సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపును తప్పుపట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. జర్నలిస్టులు సమాజంలో పౌరులకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులోకి తెస్తూ వారిని జాగృతపరుస్తుంటారని హైకోర్టు తెలిపింది. దీని ద్వారా పౌరులు తమకు రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకోగలుగుతున్నారని తెలిపింది. అటువంటి జర్నలిస్టులకు మద్దతుగా పలు చర్యలు తీసుకోవడంలో తప్పు లేదంది. రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలం, నార్సింగి గ్రామంలో జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి భూమిని బదలాయిస్తూ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ పేరు మీద నార్సింగి గ్రామంలో భూమి బదలాయింపు చేస్తూ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కె.నాగిరెడ్డి అనే రైతు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై ఇటీవల సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పలు అంశాలను లేవనెత్తారు. ఈ సమయంలో ధర్మాసనం కేసు డాక్యుమెంట్లను పరిశీలించింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనను తోసిపుచ్చింది. జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి భూ బదలాయింపు నిర్ణయం 2008లో జరిగిందని గుర్తు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పిటిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. జర్నలిస్టుల విజ్ఞప్తి మేరకు సేల్‌డీడ్ ద్వారానే ఆ భూ బదలాయింపు జరిగిందని, అప్పటి ముఖ్యమంత్రి జోక్యంతో వారికి భూమిని స్వాధీనం కూడా చేశారని ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమీ కనిపించడం లేదని తేల్చి చెబుతూ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో తప్పులేదంటూ అందుకు కారణాలను వివరించింది.


