తీన్‌మార్‌ పంచ్‌ | Nikhat, Meena Kumari strike gold at Strandja Memorial Boxing | Sakshi
Sakshi News home page

తీన్‌మార్‌ పంచ్‌

Feb 20 2019 1:43 AM | Updated on Feb 20 2019 1:43 AM

Nikhat, Meena Kumari strike gold at Strandja Memorial Boxing - Sakshi

కొత్త సీజన్‌ను భారత బాక్సర్లు పతకాల పంటతో ప్రారంభించారు. స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో మొత్తం ఏడు పతకాలు సొంతం చేసుకుని అదరగొట్టారు. ఇందులో మూడు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలు ఉన్నాయి. భారత్‌ తరఫున తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌... మణిపూర్‌ అమ్మాయి మైస్నం మీనాకుమారి దేవి... హరియాణా బాక్సర్‌ అమిత్‌ పంగల్‌ ‘పసిడి పంచ్‌’లతో మెరిశారు.  

సోఫియా (బల్గేరియా): అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత బాక్సర్లు స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో మెరిపించారు. 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో తొలిసారి మహిళల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించి కొత్త చరిత్ర సృష్టించారు. 51 కేజీల విభాగంలో ప్రపంచ జూనియర్‌ మాజీ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌... 54 కేజీల విభాగంలో మైస్నం మీనా కుమారి దేవి... పురుషుల 49 కేజీల విభాగంలో ఆసియా క్రీడల విజేత అమిత్‌ పంగల్‌ పసిడి పతకాలు గెలిచారు. మహిళల 48 కేజీల విభాగంలో మంజు రాణి రజతం నెగ్గగా... సెమీఫైనల్లో ఓడిపోయిన ప్విలావో బాసుమతారి (64 కేజీలు), నీరజ్‌ (60 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్‌ (69 కేజీలు) కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డారు. గతంలో మహిళల విభాగంలో భారత్‌ తరఫున మేరీకోమ్‌ (రజతం) ప్రదర్శనే అత్యుత్తమంగా ఉంది.  
మంగళవారం జరిగిన ఫైనల్స్‌లో నిజామాబాద్‌ జిల్లా అమ్మాయి నిఖత్‌ జరీన్‌ 5–0తో ఐరీష్‌ మాగ్నో (ఫిలిప్పీన్స్‌)పై... మీనా కుమారి 3–2తో ఐరా విలెగాస్‌ (ఫిలిప్పీన్స్‌)పై నెగ్గగా... మంజు రాణి 2–3తో జోసీ గబుకో (ఫిలిప్పీన్స్‌) చేతిలో ఓడిపోయింది. మరో టైటిల్‌ పోరులో అమిత్‌ పంగల్‌ 3–2తో తెమిర్‌తాస్‌ జుసుపోవ్‌ (కజకిస్తాన్‌)పై గెలిచాడు. ఐరీష్‌ మాగ్నోతో జరిగిన తుది పోరులో నిఖత్‌ ఆద్యంతం దూకుడుగా ఆడింది. అవకాశం వచ్చినపుడల్లా ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. నిఖత్‌ను నిలువరించడానికి ఐరీష్‌ మాగ్నో రక్షణాత్మకంగా ఆడినా ఫలితం లేకపోయింది. 

అమర జవాన్లకు అంకితం... 
ఈ స్వర్ణం పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్‌ జవాన్లకు అంకితం ఇస్తున్నాను. ఫైనల్లో ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా పోరాడాను. ఆ అమ్మాయి తొలి రౌండ్‌లో భారత్‌కే చెందిన పింకీ జాంగ్రాను ఓడించింది. ఈ స్వర్ణం నా సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేసిన వారికి సమాధానం. 
–నిఖత్‌ జరీన్‌   

Advertisement
 
Advertisement
Advertisement