చలం చూపిన ముక్తి మార్గం

Kathasaram About Chalam Mukthimargam Book - Sakshi

కథాసారం

సిద్ధులూ, బైరాగులూ, సన్యాసులూ, వీళ్లందరి దగ్గిరా మహత్తరమైన మూలికలుంటాయనీ, కటాక్షం కలిగినప్పుడు భక్తులకూ, తదితరులకూ, వాటిని అవ్యాజంగా యిస్తారనీ అందరికీ నమ్మకమైన విషయమే! నా తలనెప్పి బాధ కూడా పోగొట్టుకోడానికని అట్లా ఏదన్నా లభ్యమౌతుందేమోనని ఆశపడి, బూడిద పూసుకున్న ప్రతివాడి వెనకా తిరుగుతున్నాను రామేశ్వరంలో. వాళ్ల భాష నాకు రాకపోవడం గట్టి చిక్కొచ్చింది. వొచ్చిరాని అరవంలో ఒక బోసిమునిని తల చూపి మందిమ్మని అడిగేటప్పటికి, ‘‘ముసలి యోగిని, నాకో కాలనాయిమ్మ’’ని వెంటపడ్డాడు. ఇంకోడు తన వొంటి బూడిద నా తలకి రాసి, పావలా డబ్బులు లాగాడు. అరవ సన్యాసులు, మలయాళ యతులు, పంజాబు బైరాగులు, బెంగాలీ జోగులు, అందరూ వున్నారుగాని, ఒక తెనుగు బూడిదవాడెవడూ కనిపించలేదు, అర్థమయ్యేట్టు నా బాధ చెప్పుకోవాలంటే.

ఇంక మా వూరికి తిరిగిపోదామనుకుంటో, గంధమాధనం చూసి మరీ పోదామని బైలుదేరాను. బైలుదేరేప్పటికే నాలుగున్నర దాటింది. మెల్లిగా యిసికలో కాళ్లీడ్చుకుంటో పోగాపోగా గంధమాధన శిఖర దర్శన మయ్యేప్పటికే సూర్యుడు కుంకుతున్నాడు. ఈ పర్రలన్నీ రాముడూ తమ్ముడూ యెట్లా తిరిగారా, వాళ్లకి ఏం తోచిందా, అన్ని రోజులు యిద్దరూ ఏం మాట్టాడుకుంటున్నారా, అనుకున్నాను. ఒక ఆడది వుంటే, యెన్ని కబుర్లన్నా వొస్తాయి. కాలం తెలీకండా గడిచిపోతుంది. కాని యిద్దరు మొగాళ్లు– అందులో అన్నతమ్ములు– వాళ్లని తలుచుకుంటే జాలేసింది.
 

కవికేం? మూడు నెలలు చాలా సుఖంగా సంచరించారు, అని ఒక పద్యంలో మూడు నెలల కాలం అర నిమిషంలో కొట్టేస్తాడు. దోవలో, ముళ్లు రాళ్లు, పాములు, యివి కవి కంటికి కనిపించవు. ఎక్కడ పడుకున్నారు? ఏం తిన్నారు? అని ఆలోచనే అక్కర్లేదు. ఆకులు తిని సుఖంగా బతికారని సులభంగా అంటాడు ఒక కందపద్యంలో. ఏ ఆకులు, అవి రుచి యెట్లా వున్నాయి, నోరు పొక్కి యెంత యేడ్చారు, జీర్ణమెట్లా ఐనాయి, అర్నెల్లు తిన్న తరువాత ఆ మనుషులు గుర్తుపట్టేట్టు వున్నారా, ఆ సంగతి యేమీ మాట్టాడడు కవి. పోనీ ఆర్నెల్లు కాదు, ఆరు రోజులు నువ్వు ఆ అడివి ఆకులు తినివుండు ఆనందంగా అని ఆ కవిని నట్టడివిలో వొదిలితే తెలుస్తుంది ఆ రాతలేమిటో.

ఆ పర్వతాన్ని హనుమంతుడు తొక్కాడుగావును ఇప్పుడు వుత్తగుట్ట. దానిమీద వున్న గుడి మీద, గుడిమీద వున్న డాబా మీద ఎక్కాను. ఆ పర్వతం మీదనించి రాముడు మొదట చూశాట్ట లంకని. లంక కోసం వెతికాను గాని కనపళ్లేదు. కాని దృశ్యం మాత్రం అతి గంభీరమైనది. రాముడంతటి చక్రవర్తి చూడతగినది. ఆ గుట్టమీద రామలక్ష్మణులు ఆజానుబాహులు నుంచుని, మూడు వేపుల సముద్రాలనూ, ఆ యిసిక పర్వతాలనూ, ఆ పెద్ద సమప్రదేశాలనూ, పరిశీలించడం తలుచుకున్నాను. అట్లా ధ్యానంలో పడ్డాను. మెల్లిగా చీకట్లు కమ్మాయి.

చంద్రుడు బలం తెచ్చుకుంటున్నాడు. సముద్రం మీద పక్షులు గట్లకు వొస్తో అరుస్తున్నాయి. స్పష్టంగా కనబడే చెట్లూ కొండలూ, చీకట్లో దాక్కుంటున్నాయి. వెనకాల యెవరో ‘‘జయ్‌ శీతారామ్‌’’ అన్నారు. మొదట వాల్మీకి వొచ్చాడనుకున్నా– బాగా బలిసిన పెద్ద శరీరము వాడు, పెద్ద గడ్డము, రుద్రాక్షలూ, కమండలము కలవాడొకడు వొచ్చి మంటపం దగ్గిరగా కూచున్నాడు. ఆయన ముఖం స్పష్టంగా కనపడకపోయినా, ఆయన తప్పక నా బాధ మాన్పగలడనిపించింది. సమీపానికి వెళ్లి కూచున్నాను.
‘‘ఏ వూరు అబ్బాయీ’’ అని గోదావరి జిల్లా తెలుగులో పలకరించాడు. నా ఘోష చెప్పుకున్నాను. అంతా కళ్లుమూసుక విన్నాడు. ఆనాటితో నా బాధ గట్టెక్కిందనే ధైర్యం యెక్కువైపోయింది.

‘‘ఈ తలనొప్పి వొక్కటేనా నీ బాధ?’’
‘‘ఇంకేం లేదు– అదే నా ప్రాణం తీసేస్తోంది.’’
‘‘తలనొప్పి కుదురుస్తాననుకో. ఇంక బాధలుండవా? తరవాత?’’
‘‘వుండకేం? మానవజన్మ మెత్తింతరవాత వుండకండా వుంటాయా? అప్పుడు చూసుకుంటాను వాటి సంగతి.’’
‘‘అవును. మానవ జన్మమే బాధ– ఒకటిపోతే ఇంకోటి, ఒకటి లేకపోతే యింకోటి, అసలు బాధ లేని వుపాయం, కనిపెట్టాలిగా–’’
‘‘అసలు బాధలేని వుపాయం ఏముంది– చావు తప్ప.’’

‘‘చస్తే బాధలు పోతాయా? పోతే అందరూ చత్తురు, కాని వొకటే సాధనం– ముక్తి.’’
యోగుల చిట్కాలలో నమ్మకమున్నా, వాళ్ల మహిమల్లో మంత్రాలలో నమ్మకం లేదు నాకు. అందులో ముక్తి, స్వర్గం అంటే, ముసలమ్మ కబుర్ల లాగుంటాయి నాకు.
‘‘ముక్తి అంటే–’’

‘‘ముక్తి అంటే– జన్మ రాహిత్యం.’’
‘‘ఈ తలనొప్పులతో, యీ బాధలతో, దారిద్య్రంతో అన్నిటితోటీ కూడా జీవితమంటే నాకు చాలా మధురంగా వుంది. జీవితం లేకుండా శూన్యం తలుచుకుంటేనే నాకు భయం కలుగుతుంది, నాకు జన్మరాహిత్యం వొద్దు.’’

నవ్వాడు– పెద్ద వుపన్యాసానికి తయారవుతున్నట్టు కాళ్లూ, వెన్నూ సద్దుకున్నాడు. నా తలనొప్పి కుదురుతుందనే ఆశలు అడుగంటుతున్నాయి. పైగా అర్ధరాత్రి దాకా, యీ వేదాంతోపన్యాసం పట్టుకుందే, వొదిలించుకోటం యెట్లా?
‘‘నీకు జన్మరాహిత్యం వొద్దుగాని, ఏం కావాలి?’’

‘‘ధనము, కీర్తి, ఆరోగ్యం, అధికారం.’’
‘‘ఇవన్నీ యెందుకు నీకు?’’
‘‘వాటివల్ల నాకు ఆనందం.’’
‘‘కనక నీకు కావలసింది, ఆనందం– వీటన్నిట్లోనూ కావాలి? 
ఒకటే సూత్రం వుంది– ఆనందం– తిండిలో, నిద్రలో, అధికారంలో, అన్నిటిలోనూ ఆనందమే ప్రధానం– కాని కొన్ని చిన్ని ఆనందాలు, కొన్ని గొప్పవీ, కొన్ని క్షణినులూ, కొన్ని దీర్ఘాలూ– కాని అన్నిటిలోనూ కలిసి మిశ్రమములై బాధలు వున్నాయి. అనంతమై, అత్యున్నతమై, బాధరహితమైన ఆనందాన్ని ముక్తి అంటాము– కడుపు నొప్పీ వెగటూ లేని తిండీ– భయము లేని కీర్తీ, అధికారమూ, అలసట లేని మైధునమూ, విసుగు లేని రాగమూ– యివన్నీ కలిసి యింతే కాదు, నీ మనసుకు అందని అనేక కోట్ల సౌఖ్యాలు ఏకమైన ఆనందం ముక్తి.’’

‘‘ముక్తి ఆనందమా? ముక్తి అంటే జన్మరాహిత్యం కాదూ?’’
‘‘అవును. జన్మరాహిత్య మెప్పుడవుతుంది? పరమాత్మలో ఐక్యమైనప్పుడు. ఆ ఐక్యం కావడమే, నిరంతర అవ్యయానందం ఆ లోకంలో కూడా.
‘ఆనందం అంటే ఐక్యం.’– దుడ్డుతో, పువ్వు వాసనతో, రంగుల కాంతితో, ఐక్యం కావడం ఆనందం. వీటికన్నిటికీ కారణమైన పరమాత్మతో ఐక్యం కావడం ముక్తి. జీవాత్మా, పరమాత్మా సంయోగం.’’

‘‘యెట్లా అది పొందడం?’’
‘‘అసాధ్యం. ఎట్లా పిల్లవాడికి స్త్రీవాంఛ అసంభవమో అట్లానే మీరందరూ పిల్లలు– యీ విద్యలో– ఆ యౌవనం పదేళ్లలో వొస్తుంది. ఈ యౌవనం పది యుగాల్లో కూడా రాదు.’’
‘‘ఐతే ఎందుకీ ఉపన్యాసం?’’ అన్నాను వొళ్లు మండి.
‘‘తొరగా ఎదగమని చెపుతున్నాను.’’
‘‘ఎట్లా?’’

‘‘ముందు రాబోయే మహదానందం అనేక రూపాల మీకు ధ్వనిస్తోనే వుంది. ఈ పరమాత్మకీ జీవాత్మకీ సంయోగంలో వుండే మాధుర్యం– జీవాత్మకీ, జీవాత్మకీ సంయోగంలో కనపడుతోంది. అదే ప్రేమ. ఆ ఆత్మలు నివసించే దేహాల సంయోగంలో వుంది ఆ మాధుర్యం. తలుచుకో– ప్రతి నరమూ, ప్రతి అవయవమూ, ఆవేశంతో వొణికిపోతూవుంటే, మనసూ ప్రాణమూ ఏకాగ్రమై, ఐక్యమైపోయే సమయంలోని ఆనందం– అదే ముక్తి. కోర్కెలు, తలపులు, భావనలు, అన్ని యింకో వ్యక్తితో ఐక్యమైన ప్రేమని తలుచుకో. అదే ముక్తి. అది కొన్ని నిమిషాలే లభ్యమౌతుంది జీవులకి, కాని పరమాత్మలో ఆ అనుభవం అనంతమౌతుంది. అన్ని అనుభవాలలోకీ శ్రేష్టమూ, అప్రమేయమూ, సంయోగం– అది సృష్టికర్త చెందే అనుభవము– ఇంకో నూతన ప్రాణిని కల్పించే ఆనందం–’’
‘‘ముక్తి సాధన అదేనా?’’

‘‘సందేహం లేకండా. ఆత్మవికాసమే ముక్తి మార్గం. యోగం, జ్ఞానం, కర్మ, భక్తి అన్నీ కూడా ఆత్మవికాసానికి సాధనాలు. ఈ ప్రపంచంతో ఎంత ఐక్యమైతే అంత ఆత్మవికాసం కలుగుతుంది. ప్రపంచమంటే సృష్టి. సృష్టి శరీరాల ఐక్యం వల్ల కలుగుతోంది. ముక్తి అంటే ఐక్యం. ముక్తి వల్ల సృష్టి కల్గుతోంది. సృష్టి మళ్లీ ముక్తి పొందుతోంది. ఈ నదులు, పర్వతాలు, వృక్షాలు, జంతువులు, మనుషులు, అందరూ నీవే అనే ఐక్యభావం రావాలి. ఈ భావం ప్రతివాడికి సంయోగంలోని రెండు నిమిషాలలోనూ తోస్తోంది. అవునా? కనక ఆ కార్యంలో ప్రతి వ్యక్తీ ముక్తిని రుచి చూస్తున్నాడు. ఆత్మ వికాసానికి ముఖ్య సాధనం సంయోగం, ఏ వ్యక్తి ఆ జాతి వ్యక్తితో ఎంతమందితో, ఎన్ని విధాల సంయోగం పొందుతాడో అంత ముక్తికి సన్నిహితుడౌతాడు.

‘‘మరి పాపమంటారు?’’
‘‘అంటారు– పాపమేమిటి? ఆత్మవికాసమే, ముక్తి పాపం యీ మూర్ఖులకి. వాళ్లకి ఆనందం తెలుసా? వృక్షాలకు తెలుసు. కీటకాలకు అంతకన్న ఆనందం తెలుసు. జంతువులకి యింకా కొంత. మనుషులకి అధికానందముంది దాంటో. అందులో రసికులూ, ఆత్మ ఔన్నత్యం కలిగినవాళ్లూ, పరిపక్వం చెందినవాళ్లూ, ఇంకా అతీతమైన ఉన్నతావస్థను పొందుతారు. క్షుద్రులకు ఆ ఆకర్షణే వుండదు. పశుప్రాయులు వాళ్లకి ఆత్మవికాసం లేదు. ఒక్క వ్యక్తి అనుభవంతో– ఏం జంతువైతేనేం– దాంతో తృప్తి పడతారు– ఆత్మ యెప్పుడూ ముక్తికోసం బాధపడుతుంది. పరమాత్మ పిలుపు విని రెక్కలు కొట్టుకుని విజృంభించడానికి ప్రయత్నిస్తుంది. ఈశ్వరుడు సౌందర్యమూర్తి, సౌందర్యమంతా ఈశ్వరుడు. సౌందర్యమే ఆనందం. సుందర తేజం, సుందర ధ్వని, సుందర రసన– సౌందర్యాన్ని గుర్తించి అన్వేషించి వాంఛించనివాడు అధముడు. సౌందర్యంతో– వివిధ రూపాలు, వివిధములైన మార్పులు పొందే, సౌందర్యాన్ని అనుభవించడంలోనే ఆనందం– ఇంతకన్న ఆనందదాయకమైనది ఆ ముక్తి మాత్రమే!

ఎంత రసికుడో, యెంత సౌందర్యోపాసకుడో, అంత యీశ్వర ప్రియుడు– ఎంత అనుభవాన్ని వాంఛిస్తాడో, ఎంత సంయోగాన్ని పొందుతాడో అంత ఈశ్వరుణ్ణి ప్రేమిస్తాడు. ఎన్ని విధాలైన సౌందర్యంతో యెంత మంది వ్యక్తులతో ఐక్యమౌతాడో, యెంతమంది స్త్రీలను ప్రేమించి కామిస్తాడో, అంత ఆత్మవికాసం పొందుతాడు.’’
దిగ్భ్రమ చెంది కళ్లు తెరిచాను. యోగి అంతర్థానమైనాడు నా తలనొప్పితో సహా. నా చుట్టూ ప్రపంచమంతా వెన్నెట్లో ముకురించుకుని పడుకుంది. నా హృదయంలో నూతన జ్ఞాన జ్యోతి వుదయించింది.

చలం (18 మే 1894– 4 మే 1979) కథ ‘ముక్తిమార్గం’ ఇది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒకే ఒక్క పేరు చెప్పవలసివస్తే, ఆయన ఒక్క పేరే చెప్పవలసినంతటి రచయిత చలం. కథలు, నవలలు, నాటకాలు, మ్యూజింగ్స్, లేఖలు, ఇట్లా అన్నింటా ప్రతి వాక్యమూ సాహిత్యంగా బతికినవాడు. పురూరవ, మైదానం, జీవితాదర్శం, అమీనా ఆయన రచనల్లో కొన్ని.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top