ఓటరు జాబితాతో బయటికి వెళ్లొద్దు | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితాతో బయటికి వెళ్లొద్దు

Published Fri, Feb 23 2018 12:50 AM

Do not go out with the voter list - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఏజెంట్ల వద్ద ఉన్న ఓటరు జాబితాను పోలింగ్‌ ముగిసే వరకు బయటకు తీసుకుపోకూడదని స్పష్టం చేసింది. ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేందుకు, ఓటర్లపై ఒత్తిడి లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పోలింగ్‌ మొదలయ్యే ముందు అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు పోలింగ్‌ కేంద్రంలో ఉంటారు. వీరి వద్ద ఓటరు జాబితా ఉంటుంది. ఓటు హక్కు వినియోగించుకున్న వారి పేరు పక్కన ఈ ఏజెంట్లు టిక్‌ పెడుతుంటారు. మరోవైపు పోలింగ్‌ ఏజెంట్లకు రిలీవర్‌గా మరో వ్యక్తి వచ్చి చేరుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో మొదటి ఏజెంట్‌ బయటికి వెళ్లేటప్పుడు టిక్‌ చేసిన జాబితాను తమ వెంట తీసుకుపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. బయటికి వెళ్లే ముందు ఆయా పోలింగ్‌ కేంద్రం ప్రిసైడింగ్‌ అధికారికి ఓటరు జాబితాను ఇచ్చి వెళ్లాలని సూచించింది.  

కేసుల వివరాలు చెప్పాల్సిందే..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమపై నమోదైన కేసుల వివరాలను చెప్పాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మరో ఉత్తర్వులో పేర్కొంది. కేసులు, ఆస్తులు, విద్యార్హతలకు సంబంధించిన వివరాలను నామినేషన్‌ దాఖలు పత్రంలో పొందుపర్చాలని తెలిపింది. ఈ అఫిడవిట్‌పై ప్రతి అభ్యర్థి విధిగా మరో ఇద్దరితో సంతకాలు చేయించాలని సూచించింది. తప్పుడు వివరాలతో నామినేషన్‌ దాఖలు చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement