లవ్‌ ఫెయిల్యూర్‌ అని స్టేటస్‌.. అంతలోనే | Sakshi
Sakshi News home page

లవ్‌ ఫెయిల్యూర్‌ అని స్టేటస్‌.. అంతలోనే

Published Mon, Feb 17 2020 9:53 AM

Person Died In Road Accident In Nizamabad - Sakshi

సాక్షి, కామారెడ్డి క్రైం: గంట ముందే ఆన్‌లైన్‌లో ఉన్నాడు. బైక్‌ నడిపిస్తూనే లవ్‌ ఫెయిల్యూర్‌ అంటూ వాట్సప్‌ స్టేటస్‌ పెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని అదే బైక్‌ నడిపిస్తూ ఆటోను ఢీకొన్న ఘటనలో మృత్యువాత పడ్డాడు. రాజంపేటకు చెందిన ఓ యువకుడు కామా రెడ్డి మండలం ఉగ్రవాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం 8 గంటల ప్రాంతంలో చో టు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రాజంపేటకు చెందిన ఎల్కంటి వెంకటిగౌడ్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్దవాడు ప్రదీప్‌గౌడ్‌(19) చదువు మానేసి స్థానికంగా ఉన్న కల్లు డిపోలో, వైన్స్‌లో పనిచేశాడు.

కొంత కాలంగా ఖాళీగా ఉన్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయల్దేరిన అతడు సాయంత్రం 8 గంటల ప్రాంతంలో కామారెడ్డి–సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఉగ్రవాయి స్టేజీకి కొద్ది దూరంలో ఉన్న సాయిబాబా మందిరం వద్ద ఆటో ఢీకొన్న ఘటనలో మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని దేవునిపల్లి పోలీసు లు పరిశీలించి విచారిస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. 

గంట ముందే వాట్సాప్‌ స్టేటస్‌ 
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ప్రదీప్‌గౌడ్‌ తాను ప్రమాదానికి గురవడానికి ఒక గంట ముందే ఆన్‌లైన్‌లో ఉన్నాడు. బైక్‌ నడిపిస్తూ తన సెల్‌ఫోన్‌తో లవ్‌ ఫెయిల్యూర్‌ అంటూ మాట్లాడుతూ వాట్సప్‌ స్టేటస్‌ పెట్టాడు. సరిగ్గా గంట తర్వాత అతడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అందరిని కలచి వేసింది. అతను ఎక్కడికి వెళ్లాడు, ఏం జరిగిందనే విషయంపై స్పష్టత రాలేదు. లవ్‌ ఫెయిల్యూర్‌ అయిందంటూ అతను ఏడుస్తూ స్టేటస్‌ పెట్టడం మాత్రం చర్చనీయాంశమైంది. బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున కామారెడ్డి ఏరి యా ఆస్పత్రికి తరలివచ్చి విలపించారు.   

Advertisement
Advertisement