భారత్ ను రౌండప్ చేస్తున్న చైనా!
కొలంబో: భారత్ అంటేనే కంటగింపుగా ఉన్న చైనా సముద్రయానం విషయంలో మనదేశాన్ని పూర్తిగా తన దిగ్బంధంలో బిగించే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన మారిటైమ్ సిల్క్ రోడ్డు ప్రాజెక్టు ఒప్పందాన్ని శ్రీలంకతో కుదుర్చుకునేదిశగా ముందడుగు వేసింది. శ్రీలంక మీదుగా చేపట్టనున్న చైనా మారిటైమ్ సిల్క్ రోడ్డు ప్రాజెక్టుతో హిందూమహా సముద్రంలో షిప్పింగ్ హబ్ గా శ్రీలంక ఎదుగనుంది. అయితే, ఈ ప్రాజెక్టుతో కీలకమైన ఇంధన దేశాలైన పర్షియన్ గల్ఫ్ తో, తూర్పు చైనాలోని ఆర్థిక కేంద్రాలతో సముద్ర రాకపోకలు సాగించడంలో భారత్ కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది.
హిందూ మహాసముద్రంలోని ఓడరేవుల్లో భారత్ సముద్రరాకపోకలను నియంత్రించే ఉద్దేశంతోనే చైనా వ్యూహాత్మకంగా శ్రీలంక మీదుగా అలైన్ మెంట్ మార్చి ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్టు భావిస్తున్నారు. సముద్రయానం విషయంలో భారత్ పూర్తిగా చుట్టుముట్టే లక్ష్యంతోనే మారిటైమ్ సిల్క్ రోడ్డు అలైన్ మెంట్ మార్చినట్టు పరిశీలకులు భావిస్తున్నారు.
గత శుక్రవారం శ్రీలంక పర్యటనకు వెళ్లిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆ దేశ విదేశాంగ మంత్రి మంగల సమరవీరతో భేటీ అనంతరం కీలక ప్రకటన చేశారు. శ్రీలంకతో వ్యూహాత్మక సంబంధాలు పెంపొందించుకునే ఉద్దేశంతో తాము మారిటైమ్ సిల్క్ రోడ్డు ప్రాజెక్టును తాము ఉమ్మడిగా చేపట్టబోతన్నట్టు తెలిపారు. ఇది ఇరుదేశాల సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తసుందని చెప్పారు. అదే సమయంలో ఈ ప్రాజెక్టు ఈ దేశాన్ని టార్గెట్ చేసే ఉద్దేశంతో చేపట్టలేదని, ఈ ప్రాజెక్టు వల్ల తమ రెండు దేశాలకు ఇతర దేశాలతో ఉన్న సంబంధాలు ఏమాత్రం దెబ్బతినబోవని పరోక్షంగా భారత్ విషయమై వ్యాఖ్యలు చేశారు.