అధికారులు మాట వినడం లేదు | Sakshi
Sakshi News home page

అధికారులు మాట వినడం లేదు

Published Mon, Jul 25 2016 12:12 AM

అధికారులు మాట వినడం లేదు - Sakshi

సాక్షి, విజయవాడ : ‘అధికార పార్టీలో ఉన్నామనే కాని.. కనీసం  కిందస్థాయి ఉద్యోగులైనా మా మాట వినడంలేదు..  మాతో సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ఇందిరమ్మ ఇళ్లు  ఇవ్వలేదు.. రైతు రుణమాఫీలోనూ అనేక లోపాలు ఉన్నాయి.. వాటిని సరి దిద్దకపోవడంతో ప్రజల్లో పార్టీ పలచనైపోతోందంటూ..’ జిల్లాలో  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రుల ముందు  ఏకరవు పెట్టారు. టీడీపీ విజయవాడ తూర్పు, పశ్చిమ, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు నియోజకవర్గాల సమన్వయకమిటీ సమావేశాలు విజయవాడలో జలవనరులశాఖ మంత్రి దేవి నేని ఉమామహేశ్వరరావు కార్యాలయం లో ఆదివారం వేర్వేరుగా జరిగాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) తదితరులు పాల్గొన్న ఈ సమావేశాలు వేడిగావాడిగా సాగాయి. ఒక దశలో నాయకులు అడిగే ప్రశ్నలకు మంత్రులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 
∙విజయవాడ తూర్పు నియోజకవర్గం సమావేశంలో అధికారులు ముందస్తు సమాచారం లేకుండా కృష్ణలంకలో ఇళ్లు తొలగించడంపై పలువురు సమన్వయ కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇష్టానుసారంగా ఇళ్లు తీసివేయడంతో ప్రజలు మనకు దూరం అయ్యారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇందుకు బాధ్యులైన అధికారులను బదిలీ చేయాలని పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు.  
∙పశ్చిమ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలని పలువురు నాయకులు  కోరారు. పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి జేఎన్‌ఎన్యూఆర్‌ఎం ఇళ్లు ఇప్పిం చేందుకు దరఖాస్తులంటూ రూ. 200 చొప్పున వసూలు చేస్తున్నారని, దీనివల్ల ప్రజల్లో పార్టీ చులకనై పోతోందని  మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. 
∙నూజివీడులో ఎంపీ మాగంటిబాబు, నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్రగడ వెంకటేశ్వరరావు మధ్య విభేదాలు నూజివీడు సమన్వయ కమిటీ సమావేశంలో చర్చ కు వచ్చాయి. కనీసం తమతో సంప్రదించకుండా, ఎంపీ  ప్రారంబోత్సవాలు, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ముద్రగడ వర్గం ఆరోపించింది.  
∙తిరువూరులో తాగునీరు లేక గ్రామాల్లో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని సభ్యులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గంలో డ్రెయినేజీæ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. 
∙ జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో రుణమాఫీ సరిగా జరగడం లేదని, అనేక మందికి రుణ విమోచన పత్రాలు వచ్చినా పేర్లు తప్పుగా వున్నాయని, కొంతమందికి అసలు పత్రాలే రాలేదని చెప్పారు. గ్రామాల్లోకి వెళ్లి రైతులకు సమాధానం చెప్పడం కష్టంగా ఉందని నాయకులు వాపోయారు.  మంత్రులు వారికి సర్ధిచెప్పారు.
 
పేదలను బతకనివ్వరా
టీడీపీ ప్రభుత్వ హయాంలో నగరంలో పేదలను బతకనివ్వరనే అభిప్రాయం బలపడుతోందని ఓ నియోజకవర్గం సమావేశంలో నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ నియోజకవర్గంలో జరిగిన, జరుగుతున్న అన్యాయం మరెక్కడైనా జరిగిందా చెప్పాలని మంత్రులను నిలదీసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నగరంలో పేదలకు సంబంధించిన ఇళ్లు మాత్రమే అధికారులకు కనిపిస్తున్నాయా? పెద్దలకు చెందిన ఆక్రమణలు నగరంలో ఎక్కడా లేవా? పాలకపక్షం సామాజికవర్గానికి చెందిన వారి ఆస్తులకు ఎక్కడైనా నష్టం వాటిల్లిందా? ప్రధాన మార్గంలో నట్టనడుమ ఉన్న భవంతులు, హోటళ్ల జోలికి మాత్రం వెళ్లరు. గుడులు, మసీదులు, ప్రభుత్వ కార్యాలయాలను మాత్రం అడ్డదిడ్డంగా కొట్టేస్తారు. కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వరు? ఇదేనా ప్రభుత్వ పాలన అని ఓ నాయకుడు నిలదీశారు. నగరంలో నేనూ నాయకుడినే. ప్రజాప్రతిని«ధినే. మా ప్రాంతంలోని వ్యాపారాలను తీసేశారు. నాకు, నా కుటుంబ సభ్యులకు చెందిన షాపులు పోయాయి. నెలకు కనీసం రూ.15 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. అదేవిధంగా రోడ్డు నిర్మాణం పేరిట ఆ ప్రాంతంలోని భవనాల ధరలను తగ్గించేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఏం మీ సామాజికవర్గానికి చెందిన వారి ఆస్తులుగాని, వ్యాపారాలు గాని నగరంలో ఎక్కడైనా, ఎవరివైనా దెబ్బతిన్నాయా చెప్పండని నిలదీయడంతో మంత్రులు పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు నోట మాట రాలేదని సమాచారం. నగరంలో మీ సామాజికవర్గానికి ఒక న్యాయం, బీసీలు, పేదలకు మరో న్యాయమా అనడంతో అన్నింటినీ చూద్దామంటూ సరిచెప్పడానికి మంత్రులు ప్రయత్నించారని తెలిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement