డిసెంబర్‌లో రాహుల్‌కు ప్రమోషన్‌ | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌లో రాహుల్‌కు ప్రమోషన్‌

Published Tue, Nov 21 2017 1:25 AM

Stage is set for Rahul Gandhi’s elevation as Congress president - Sakshi - Sakshi - Sakshi

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా యువరాజు రాహుల్‌ గాంధీ(47) పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది. వచ్చే నెల 5న తన తల్లి సోనియా గాంధీ నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని రాహుల్‌ గాంధీ అనధికారికంగా చేపట్టనున్నారు. ఆ మేరకు ఏఐసీసీ అధ్యక్ష పీఠాన్ని చేపట్టేందుకు రాహుల్‌కు వీలు కల్పిస్తూ.. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూల్‌ను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) ఆమోదించింది. కీలకమైన గుజరాత్‌ ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసేలా కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన సీడబ్ల్యూసీ సోమవారం నిర్ణయం తీసుకుంది.

పార్టీ తరఫున రాహుల్‌ ఒక్కరే నామినేషన్‌ వేస్తారని, అందువల్ల నామినేషన్ల పరిశీలన అనంతరం డిసెంబర్‌ 5 నాటికే రాహుల్‌ ఎన్నిక ఖాయమవుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే డిసెంబర్‌ 19న రాహుల్‌ అధికారికంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. కాంగ్రెస్‌కు రికార్డు స్థాయిలో 1998 నుంచి 19 సంవత్సరాలుగా సోనియా గాంధీనే అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.  డిసెంబర్‌ 1న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది.

సీడబ్ల్యూసీ భేటీ అనంతరం కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ చైర్మన్‌ ముల్లపల్లి రామచంద్రన్‌ షెడ్యూల్‌ వివరాలు వెల్లడిస్తూ ‘డిసెంబర్‌ 1 నుంచి నామినేషన్లు స్వీకరిస్తాం. డిసెంబర్‌ 4 మధ్యాహ్నం మూడు గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. డిసెంబర్‌ 5న నామినేషన్లు పరిశీలించి మధ్యాహ్నం 3.30 గంటలకు పోటీలో నిలిచిన అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉంటే.. డిసెంబర్‌ 11 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువునిస్తాం.

డిసెంబర్‌ 16న ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్‌ 19న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల్ని ప్రకటిస్తాం’ అని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ వర్గాల సమాచారం మేరకు.. రాహుల్‌ గాంధీ ఒక్కరే నామినేషన్‌ వేయనున్నారు. గుజరాత్‌ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు.. డిసెంబర్‌ 5వ తేదీనే కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ ఎన్నిక ఖాయమవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్‌లో డిసెంబర్‌ 9, 14 తేదీల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో రాష్ట్ర పీసీసీ విభాగాల ప్రతినిధులు ఓటు వేస్తారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, ఇతర ఆఫీసు బేరర్స్‌తో కూడిన సీడబ్ల్యూసీ టీంను ఎంపికచేస్తారు.  

సోనియా మార్గనిర్దేశకత్వం ఉంటుంది
2013లో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు చేపట్టారు. గత కొంతకాలంగా సోనియా గాంధీ అనారోగ్యం నేపథ్యంలో రాహుల్‌కు పార్టీ బాధ్యతల అప్పగింతపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా మాట్లాడుతూ.. ‘సోనియా గాంధీ మా నేత, మార్గదర్శకురాలు. ఇన్నాళ్లు నిరంతరంగా కాంగ్రెస్‌ పార్టీని నడిపించారు. రాహుల్‌ గాంధీకే కాకుండా కోట్లాది మంది కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు ఆమె సమర్ధ నాయకత్వం, మార్గనిర్దేశకత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది’ అని చెప్పారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల అనంతరం సోనియా గాంధీ ఎలాంటి పాత్ర పోషిస్తారు? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ముందు ఎన్నికల ప్రక్రియ పూర్తి కానివ్వండి’ అని అన్నారు.  

ఇదే సరైన సమయం
సీడబ్యూసీ నిర్ణయాన్ని పలువురు కాంగ్రెస్‌ నేతలు స్వాగతించారు. 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం పార్టీకి పునరుజ్జీవమని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ ఎన్నిక పార్టీపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ఎంపీ రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఒక కుటుంబానికే పరిమితమా? కింది స్థాయి కార్యకర్త ఆ పదవిని ఎన్నటికీ ఆశించలేడా?అని బీజేపీ సీనియర్‌ నేత రవిశంకర్‌ప్రసాద్‌ ప్రశ్నించారు.  

ప్రజాస్వామ్య ఆలయానికి తాళం: సోనియా
న్యూఢిల్లీ/రాజ్‌కోట్‌: మోదీ ప్రభుత్వం అహంకారంతో ప్రవర్తిస్తోందని, పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల జాప్యం పేరుతో ప్రజాస్వామ్య దేవాలయానికి తాళం వేసేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వల్ప కారణాలతో శీతాకాల సమావేశాలకు విఘాతం కలిగిస్తున్నారని సీడబ్ల్యూసీ భేటీలో ఆమె ఆరోపించారు. సోనియా ఆరోపణల్ని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ తోసిపుచ్చుతూ.. గతంలో ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ  కూడా సమావేశాల్ని వాయిదా వేసిందని సమాధానమిచ్చారు.

నిజానికి శీతాకాల సమావేశాలు నవంబర్‌ మూడో వారంలో ప్రారంభమై.. డిసెంబర్‌ మూడో వారంలో ముగియాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో ఈసారి డిసెంబర్‌ రెండో వారంలో ప్రారంభించి 10 రోజుల పాటు కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌ సమావేశాల వాయిదాను సీడబ్ల్యూసీ భేటీలో సోనియా ప్రస్తావిస్తూ.. ‘మోదీ ప్రభుత్వం అహకారంతో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నీరుగారుస్తోంది.

ఎన్నికల వేళ ప్రజాస్వామ్య దేవాలయానికి తాళం వేసి రాజ్యాంగ జవాబుదారీతనం నుంచి తప్పించుకోవాలనుకుంటే పొరబడినట్లే’ అని ఆమె పేర్కొన్నారు. సోనియా ఆరోపణల్ని జైట్లీ తిరస్కరిస్తూ.. ‘కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2011వ సంవత్సరంతో పాటు అంతకుముందు కూడా ఎన్నికల కారణంతో పార్లమెంట్‌ సమావేశాలు ఆలస్యమయ్యాయి. ఇలా మార్పులు చేయడం సంప్రదాయంగా వస్తోంది’ అని జైట్లీ పేర్కొన్నారు. శీతాకాల సమావేశాల్ని తప్పకుండా నిర్వహిస్తామని, ఒక నిజాన్ని అబద్ధమని ఎంత గట్టిగా చెప్పినా అది అబద్ధం కాదన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement