ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు బైఠాయింపు | Cheated By Lover Girl Protest In Front Of House | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు బైఠాయింపు

Jun 20 2019 8:39 AM | Updated on Jun 20 2019 8:48 AM

Cheated By Lover Girl Protest In Front Of House - Sakshi

ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటం చేస్తున్న అనూష

పెద్దపల్లిరూరల్‌ : ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు మొఖం చాటేస్తున్న ప్రియుడు ఇంటి ఎదుట ప్రియురాలు బైఠాయించిన సంఘటన బుధవారం పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. తన కూతురుకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తల్లి లక్ష్మి సైతం గ్రామంలోని వాటర్‌ట్యాంకు ఎక్కి నిరసన తెలిపింది. అప్పన్నపేటకు చెందిన దామ అనూష అదే గ్రామానికి చెందిన అనవేని శ్రీకాంత్‌లు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పిన శ్రీకాంత్‌ ఇప్పుడు మాట మార్చడంతో వారం రోజుల క్రితం గ్రామంలోని వాటర్‌ ట్యాంకు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించింది.

దీంతో స్థానికులు పెద్దపల్లి సీఐ నరేందర్‌కు సమాచారం అందించగా అప్పన్నపేటకు వెళ్లిన అమ్మాయి అనూషతో మాట్లాడి న్యాయం చేస్తానని సముదాయించి కిందకు దించిన విషయం తెలిసిందే. వారం గడిచినా సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపలేదంటూ బుధవారం ప్రియుడు శ్రీకాంత్‌ ఇంటి ఎదుట దీక్షకు దిగింది. ప్రియురాలు తన ఇంటి ఎదుట బైఠాయిస్తుందని గ్రహించిన శ్రీకాంత్‌ కుటుంబీకులు నేరుగా పోలీసులనే ఆశ్రయించినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. కాగా కూతురు అనూష కోసం తల్లి లక్ష్మి ఆత్మహత్య చేసుకుంటానంటూ వాటర్‌ట్యాంకు ఎక్కడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. అనూషకు న్యాయం చేయాల్సిందిగా గ్రామస్తులంతా ముక్తకంఠంతో అనూషకు మద్దతు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement