అన్నిటికీ అమ్మ ఉండాలంటే ఎలా? | Sakshi
Sakshi News home page

అన్నిటికీ అమ్మ ఉండాలంటే ఎలా?

Published Sun, Jan 17 2016 3:40 PM

అన్నిటికీ అమ్మ ఉండాలంటే ఎలా?

మా బాబు ఎనిమిదో తరగతి చదువు తున్నాడు. చాలా తెలివైనవాడు. ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే వస్తాడు. కానీ చదువులో తప్ప మరే విషయంలోనూ వాడికి శ్రద్ధ ఉండటం లేదు. తనంత తాను ఏ పనీ చేసుకోడు. ఇప్పటికీ అన్నీ నేనే అమర్చి పెట్టాలి. కనీసం చిన్న చిన్న పనులు చెప్పినా చేయడు. నాకు చేత కాదు అంటాడు. మగపిల్లాడు కాబట్టి షాపుకి వెళ్లి ఏవైనా తీసుకు రావడం అవీ అలవాటు చేయాలని ట్రై చేస్తున్నాను. కానీ వాడు ససేమిరా వెళ్లనంటాడు. మగపిల్లాడు సాయంగా ఉండకపోతే ఎలా? చదువొక్కటే ఉంటే చాలదు కదా? లోకజ్ఞానమూ అవసరమే కదా? వాడినెలా మార్చాలో చెప్పండి.
 - సుమిత్ర, గోదావరి ఖని

 మీరు చెప్పినట్టు చదువుతో పాటు తన పనులు తాను చేసుకోవడం కూడా అవసరమే. రేపు తను పెద్ద చదువులకు హాస్టల్‌కి వెళ్ళాల్సి వస్తే ఇబ్బంది పడతాడు కదా! మీరు తనకు అన్నీ అమర్చడం మానెయ్యండి. లేదంటే తను మారడు. మీరు కొంతవరకూ తన పనులు చేయండి. అంటే మీరు చేయాల్సినవి మాత్రమే. తను చేసుకోగలిగినవేవీ చేయకండి. తను అడిగినా ఏదో పనిలో ఉన్నాను, కుదరదు, నువ్వే చేసుకో అని కూల్‌గా చెప్పండి. వినకపోతే అరవొద్దు. వదిలేయండి. కానీ మీరు మాత్రం చేయకండి. దాంతో ఆ పని అవ్వకపోవడం వల్ల కలిగే ఇబ్బంది తనకు తెలుస్తుంది. మీరెలాగూ చేయరు కాబట్టి కచ్చితంగా తనే చేసుకుంటాడు. కాకపోతే తనకు పనులు అలవాటు అయ్యేవరకూ మాత్రం మీరు గుర్తు చేస్తూ ఉండండి. ఉదాహరణకు పరీక్షకు వెళ్తుంటే హాల్ టికెట్, పెన్ పెట్టుకున్నావా అని అడగడం లాంటివన్నమాట. అలాగే... సబ్బు అయిపోతే మీరు కొత్త సబ్బు ఇవ్వకండి. వెళ్లి తెచ్చుకొమ్మని చెప్పండి. షాంపూ, పెన్నులు, పుస్తకాలు లాంటివి తననే కొని తెచ్చుకొమ్మనండి. దాంతో మెల్లగా బయటి పనులూ అలవాటవుతాయి. కొన్నాళ్లపాటు ఇలా జరిగితే ఇక తనకు తానుగా అన్నీ చేసుకుపోతాడు. మీ మీద ఆధారపడటం మానేస్తాడు.
 
  మాది డబుల్ బెడ్‌రూమ్ హౌస్. మొదట్నుంచీ పిల్లలకు వాళ్లకంటూ ప్రత్యేక గది ఉండాలనే ఇలా తీసుకున్నాం. మా పాపకు చిన్నప్పుడే తన గదిలో తను నిద్రపోవడం అలవాటు చేశాం. కానీ ఈ మధ్య మాత్రం తను మా దగ్గరే పడుకుంటానని గొడవ చేస్తోంది. తన గదిలో నిద్రపోనంటోంది. తనిప్పుడు నాలుగో తరగతి చదువుతోంది. ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడెందుకిలా భయపడుతోందో అర్థం కావడం లేదు. ఎంత అడిగినా చెప్పడం లేదు. కారణం ఎలా తెలుసుకోవాలి?
 - కె.సుదర్శన్, హైదరాబాద్

 మొదటి నుంచీ విడిగా పడుకోవడం అలవాటు ఉన్న పాప, ఇప్పుడు సడెన్‌గా మానేసిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఒక్కోసారి పిల్లలు ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా భయపడిపోతారు. ఫ్రెండ్స్‌తో చిన్న గొడవ పడినా బెంగ పడిపోతారు. అలా తన విషయంలో ఏదైనా జరిగిందేమో తెలుసుకునే ప్రయత్నం చేయండి. టీచర్స్‌తో కూడా మాట్లాడండి. పాపతో రోజూ ఇంటరాక్ట్ అయ్యేవాళ్లు, ట్యూషన్ టీచర్ లాంటి వాళ్లను కూడా కలవండి. అలాగే పాప దేనికైనా భయపడుతోందా, దేనివల్లనైనా జడుసుకుందా అనేది కూడా గమనించండి. మీ ప్రయత్నాలేవీ ఫలించకపోతే ఒక్కసారి సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకు వెళ్లండి. అది ఒకవేళ యాంగ్జయిటీ అయినా కావొచ్చు. డాక్టర్ తెలుసుకుని కౌన్సెలింగ్ ఇస్తారు.
 
  మా పాప వయసు ఆరేళ్లు. చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కానీ మహా పెంకిది. ఏది చెప్పినా ఓ పట్టాన వినదు. తిండి దగ్గర్నుంచి రాసుకునే పెన్సిల్ వరకూ అన్నీ తనకిష్టమైనవే ఇవ్వాలి. లేకపోతే వాటిని ముట్టనైనా ముట్టదు. మూతి ముడుచుకుని కూర్చుంటుంది. బలవంతం చేస్తే ఏడ్చేస్తుంది. వేరేది లేదు అని చెప్పినా కూడా కాంప్రమైజ్ అవ్వదు. పైగా ఒక్కోసారి తన ఫ్రెండ్స్ దగ్గర ఉన్నటువంటివే తనకూ కావాలని గోల చేస్తుంది. తిట్టినా కొట్టినా ప్రయోజనం ఉండటం లేదు. తనని ఎలా దార్లో పెట్టాలో తెలియడం లేదు. సలహా ఇవ్వండి.
 - ఎస్.రమణి, విజయనగరం

 ఆరేళ్ల వయసులో పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టుగానే వింటారు. మూడు నాలుగేళ్ల వరకూ చెప్పినా వినకపోవచ్చు. మళ్లీ టీనేజ్‌లో పిల్లల్ని మేనేజ్ చేయడం కష్టం. మిగతా వయసుల్లో పిల్లలు మరీ పెంకిగా ఉంటే మనం వాళ్లను మేనేజ్ చేసే పద్ధతిని మార్చి చూడాలి. మీ పాప తనకు ఇష్టం వచ్చినవే కావాలని గొడవ చేస్తోందంటున్నారు. చాలామంది అలా చేస్తారు. అయినా కానీ మీరు ఇవ్వ కూడనివి ఇవ్వకూడదు. ఇవ్వాల్సినవి మాత్రమే ఇవ్వండి. ఎంత గొడవ చేసినా ఎవ్వరూ తన మాట వినకండి. కాస్త కఠినంగానే వ్యవహరించండి. ఏడుస్తుంది, అలిగి బిగిసిపోతుంది. కానీ ఎంతసేపని! ఎవ్వరూ పట్టించుకోకపోతే తనే దారికి వచ్చేస్తుంది. ఏం చేసినా తన మాట చెల్లదని తెలిసి మీరు ఇచ్చినవే తీసుకుంటుంది. మొదట్లోనే ఇది అలవాటు చెయ్యకపోతే పెద్దయ్యేకొద్దీ ఇబ్బంది. కాబట్టి కాస్త కఠినంగా ఉండండి.
 
 డా॥పద్మ పాల్వాయ్
 చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్‌బో హాస్పిటల్,
 హైదరాబాద్

 

Advertisement
Advertisement