పెద్ద సినిమాలకు ఓటీటీ వర్కౌట్‌ కాదు

OTT not successful for big movies - Sakshi

‘‘కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్‌ డౌన్‌వల్ల అన్ని పరిశ్రమల్లో ఉన్న పరిస్థితే సినిమా రంగంలోనూ ఉంది.. సినిమా పరిశ్రమ మామూలు పరిస్థితికి రావడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. జనవరి వరకూ ఈ పరిస్థితి కొనసాగుతుందని నా అంచనా’’ అని తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్, నిర్మాత పి.రామ్మోహన్‌ రావు అన్నారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ– ‘‘సినిమా అంటే ప్రేక్షకులు వందల సంఖ్యలో వస్తారు.

అంతమంది ఒకసారి వచ్చినా ఎటువంటి భయాలు ఉండని పరిస్థితి వచ్చే వరకూ థియేటర్స్‌ పరిస్థితి మెరగవదు. అప్పటి వరకూ పెద్ద సినిమాల విడుదల ఆపాల్సిందే. షూటింగ్స్‌ మొదలు కావడానికి మరో ఆరు నెలలు పట్టొచ్చని అనుకుంటున్నా. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ మీద పెద్ద సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరు. వారి బడ్జెట్‌లు ఓటీటీ మీద వర్కవుట్‌ కావు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నిర్మాతలు నిర్ణయం తీసుకుంటే రెడీగా ఉన్న సినిమాలు కొన్ని  ఓటీటీ మీదకు వస్తాయేమో కానీ 90 శాతం సినిమాలు ఓటీటీ మీద రిలీజ్‌ చేసేందుకు నిర్మాతలు రారు.

పరిశ్రమలో ఎక్కువగా ఇబ్బంది పడే కార్మికుల కోసం చిరంజీవిగారు మొదలు పెట్టిన కరోనా క్రైసిస్‌ ఛారిటీ చాలా అద్భుతంగా పనిచేస్తోంది. ఆ కార్మికులను కాపాడుకోవటమే ఇప్పుడు సినిమా పరిశ్రమ ముందు ఉన్న పెద్ద సవాల్‌. ప్రభుత్వ సహాయం వీరికి అందేలా చూసి, మద్దతుగా నిలుస్తాం. కరోనా లేదనే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు థియేటర్స్‌ దగ్గర సందడి కనబడుతుంది. అది ఆరు నెలలు పడుతుందా? ఏడాది పడుతుందా? అనేది ఇప్పుడే చెప్పలేం.. కానీ థియేటర్స్‌ వ్యవస్థ ఎప్పటికీ అలాగే ఉంటుంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top