నలుగురు ముద్దుగుమ్మలతో సోలోగా.. | Sakshi
Sakshi News home page

నలుగురు ముద్దుగుమ్మలతో సోలోగా..

Published Tue, Oct 3 2017 6:17 AM

Four heroins in solo movie

తమిళసినిమా: యువ నటుడు దుల్కర్‌సల్మాన్‌ మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి వారసుడన్న విషయం తెలిసిందే.ఈయనకు కోలీవుడ్‌లోనూ మంచి ఆదరణ లభించింది. ఇంతకు ముందు వాయై మూడి పేశవు, కాదల్‌ కణ్మణి చిత్రాల్లో నటించిన దుల్కర్‌సల్మాన్‌ తాజాగా సోలో అంటూ నలుగురు ముద్దుగుమ్మలతో వస్తున్నారు. రెఫెక్స్‌ గ్రూప్‌ అధినేత అనిల్‌జైన్‌ నెఫెక్స్‌ ఎంటర్‌టైనర్‌ పతాకంపై గెట్‌అవే ఫిలింస్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం సోలో. తమిళం, మలయాళం భాషల్లో ఏక కాలంలో రూపొందిన ఈ చిత్రానికి బిజాయ్‌నంబియార్‌ దర్శకత్వం వహించారు.

ఇందులో దుల్కర్‌సల్మాన్‌కు జంటగా సాయి ధన్సిక, నేహాశర్మ, శృతి హరిహరన్, ఆర్తీ వెంకటేశ్‌  నలుగురు అందగత్తెలు హీరోయిన్లుగా నటించడం విశేషం. అదేవిధంగా దుల్కర్‌సల్మాన్‌ ఈ చిత్రంలో నాలుగు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నారు. ఈ చిత్రం తమిళం, మలయాళం భాషలలో ఈ నెల 5వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. ఆదివారం మధ్యాహ్నం చిత్ర యూనిట్‌ చెన్నైలో విలేకరుల సమావేశాన్ని  ఏర్పాటు చేశారు. ముందుగా చిత్ర టీజర్‌ను ప్రదర్శించారు.

అనంతరం సమావేశంలో చిత్ర హీరో దుల్కర్‌సల్మాన్‌ మాట్లాడుతూ మీరిప్పుడు చూసింది టీజర్‌ మాత్రమేనని,  మెయిన్‌ చిత్రం ఇంకా అదుర్స్‌గా ఉంటుందని అన్నారు. నాలుగు కథలతో కూడిన ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని దర్శకుడు బిజాయ్‌ నంబియార్‌ తనకు కలిగించడం అదృష్టంగా భావిస్తున్నట్లు దుల్కర్‌సల్మాన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో దర్శకుడు బిజాయ్‌ నంబియార్, నేహాశర్మ, శృతిహరిహరన్, ఆర్తీవెంకటేశ్, సతీష్, నిర్మాత అనిల్‌జైన్‌ పాల్గొన్నారు. సోమవారం చిత్ర దర్శక నిర్మాతలు నటుడు రజనీకాంత్‌ను కలిసి చిత్ర ట్రైలర్‌ను ఆయనకు చూపించారు. ట్రైలర్‌ చాలా బాగుందంటూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రశంసించారని వారు తెలిపారు.

Advertisement
Advertisement