పరేడ్‌కు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: శత్రువు గుండెల్లో దడ పుట్టించే యుద్ధ విమానాలు.. సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులు.. ఠీవిగా కదిలి వచ్చే ట్యాంకులు.. సాంస్కృతిక సౌరభాలు వెదజల్లే శకటాలు..! సోమవారం 66వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆవిష్కృతం కానున్న దృశ్యమాలిక ఇదీ! వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముందు భారత్ తన సైనిక పాటవాన్ని చాటనుంది. మిగ్-28కె యుద్ధ విమానం, టి-90 భీష్మ ట్యాంకు, బీఎంపీ-2 సారథ్, టీ-72లతోపాటు బ్రహ్మోస్ క్షిపణులు పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. దేశీయంగా తయారు చేసిన మధ్యశ్రేణి ఆకాశ్ క్షిపణి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
తీరప్రాంత నిఘా కోసం వినియోగించే పి-81 యుద్ధ విమానాన్ని తొలిసారి ప్రదర్శించనున్నారు. వీటితోపాటు దేశ రక్షణ పాటవాన్ని చాటే అనేక ఆయుధాలను ఒబామా వీక్షించనున్నారు. ఈసారి పరేడ్‌లో మహిళా సాధికారత అంశం ప్రధాన ఇతివృత్తంగా ఉండనుంది. ఇందుకు అనుగుణంగా త్రివిధ దళాల్లోని మహిళా సిబ్బందితో పరేడ్ నిర్వహించనున్నారు. ‘నారీశక్తి’ని ప్రతిబింబించేలా వీరితో త్రివిధ దళాల మహిళా సిబ్బందితో కవాతు చేయించాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని, ఇలా జరపడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. అలాగే 16 వివిధ రాష్ట్రాలు, తొమ్మిది కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలు వివిధ ఇతివృత్తాలతో ఆకట్టుకోనున్నాయి. ప్రధాని మానసపుత్రికలైన ‘జన్‌ధన్ యోజన’, ‘మా గంగా’ ‘స్వచ్ఛ భారత్’ ‘మేకిన్ ఇండియా’ వంటి పథకాలను సూచించేలా శకటాలు కొలువుదీరనున్నాయి.