మిస్డ్‌కాల్‌తో.. బాబాజాబ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఉద్యోగం కావాలన్నా, ఉద్యోగం మారాలన్నా ఇంటర్నెట్ను ఆశ్రయించాల్సిందేనా? రెజ్యుమె నింపి వెతుక్కోవాల్సిందేనా? మరి ఇంటర్నెట్ వాడకం తెలియని కింది స్థాయి ఉద్యోగుల మాటేంటి? ఇదే ఆలోచన షాన్ బ్లాగ్స్వెట్ను మైక్రోసాఫ్ట్ ఉద్యోగం వదులుకునేలా... 2007లో బాబాజాబ్ డాట్ కామ్‌ను ఆరంభించేలా చేసింది. దిగువ మధ్యతరగతి ప్రజలు అధికంగా ఆధారపడే ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు అర్హుల్ని అందించటమే బాబాజాబ్ ముఖ్యోద్దేశం. అర్హులెవరూ ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చెయ్యాల్సిన పనిలేదు. 8880004444 నంబరుకు మిస్డ్‌కాల్ ఇస్తే చాలు. అట్నుంచి వాళ్లే కాల్ చేసి... ఉద్యోగార్థుల వివరాలు నమోదు చేసుకుంటారు. తగిన ఉద్యోగం ఎక్కడుం దో చెబుతారు. వినోద్ ఖోస్లా వంటి వెంచర్ క్యాపిటలిస్ట్‌లను ఆకర్షించిన బాబాజాబ్ ఫౌండర్ సీఈవో షాన్ బ్లాగ్స్వెట్తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ ఇది...
మైక్రోసాఫ్ట్‌లో మంచి ఉద్యోగం వదులుకుని...
అవును! నా ఆలోచన ఒకటే. బాగా చదువుకొని టెక్నికల్ స్కిల్ ఉన్నవారు ఉపాధి వెతుక్కోవడానికి అనేక మార్గాలున్నాయి. చిన్న స్థాయి ఉద్యోగులకు ఇలాంటివేవీ లేవు. అందుకే ఆదాయం, అనుభవం, నైపుణ్యంతో అవసరం లేని చిన్న స్థాయి ఉద్యోగాల కల్పనకు ఒక వేదికను ఏర్పాటు చేయాలనుకున్నా. బాబాజాబ్ డాట్‌కామ్‌ను ఏర్పాటు చేశా. డెలివరీ బాయ్స్, డ్రైవర్లు, వంట వాళ్లు, క్యాషియర్ల వంటి ఉద్యోగాలకు ప్రాధాన్యమిస్తున్నాం.
మీ దగ్గర కూడా వెబ్సైట్లో నమోదు చేసుకోవాలా?
అవసరం లేదు. ఒక మిస్డ్ కాల్‌తో ఉద్యోగం వెతుక్కోవచ్చు. మీ ఫోన్ నుంచి 8880004444 అనే నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే మా కాల్‌సెంటర్ ప్రతినిధులు ఇదే నంబర్‌కు తిరిగి కాల్ చేసి వివరాలు తీసుకుంటారు. మీ అర్హతను బట్టి కావాలనుకునే సంస్థ ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తుంది.
ప్రస్తుతం బాబాజాబ్ వెబ్సైట్లో ఎంతమంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారు? ఎందరికి ఉపాధి కల్పించారు?
ఇప్పటి వరకు 27 లక్షల మంది నిరుద్యోగులు నమోదు చేసుకున్నారు. వీరికి ఉపాధి కల్పించడానికి లక్ష సంస్థలు నమోదు చేసుకున్నాయి. ప్రతి నెలా రెండు లక్షల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే అందులో 10 శాతం మందికి ఉపాధి లభిస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సంగతేంటి..?
ఈ రెండు రాష్ట్రాల్లో 75,000 మంది నిరుద్యోగులు, 350 కంపెనీలు నమోదు చేసుకున్నాయి. ఈ రెండు రాష్ట్రాల నుంచి ప్రతినెలా 80,000 మంది బాబాజాబ్ను సందర్శిస్తున్నారు.
ఎలాంటి ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువ? సగటు ప్రారంభవేతనం ఎంతుంది?
ఈ కామర్స్, రిటైల్, ట్యాక్సీ డ్రైవర్లు, స్థానిక బీపీవో కేంద్రాల నుంచి డిమాండ్ అధికంగా ఉంది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్, ఓటా, అమెజాన్ వంటి సంస్థల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు బాగా డిమాండుంది. రెండేళ్ల కిందట ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికిచ్చిన జీతాన్నిపుడు డెలివరీ బాయ్స్‌కు ఇస్తున్నారంటే డిమాండ్ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. పిజ్జా డెలివరీ బాయ్స్‌కు ప్రారంభంలోనే రూ. 10,000 నుంచి రూ.12,000 ఇస్తున్నారు. హౌస్ కీపింగ్, బీపీవో ఉద్యోగాలను తీసుకుంటే సగటు ప్రారంభవేతనం రూ.9,500గా ఉంది.
మరి మీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తోంది?
ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వారి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. ఉద్యోగాలిచ్చే సంస్థల నుంచే రుసుము వసూలు చేస్తున్నాం. జాబ్ పోస్ట్ చేసిన 20 నిమిషాల నుంచే కాల్స్ కావాలనుకుంటే రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది. 20 కాల్స్‌కి రూ.2,000 చెల్లించాలి. కొన్ని ప్రీమియం సర్వీసులను కూడా ఆఫర్ చేస్తున్నాం. వచ్చే 12-18 నెలల్లో దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 50 లక్షలకి చేర్చాలన్నది మా లక్ష్యం.
వెంచర్ ఫండ్ సంస్థల నుంచి నిధులు బాగానే వస్తున్నట్లున్నాయి...
ప్రస్తుతం ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఉన్నాం. దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేస్తున్నాం. తృతీయ స్థాయి పట్టణాలపైనా దృష్టిపెట్టాం. సంస్థ కార్యకలాపాల విస్తరణ, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను యువత ముందు ఉంచడం లక్ష్యంగా పనిచేస్తున్నాం. లక్ష్యాన్ని నిర్దేశిత కాలంలో సాధించగమన్న విశ్వాసం ఉంది. మా సంస్థలో వినోద్ ఖోస్లా ఇంపాక్ట్, గ్రే గోస్ట్ వెంచర్స్, యూఎస్ఏఐడీ సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. ఈ ఏడాది మళ్లీ నిధులు సేకరించే అవకాశం ఉంది.