breaking news
Journalist Housing Society
-
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు కార్యాచరణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టులకు చట్టపరమైన చిక్కులు లేని విధంగా, నివాసయోగ్యమైన ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లో జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని మంత్రి గుర్తుచేశారు. అయితే, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండటంతో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే ప్రక్రియ సుదీర్ఘకాలం నిలిచిపోయిందని తెలిపారు. 2022లో న్యాయపరమైన అడ్డంకులు తొలగిన తర్వాత కూడా గతంలో ఈ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై చొరవ తీసుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి 2024 సెప్టెంబర్ 8వ తేదీన రవీంద్ర భారతిలో కార్యక్రమాన్ని నిర్వహించి భూమిని సొసైటీకి అప్పగించడం జరిగిందన్నారు. అనంతరం సుప్రీంకోర్టు తుది ఉత్తర్వుల నేపథ్యంలో మరోసారి న్యాయపరమైన సమస్యలు ఎదురుకావడంతో ఈ అంశానికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సహచర మంత్రులతో పలుమార్లు చర్చించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే అంశంపై సమగ్రంగా సమీక్షించినట్లు మంత్రి వెల్లడించారు.కాంగ్రెస్ పాలనలోనే ఇస్తాం ''జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేయాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. గతంలో ఎదురైన న్యాయపరమైన సమస్యలు పునరావృతం కాకుండా, చట్టపరమైన చిక్కులు లేని విధంగా, కుటుంబాలతో గౌరవంగా నివసించేందుకు అనువైన ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంద''ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు ఇవ్వడం జరిగిందని మరోసారి కాంగ్రెస్ పాలనలోనే ఇస్తామని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: 3 విడతల్లో లక్ష ఇళ్ల నిర్మాణాలుజర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యంప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంతోపాటు, వారికి గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సొంతింటి కల నెరవేరేలా, అందరికీ ఆమోదయోగ్యమైన శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. -
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపును తప్పుపట్టలేం
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపును తప్పుపట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. జర్నలిస్టులు సమాజంలో పౌరులకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులోకి తెస్తూ వారిని జాగృతపరుస్తుంటారని హైకోర్టు తెలిపింది. దీని ద్వారా పౌరులు తమకు రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకోగలుగుతున్నారని తెలిపింది. అటువంటి జర్నలిస్టులకు మద్దతుగా పలు చర్యలు తీసుకోవడంలో తప్పు లేదంది. రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలం, నార్సింగి గ్రామంలో జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి భూమిని బదలాయిస్తూ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ పేరు మీద నార్సింగి గ్రామంలో భూమి బదలాయింపు చేస్తూ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కె.నాగిరెడ్డి అనే రైతు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై ఇటీవల సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పలు అంశాలను లేవనెత్తారు. ఈ సమయంలో ధర్మాసనం కేసు డాక్యుమెంట్లను పరిశీలించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనను తోసిపుచ్చింది. జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి భూ బదలాయింపు నిర్ణయం 2008లో జరిగిందని గుర్తు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పిటిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. జర్నలిస్టుల విజ్ఞప్తి మేరకు సేల్డీడ్ ద్వారానే ఆ భూ బదలాయింపు జరిగిందని, అప్పటి ముఖ్యమంత్రి జోక్యంతో వారికి భూమిని స్వాధీనం కూడా చేశారని ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమీ కనిపించడం లేదని తేల్చి చెబుతూ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో తప్పులేదంటూ అందుకు కారణాలను వివరించింది. -
జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి సుప్రీంలో ఊరట
స్థలాల స్వాధీనానికి, అభివృద్ధి చేసుకునేందుకు అనుమతి సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కింద జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీకి హైదరాబాద్లో కేటాయించిన స్థలాలను అది తన స్వాధీనంలోకి తెచ్చుకుని అభివృద్ధి చేసుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే తుది ఉత్తర్వులు వెలువడేంత వరకు నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎంపీలు, సివిల్ సర్వీసెస్ అధికారులు, జర్నలిస్టులు తదితర వర్గాలకు చెందిన 6 సొసైటీలకు విభిన్న జీవోల ద్వారా స్థలాలు కేటాయించింది. అయితే 5 సొసైటీలు తమకు కేటాయించిన స్థలాలను స్వాధీనంలోకి తీసుకోగా జర్నలిస్టు సొసైటీ ప్రభుత్వానికి డబ్బులు చెల్లించినప్పటికీ.. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోలేకపోయింది. ఇందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ చేసుకున్న మధ్యంతర దరఖాస్తును మంగళవారం విచారించిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ స్థలాన్ని స్వాధీనపరిచేందుకు తమకేమీ అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి నివేదించారు. అయితే హైకోర్టు విధించిన ఇతర షరతులు వర్తిస్తాయని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.


