‘వారి కష్టాలకు రాళ్లు కూడా కన్నీరు కారుస్తాయి’ | Sakshi
Sakshi News home page

‘కశ్మీర్‌లో పరిస్థితి భయంకరంగా ఉంది’

Published Sat, Aug 24 2019 7:20 PM

Ghulam Nabi Azad Says Terrific Situation In Jammu Kashmir - Sakshi

శ్రీనగర్‌ : కశ్మీర్‌ పర్యటనకు వెళ్లిన విపక్ష బృందాన్ని వెనక్కి పంపడంపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఆహ్వానం మేరకే తాను ఇక్కడికి వచ్చానని అయితే ఇప్పుడు ఇలా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్‌ రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడుతూ... లోయలో ప్రశాంత వాతావరణం ఉందని తెలిపారు. అంతగా కావాలనుకుంటే విపక్ష నేతలు ఇక్కడ పర్యటించవచ్చని సూచించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో పాటు పలువురు ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన పలువురు నేతలు శనివారం కశ్మీర్‌ పర్యటనకు బయల్దేరారు. అయితే వీరి పర్యటనకు కశ్మీర్‌ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అంతేగాక జాతీయ నేతలు పర్యటించాలనుకున్న ప్రాంతాల్లో ముందుగానే 144 సెక్షన్‌ను అమలు చేశారు. అనుమతి లేనప్పటికీ విపక్ష నేతల బృందం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని అడ్డగించిన అధికారులు తిరిగి పంపించివేశారు.

ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడుతూ..‘కొన్ని రోజుల క్రితం జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌ నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. అందుకే ఇక్కడికి వచ్చాను. అయితే మమ్మల్ని ఎయిర్‌పోర్టు దాటి బయటకు రానివ్వడం లేదు. మాతో ఉన్న జర్నలిస్టులతో ఇక్కడి అధికారులు తప్పుగా ప్రవర్తించారు. వారిని కొట్టారు. జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణంగా లేవు అనడానికి ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ..‘ కశ్మీర్‌లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అందుకే మమ్మల్ని అనుమతించడం లేదు. కశ్మీర్‌ నుంచి వస్తున్న ప్రయాణికులు తమ కష్టాలను విమానంలో మాతో పంచుకున్నారు. వారి మాటలు వింటే రాళ్లు కూడా కన్నీటి పర్యంతమవుతాయి. పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి అని కేంద్ర సర్కారు తీరుపై ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement