నెట్ మీటరింగ్‌తో సౌరవిద్యుత్‌కు ఊపు
సాక్షి, హైదరాబాద్: ఇంటి మిద్దె మీద సౌర ఫలకాలు అమర్చుకోవడం ద్వారా సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే (నెట్ మీటరింగ్ విధానం) విధానంతో రాష్ట్రంలో భారీగా సోలార్ విద్యుత్ వినియోగం పెరుగుతుందని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మృత్యుంజయ్ సాహు ఆశాభావం వ్యక్తం చేశారు. సోలార్ విద్యుత్ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ మరో జర్మనీ కావాలని ఆయన ఆకాంక్షించారు. జర్మనీలో ఏకంగా 25 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయన్నారు. శుక్రవారం విద్యుత్‌సౌధలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెట్ మీటరింగ్ విధానంపై నాలుగు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అయినప్పటికీ అనుకున్నస్థాయిలో ప్రజల నుంచి సానుకూలత వ్యక్తం కాలేదని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు, నెట్ మీటరింగ్ విధానం ద్వారా ప్రజలకు ఒనగూడే ప్రయోజనాలను వివరించే ఉద్దేశంతో ఈ నెల 24, 25 తేదీల్లో నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో సోలార్ ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్టు తెలిపారు. ఇందులో 20 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయని వివరించారు. నెట్ మీటరింగ్ విధానంలో వినియోగదారుడు వినియోగించుకున్న తర్వాత గ్రిడ్‌కు సరఫరా చేసే అదనపు విద్యుత్‌కు ఆరు నెలలకు ఒకసారి ధర కూడా చెల్లిస్తామన్నారు. యూనిట్‌కు ఏకంగా రూ.6 చెల్లిస్తున్నందున వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని ట్రాన్స్‌కో సీఎండీ సురేష్‌చంద్ర తెలిపారు. కేవలం 3 ఫేజ్ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు మాత్రమే నెట్ మీటరింగ్ విధానం అమలు చేయనున్నట్టు చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో నెట్ మీటరింగ్ విధానం అమలులో సమస్యలు ఉన్న మాట వాస్తమేనని అంగీకరించారు. ఇంటి మిద్దె మీద సోలార్ ఫలకాలను అమర్చుకునేందుకు ముందుకు వచ్చే వినియోగదారులు మొత్తం ఖర్చులో 50 శాతం చెల్లిస్తే సరిపోతుందని సీపీడీసీఎల్ సీఎండీ రిజ్వీ తెలిపారు. మిగిలిన 50 శాతంలో 30 శాతం కేంద్రం, 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తాయన్నారు. రానున్న ఏడాదిన్నర కాలంలో 50 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని జెన్కో ఎండీ విజయానంద్ తెలిపారు. ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి మునీంద్ర, నెడ్‌క్యాప్ ఎండీ కమలాకర్‌బాబు, ఇంధనశాఖ సమన్వయ విభాగం సభ్య కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.