కావాలనే ప్రతిపక్షాల రచ్చ | Sakshi
Sakshi News home page

కావాలనే ప్రతిపక్షాల రచ్చ

Published Sat, Oct 3 2015 3:54 AM

కావాలనే ప్రతిపక్షాల రచ్చ - Sakshi

రాష్ట్ర పంచాయతీరాజ్,ఐటీ మంత్రి కేటీఆర్
 
 వేములవాడ : అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సంక్షేమం గురించి నిర్మాణాత్మక సూచనలు చేయూల్సిన ప్రతిపక్ష పార్టీలు ఆ విషయూన్ని మరిచి అరిచి పెడబొబ్బలు పెట్టాయని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు విమర్శించారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం అగ్రహారంలో సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి మండలాలకు తాగునీరందించే వాటర్‌గ్రిడ్ పైలాన్‌ను ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ మొబైల్ వ్యాన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించిన తీరుపై విరుచుకుపడ్డారు. ‘

‘జానారెడ్డి జానేడు సూచన చేయలేదు, చిన్నారెడ్డి చిన్నపాటి సలహా ఇవ్వలేదు, జీవన్‌రెడ్డి రైతుల జీవితాల గురించేమీ చెప్పలేదు, దయాకరన్న రైతుల పట్ల దయచూపనే లేదు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘కిషన్‌రెడ్డి కూడా తిడుతుండు. రైతులు చనిపోవడం ఎవరికి సంతోషమయ్యా? మనస్సున్న వారి గుండె కరగదా? బాధకాదా? ముఖ్యమంత్రి కావాలనుకుంటే వారి (ప్రతిపక్షాల) బట్టలిప్పి వత్తుండే. 42 ఏండ్లు ఒక పార్టీ, 17 ఏండ్లు ఇంకో పార్టీ రాజ్యమేలింది. ఏం జేసిండ్రు, ఏం ఉద్ధరించిండ్రు, అరవైఏండ్ల గబ్బు... ఇంత తొందరగా పోతదా.. మాట్లాడడానికి సిగ్గు లేదూ..!’’ అంటూ ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6లక్షలు ఎక్స్‌గ్రేషియూ ప్రకటించిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కుతుందన్నారు.

 ఇంటింటికి నీళ్లివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లడగం
 రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వాటర్‌గ్రిడ్ పథకాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని కేటీఆర్ చెప్పారు. ఏ ఆడబిడ్డ కూడా నెత్తిన బిందెతో రోడ్లపై కనిపించే పరిస్థితి దాపురించవద్దని, వంటింటిలోనే నల్లా తిప్పితే నీరు వచ్చేలా ఈ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. పైప్‌లైన్ల ఏర్పాటుకు ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రత్యేక చట్టం తీసుకొచ్చామన్నారు. ప్రతి ఇక్కరూ సహకరిస్తేనే ఈ పథకం విజయవంతమవుతుందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement