ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కింద జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్
స్థలాల స్వాధీనానికి, అభివృద్ధి చేసుకునేందుకు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కింద జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీకి హైదరాబాద్‌లో కేటాయించిన స్థలాలను అది తన స్వాధీనంలోకి తెచ్చుకుని అభివృద్ధి చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే తుది ఉత్తర్వులు వెలువడేంత వరకు నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎంపీలు, సివిల్ సర్వీసెస్ అధికారులు, జర్నలిస్టులు తదితర వర్గాలకు చెందిన 6 సొసైటీలకు విభిన్న జీవోల ద్వారా స్థలాలు కేటాయించింది.
అయితే 5 సొసైటీలు తమకు కేటాయించిన స్థలాలను స్వాధీనంలోకి తీసుకోగా జర్నలిస్టు సొసైటీ ప్రభుత్వానికి డబ్బులు చెల్లించినప్పటికీ.. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోలేకపోయింది. ఇందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ చేసుకున్న మధ్యంతర దరఖాస్తును మంగళవారం విచారించిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ స్థలాన్ని స్వాధీనపరిచేందుకు తమకేమీ అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి నివేదించారు. అయితే హైకోర్టు విధించిన ఇతర షరతులు వర్తిస్తాయని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.


