నువ్వు రెడీ... నేను రెడీ... చేసేద్దాం ఇష్టపడి!
కథ నచ్చింది! క్యారెక్టర్లూ నచ్చాయి! కొత్త కుర్రాడు శ్రీరామ్ ఆదిత్య కథ చెప్పిన తీరూ నచ్చింది! కొత్తేంటి? ఆల్రెడీ చురకత్తుల్లాంటి రెండు సిన్మాలు తీశాడు. శ్రీరామ్ టాలెంట్ అండ్ టేకింగ్‌పై నో డౌట్! లేటెందుకు? నువ్వు రెడీ... నేను రెడీ... వీలైనంత త్వరలోనే ఈ చిత్రం చేసేద్దామని నాగార్జున, నాని ఆల్రెడీ ఓ నిర్ణయం తీసేసుకున్నారట! ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’ సిన్మాలతో తెలుగు చిత్రసీమతో పాటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య.
ఇటీవల ఆయన నాగార్జున, నానీలకు ఓ మల్టీస్టారర్ కథ వినిపించారు. ఇద్దరికీ కథ నచ్చేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీరామ్ ఆదిత్య తీసిన తొలి రెండు సిన్మాలు థ్రిల్లర్సే. వాటికి భిన్నంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫ్లేవర్‌లో కొత్తగా భారీ స్కేల్లో ఈ సినిమా ఉంటుందని నిర్మాణ సంస్థ సన్నిహిత వర్గాలు తెలిపాయి. హీరోలిద్దరి పాత్రలు కూడా కొత్తగా ఉంటాయట! డిసెంబర్లో చిత్రీకరణ ప్రారంభిస్తారట. ఈలోపు శ్రీరామ్ ఆదిత్య స్క్రిప్ట్‌కి ఫైనల్ టచెస్ ఇచ్చి. షూటింగ్‌కి రెడీ అవుతారట!