ఈ ఇద్దరి మధ్య పోరు | Cold war between Samantha and Hansika | Sakshi
Sakshi News home page

ఈ ఇద్దరి మధ్య పోరు

Apr 2 2014 3:23 AM | Updated on Sep 2 2017 5:27 AM

ఈ ఇద్దరి మధ్య పోరు

ఈ ఇద్దరి మధ్య పోరు

ఏ రంగంలో అయినా పోటీ అనేది తప్పదు అయితే అది ఆరోగ్యకరంగా ఉండాలి. సినిమా రంగంలోనూ పోటీ అనివార్యమే. ఇద్దరు హీరోల మధ్యనో, హీరోయిన్ల మధ్యనో పోటీ అనేది చిత్ర రంగంలో నిరంతరం కొనసాగుతూనే ఉంది.

 ఏ రంగంలో అయినా పోటీ అనేది తప్పదు అయితే అది ఆరోగ్యకరంగా ఉండాలి. సినిమా రంగంలోనూ పోటీ అనివార్యమే. ఇద్దరు హీరోల మధ్యనో, హీరోయిన్ల మధ్యనో పోటీ అనేది చిత్ర రంగంలో నిరంతరం కొనసాగుతూనే ఉంది. కోలీవుడ్‌లో రజనీ కాంత్, కమల్‌హాసన్‌ల మధ్య పోటీతత్వం ఎప్పుడూ ఉంటుంది. అయితే అది వృత్తిపరంగానే గానీ వ్యక్తుల మధ్య కాదు. ఆ తరువాత అజిత్, విజయ్‌ల మధ్య వృత్తి పోటీ కొనసాగుతోంది. ఇక శింబు, ధనుష్ మధ్య గట్టిపోటీనే నెలకొంది. వీరి మధ్య పోటీ కాస్త భిన్నమయ్యింది. మొదట్లో ఒకరినొకరు కలుసుకోవడానికి కూడా ఇష్టపడేవారు కాదు. అలాంటిది ఇటీవల వీరిద్దరూ మంచి దోస్తీలయిపోయారు. 
 
 ఇంతుల పోరు బాట
 పోరుకు ఇంతులేం అతీతులు కాదు. ఆ మధ్య నయనతార, త్రిషల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేంత కోల్డ్‌వార్ జరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా కోలీవుడ్‌లో ప్రత్యర్థులుగా కత్తులు దూసుకున్నా ఈ అందగత్తెలు ఇటీవల అనూహ్యంగా ఒకటయ్యారు. మా మధ్య పొరపొచ్చాలు తొలగి పోయాయి. ఇప్పుడు స్నేహం మినహా మరేమీ లేదు అంటూ ప్రకటించేశారు. ఇలా చాలా మంది హీరో హీరోయిన్లు పోటీపడి కారాలు, మిరియాలు నూరుకున్న సందర్భాలున్నాయి. వీరి మధ్య పోరుకు ప్రధాన కారణం ఒక్కటే కనిపిస్తుంది. అదే ఒకరి అవకాశాన్ని మరొకరు తన్నుకుపోవడం.
 
 తాజా పోరు జవరాణులు
 ఈతరం హీరోయిన్లలో నటి సమంత, హన్సికల మధ్య కోల్డ్‌వార్ జరుగుతోందని కోలీవుడ్ టాక్. కోలీవుడ్‌లో మిల్కీ బ్యూటీ హన్సిక హవా కొనసాగుతోంది. అత్యధిక చిత్రాల్లో నటిస్తున్న నటిగా ఈ భామ ముందు వరుసలో ఉన్నారు. తెలుగులోను తన ఉనికిని చాటుకుంటున్న హన్సికపై చెన్నై చిన్నది సమంత గుర్రుగా ఉన్నారు. టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న ఈ బ్యూటీ కోలీవుడ్‌లో హిట్ కోసం తహతహలాడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ రెండు మూడు చిత్రాలు నటించిన అమ్మడి ఖాతాలో సక్సెస్ నమోదు కాలేదు. అయితే ప్రస్తుతం స్టార్ హీరోలైన విజయ్ సరసన కత్తి చిత్రంలోను, సూర్యకు జంటగా అంజాన్ చిత్రంలోను నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల విడుదలనంతరం కోలీవుడ్‌లో తన హవా కొనసాగుతుందనే ఆశాభావంతో సమంత ఉన్నారు. 
 
 అయితే ఈ భామ దర్శక నిర్మాతల ముందు చాంతాడంత షరతుల పట్టి నుంచుతున్నారట. ప్రచార పోస్టర్లలో హీరో ఫొటోలకు సమానంగా తన ఫొటోలు ఉండాలి. ప్రచార కార్యక్రమాల్లో తనకు ప్రాముఖ్యత నివ్వాలి వంటి పలు నిబంధనలతో దర్శక నిర్మాతలకు తలనొప్పిగా మారుతున్నట్లు సమాచారం. అయితే హన్సిక ఈ విషయంలో దర్శక నిర్మాతలకు మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ఒప్పందం ప్రకారం తన పారితోషికం కరెక్ట్‌గా వచ్చేస్తే ఇతర ఏ విషయాల గురించి పట్టించుకోవడంలేదట. సినిమా పోస్టర్లపై తన ఫొటో లేకపోయినా చింతించడం లేదట. అందువల్ల సమంతకు అనుకున్న అవకాశాలు హన్సికను వరిస్తున్నాయట. ఇదే ఈ ముద్దుగుమ్మల మధ్య కోల్డ్‌వార్‌కు కారణం అంటున్నయి కోలీవుడ్ వర్గాలు.  
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement