రైట్‌ డిసిషన్‌ అయినా ‘రాంగ్‌ టైమ్‌’లో తప్పే!

Sharia Courts Divide Opinion Even Among Muslims - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ప్రతి జిల్లాలో ఓ ‘షరియా కోర్టు’ను ఏర్పాటు చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పాలకపక్ష భారతీయ జనతా పార్టీ అయితే అగ్గిమీద గుగ్గిలం అయింది. ఈ కోర్టులు కేవలం షరియా చట్టాన్ని మాత్రమే విశ్లేషిస్తాయని, మధ్యవర్తిత్వం కోసం వచ్చే స్త్రీ, పురుషులకు, ముఖ్యంగా భార్య భర్తలకు షరియా చట్టం ప్రకారం రాజీ కుదుర్చుతాయని, ఇచ్చే తీర్పులను పాటించడం, పాటించక పోవడం పార్టీల చిత్తమేనని, ఎలాంటి బలవంతం ఉండదని ముస్లిం లా పర్సనల్‌ బోర్డు వివరణ ఇచ్చినా బీజేపీ వినిపించుకోలేదు.

భారత్‌ ఇస్లామిక్‌ దేశం కాదని, దేశంలోని చట్టబద్ధమైన కోర్టులకు సమాంతరంగా ఓ మైనారిటీ సమాజం సమాంతర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని బీజేపీ నాయకులు ఘాటుగా స్పందించారు. వాస్తవానికి ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తీసుకున్న నిర్ణయం పట్ల పలు ముస్లిం సంఘాలే ధ్వజమెత్తాయి. దేశంలో ఎక్కువగా ఉన్న సున్నీ ముస్లింలే షరియా కోర్టులను కోరుకుంటారు. షియాలు వ్యతిరేకిస్తున్నారు. ఈ సారి సున్నీలు కూడా రెండు విధాలుగా బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇప్పటికే దేశంలో అణచివేతకు గురవుతున్నారని, ఈ నిర్ణయం వల్ల మరింత అణచివేతకు గురికావాల్సి వస్తోందని ఓ వర్గం సున్నీలు అభిప్రాయపడగా, షరియా తీర్పులను అమలు చేసే వ్యవస్థ లేనప్పుడు షరియా కోర్టుల వల్ల లాభమేమని మరో వర్గం సున్నీలు ప్రశ్నించారు. షరియా రాజ్యాంగం అమల్లోలేని రాజ్యంలో షరియా చట్టాన్ని ఎలా అమలు చేస్తారని పలు షియా సంఘాలు ప్రశ్నించాయి.

షరియా అంటే ఏమిటీ?
షరియా కోర్టును దారుల్‌ ఖాజా అని కూడా వ్యవహరిస్తారు. షరియా అంటే అరబిక్‌ భాషలో న్యాయ వ్యవస్థ అని అర్థం ఇక దారుల్‌ ఖాజా అంటే  ‘ఇంటి తీర్పు’ అని అర్థం. అఖిల భారత ఇస్లామిక్‌ పర్సనల్‌ లా బోర్డు ఇప్పటి వరకు దేశంలో 50 షరియా కోర్టులను ఏర్పాటు చేసింది. వాటికి తీర్పు చెప్పే ఖాజీలను కూడా అదే నియమిస్తోంది. ఇప్పుడు జిల్లాకు ఒకటి చొప్పున పెంచాలని నిర్ణయించడం వివాదాస్పదమైంది. షరియా కోర్టుల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును ఓ సారి చదివి స్పందించాలని విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకులకు హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సూచించారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి జీవించడం పట్ల ముస్లిం పర్సనల్‌ లా బోర్డుకు విశ్వాసం ఉందని, భార్యాభర్తల తగాదాలను, ఆస్తుల పంపకాల వివాదాలను అతి తక్కువ ఖర్చుతో, అతి తొందరగా షరియా కోర్టులు తీరుస్తున్నాయని అఖిల భారత ముస్లిం ఏ ఇత్తేహాదుల్‌ ముస్లిమెన్‌ అధ్యక్షుడైన ఓవైసీ వివరించారు. ఇలాంటి న్యాయం ముస్లిం కమ్యూనిటీకి మరింత చేరువ చేయడం కోసమే పర్సనల్‌ లా బోర్డు నిర్ణయం తీసుకున్నదని అందులో సభ్యుడు కూడా అయిన ఓవైసీ వివరించారు.

సుప్రీం కోర్టు ఇంతకు ఏం చెప్పిందీ?
దేశంలోని షరియా కోర్టులకు చట్టపరమైన అధికారాలేవీ లేవని, అవిచ్చే తీర్పులను కచ్చితంగా పాటించాలనే నిబంధనలూ లేవని బీజేపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో అంటే 2014, జూలై నెలలో స్పష్టం చేసింది. వాటిని నిషేధించాలనే డిమాండ్‌ను కూడా త్రోసిపుచ్చింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడనందున, ఓ కమ్యూనిటీ సంస్థగానే పనిస్తున్నందున వాటిని నిషేధించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
 
షరియత్‌ కోర్టుల అమలుకు ఎలాంటి వ్యవస్థ లేనందున వాటిని ఏర్పాటు చేయడం న్యాయ వ్యవస్థకు పోటీ అవుతుందని భావించడంలో అర్థం లేదని హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ యూనివర్శిటీ మాజీ ఛాన్సలర్‌ జాఫర్‌ సరేశ్‌వాలా వ్యాఖ్యానించారు. సత్వర న్యాయం కోసమే షరియత్‌ కోర్టులు అవసరమని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని సహ్రాన్‌పూర్‌కు చెందిన 30 ఏళ్ల రెహనుమా భర్త నుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టు చుట్టూ రెండేళ్లు తిరిగినా విడాకులు లభించలేదని, ఆమె అదే సహ్రాన్‌పూర్‌లోని దారుల్‌ ఖాజాకు వెళ్లగా రెండే రోజుల్లో విడాకులు లభించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

దేశంలో ఎప్పటి నుంచో షరియా కోర్టులు నడుస్తున్నాయని, వాటి పట్ల ఎప్పుడూ వ్యతిరేకత లేదని, ఇప్పుడు  మరిన్ని వాటిని ఏర్పాటు చేయాలనుకోవడంతో వ్యతిరేకత వచ్చిందని, తీసుకున్న నిర్ణయం సరైనదైనా తీసుకున్న సమయం సరైనది కాదని ‘అఖిల భారత ఉలేమా మెహసాయిక్‌ బోర్డు’ అధికార ప్రతినిధి యూసుఫ్‌ మొహాని వ్యాఖ్యానించారు. సరైన సమయం కాదనడం అంటే బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు అనే అర్థం అని అందరికి అర్థం అవుతోంది. సార్వత్రిక ఎన్నికలు రానున్న దృష్ట్యా ఇలాంటి అంశాలు అనవసరంగా వివాదాస్పదమవుతాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top