నైట్‌క్లబ్‌ అమ్మాయిలపై కీచకపర్వం | gurugram's night club women staff strong lesson to abbusers | Sakshi
Sakshi News home page

నైట్‌క్లబ్‌ అమ్మాయిలపై కీచకపర్వం

Jun 12 2017 1:00 PM | Updated on Oct 17 2018 5:37 PM

నైట్‌క్లబ్‌ అమ్మాయిలపై కీచకపర్వం - Sakshi

నైట్‌క్లబ్‌ అమ్మాయిలపై కీచకపర్వం

నైట్‌క్లబ్‌ యువతుల బృందం.. సివంగుల్లా గర్జించింది. చెప్పులు చేతబట్టి కీచకులపై ప్రతిదాడి చేసింది. వారి ధాటికి తట్టుకోలేక ముష్కరులు తోకముడిచారు.

అది ఢిల్లీ శివారు గురుగ్రామ్‌. నైట్‌క్లబ్స్‌, షాపింగ్‌మాల్స్‌ అధికంగా ఉండే ఎంజీ రోడ్‌ ప్రాంతం. సమయం రాత్రి ఒంటిగంట. నైట్‌క్లబ్స్‌లో డ్యూటీ పూర్తిచేసుకుని ఇళ్లకు బయలుదేరిందో యువతుల బృందం. క్యాబ్‌ కోసం రోడ్డుమీద ఎదురుచూస్తుండగా వాళ్లను నలుగురు పోకిరీలు చుట్టుముట్టారు. అసభ్య పదజాలంతో మాటలదాడి చేశారు. ప్రతిగా అమ్మాయిలు తీవ్ర హెచ్చరికలు చేశారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన యువకులు.. ఐదు నిమిషాల తర్వాత మరో పది మంది స్నేహితులను వెంటేసుకొచ్చి దాడికి పూనుకున్నారు. ఒక అమ్మాయిని బలవతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ చర్యతో నిర్ఘాంతపోయిన మిగతా యువతులు.. సివంగుల్లా గర్జించారు. చెప్పులు చేతబట్టి కీచకులపై ప్రతిదాడి చేశారు. వారి ధాటికి తట్టుకోలేక ముష్కరులు తోకముడిచారు.

శనివారం రాత్రి నడిరోడ్డుపై దాదాపు అరగంటపాటు ఈ రణరంగం సాగింది. అయినాసరే.. ఏ ఒక్కరూ అమ్మాయిలకు అండగా నిలవలేదు. రక్షకభటుల జాడ తెలియరాలేదు. గుమ్మికూడిన జనం దృశ్యాలను కెమెరాల్లో బంధించారేతప్ప, ఇదేంటని నిలదీయలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయినా.. ఇప్పటివరకు పోలీసు కేసు మాత్రం నమోదుకాకపోవడం గమనార్హం.

సెక్స్‌ డీల్స్‌ ఓపెన్‌ సీక్రెట్‌
శనివారం రాత్రి అమ్మాయిలపై కీచకులు దాడి చేసినప్పుడు అక్కడే ఉన్న లాల్‌ అనే వ్యక్తి ఆ ప్రాంతం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. గురుగ్రామ్‌లోని ప్రఖ్యాత ఎంజే రోడ్డులోనే దాదాపు 15 నైట్‌క్లబ్స్‌ ఉన్నాయి. ‘ఇక్కడ డ్రగ్స్‌, సెక్స్‌ డీల్స్‌ భారీ ఎత్తున జరుగుతాయన్నది ఓపెన్‌ సీక్రెట్‌. మామూళ్ల మత్తులో జోగే పోలీసులు.. విషయం సోషల్‌ మీడియాలో హైలైట్‌ అయిన తర్వాతగానీ స్పందించరు. దీనిపై ఎంతో మంది ఎన్నోసార్లు ఫిర్యాదుచేసినా పరిస్థితిలో మార్పురాలేదు’అని లాల్‌ పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement