూ.26 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అన్నారు. ధాన్యం ఉత్పత్తి లక్ష్యం ఐదున్నర లక్షల టన్నులు కాగా.. లక్ష టన్నులకు పైగా దిగుమతి పడిపోయిందన్నారు. జిల్లాలో ప్రధానంగా పండించే వేరుశనగ, శనగ పంటల దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు.
అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు కనీసంగా బీమా సొమ్ము కూడా రైతుకు అందించే ప్రయత్నం జరగలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం దారుణమన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు అండగా ఉండేందుకు తాము ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. చీరాల నియోజకవర్గంలో వేటపాలెం మండల తహశీల్దార్ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్చార్జి యడం బాలాజీ నాయకత్వం వహించారు. పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి భరత్ నేతృత్వంలో యద్దనపూడి, పర్చూరులో నిరసన కార్యక్రమాలు జరిగాయి.
కొండపి నియోజకవర్గంలో కొండపి, టంగుటూరు మండలాల్లో నిరసన చేపట్టారు. నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు పాల్గొన్నారు. అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు, దర్శి నియోజకవర్గం కురిచేడు, కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల, హనుమంతునిపాడు, కనిగిరి, కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు, సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు, మద్దిపాడు, మార్కాపురం నియోజకవర్గం కొనకనమిట్లలో కూడా తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. జిల్లా కేంద్రం ఒంగోలులో నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ నేతృత్వంలో ఆందోళన జరిగింది.